Saturday, November 24, 2012

అన్న ప్రేమ



నిండు జాబిలి మోముని చూసి,
నా చిన్ని చెల్లిని తనలో తలచి,
నాలోని నలతని నవ్వుగ మలిచి,
ఆనందించే అన్నని నేను...

నా బుజ్జి చెల్లి నాచెంత లేదని,
రెట్టింపు ఆశతో నింగిని చూస్తే...

పున్నమి అయినా చంద్రుడు లేడు,
మేఘపు మేనిలొ కనుమరుగైనాడు...
పేరుకు మాత్రం రేయికి ఱేడు,
అంబుధి దాడికి తలవంచాడు....

అనుదినమూ తొలి వేకువజామున,
పక్షులు పలికే కిలకిలలోన,
నా చెల్లి పలుకులో తొలుకుతు ఉన్న,
తీపిని తలిచే అన్నని నేను...

నా చిన్ని చెల్లి నా చెంత లేదని,
రెట్టింపు ఆశతో నా చుట్టూ చూస్తే....

వేకువ అయినా కిలకిలలే లేవు,
పక్షి మోమున కలనే లేదు...
చలిలో పాపం చలనమె లేదు..
విహంగమైనా విహరించుటలేదు....

నా మేనును తాకే చిరుగాలులలోన,
అది నాపై వదిలే చల్లదనాన,
నా చెల్లి స్పర్శనే మనసారా తలచి,
చిరుగాలికి నే ఎదురుగ నిలిచి,
ఆనందించే అన్నని నేను....

నా బుజ్జి చెల్లి నా చెంత లేదని,
రెట్టింపు ఆశతో నే బయటకు వస్తే...

ఏవైపు చూసినా చిరుగాలే లేదు..
ఎంత వెతికినా తన జాడే లేదు...
గాలికి కూడా జాలే లేదు,
అన్న ప్రేమని ఆలకించదు...

నా చెల్లి స్మృతులు నను చేరనీయక,
నాలోని గతులు గతమంచు చేరక...
ప్రాణుల మొదలు, ప్రకృతి వరకు,
కక్షకట్టి నను బాధపెట్టినా..
కరుణ వీడి నను ఏడిపించినా...

నా హృదయం చేసే స్పందనలోన,
తన బుడి బుడి అడుగుల సవ్వడి వింటూ,
తను తడబడకుండా వెంటే ఉంటూ..
ఆనందించే అన్నని నేను...

స్పందనలన్నీ ఆగే వరకు,
నా జీవితగమనం సాగే వరకు...
నా చెల్లి తలపు నను వీడబోదులే...
నవ్వు మోము నను వదలబోదులే....

2 Comments:

At November 16, 2015 at 2:44 PM , Anonymous Anonymous said...

Excellent

 
At February 28, 2018 at 12:31 AM , Anonymous Anonymous said...

you should publish a book one day :)

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home