Monday, April 6, 2020

ప్రకృతిలో నీతులు - 4



పది అంగుళాల పూలమొక్క, సువాసనలనిస్తుంటే,
పాతికడుగులున్న వెదురుపొదే, తన ఎత్తును చాటుతుంది..
ఎత్తొకటే కాదెపుడూ, ఎదుగుదలకి కొలమానము,
ఆస్తొకటే తేల్చలేదు, ఓ మనిషికున్న విలువను...

సమస్తాన్ని దహించగలుగు ఉష్ణము తన చెంతున్నా,
గగనచరుల వెలుగుపంచు, గుణమే తనకుంది అని...
రవినే రాజన్నారు, తన వల్ల కాంతి పొందారు...
ధనమూ అధికారము, కావసలే కొలమానము,
జనము మెచ్చు రాజుకు, గుణమే ప్రప్రధమము...

వరదపొంగు వానలని, వడదెబ్బల ఎండలని,
సుడిగుండపు గాలులని, చలికత్తుల పొగమంచులని,
మన భూమాతకె తప్పలేదు, ఆ దేవుడి పరీక్షలు..
ఇక మనమెంతని, ఆ అంతులేని విధిరాతముందు..

తూర్పూ పడమర కూడా, శోకము సౌఖ్యము లాగే..
సూర్యుడు ఆ దిక్కులను, మనుషులు సుఖదఃఖాలను,
దాటి నడవలేరు కదా, యుగాలెన్ని గడిచినా,
ఓవైపు నిలవలేరు కదా, శోభో సుఖమో ఉందని...

శిసిరాలకు శిరస్సు వంచి, వనాలు నేల కూలవు..
వసంతాన వర్ణాలతో, తిరిగి వికసించక మానవు...
సంకల్పం తోడుంటే, ఏ సమస్యైన చిన్నదే...
శ్రమపడేటి తత్వముంటే, ఆ సవాలైన సాధ్యమే...

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home