Tuesday, April 11, 2017

అసలైన మరణం


అనుక్షణం కొట్టుకునే మన గుండె ఆగిపోతేనా మరణం ?
ఊపిరి ఆడక మనకు శ్వాస అందకపోతేనా మరణం ?
మన కాయం ఇక కదలలేక శిలలా పడితేనా మరణం ?
ఈ శరీరమే ఇక శవమై పిలవబడితేనా మన మరణం ?

నా వరకైతే మరణమంటే ఇంకేదో ఉంది...
అది ప్రతిరోజూ ఏదోలా మనతోనే ఉంటుంది..
ప్రతి మనిషీ జీవితాన అది వేల సార్లు వస్తుంది..
వద్దన్నా ఊరుకోక గుర్తు చేసి వెళ్తుంటుంది...

మనసుకు నచ్చిన మనిషి మనకు దక్కక ఒక మరణం,
ఆ మనిషికి మన కళ్ళముందె మరో పెళ్ళి అవుతుంటే మరణం...

మనవాళ్ళే మన మనసును లెక్కచేయకుంటె మరణం,
మన మనసు ముక్కలైనా నవ్వుతుండటమే మరణం..

స్థోమత లేదని మనము పైచదువులు వదిలేస్తే మరణం,
కుటుంబాల కోసమని మన లక్ష్యాలను త్యజిస్తుంటె మరణం...

చదువు ముగిసి నెలలవుతున్నా ఉద్యోగం రాకుంటే మరణం..
మన బంధువుల సూటి ప్రశ్నలకు బదులివ్వలేక మరణం..

చేసిన ప్రతి ప్రయత్నమూ విఫలమౌతుంటే మరణం,
వెన్ను తట్టి మన వెనకుండే వాళ్ళు లేకుంటే మరణం...

చేయాలని మనసున్నా, మనకు పని దొరకక ఒక మరణం...
నెల సంపాదన మన ఇంటినె పోషించలేక ఒక మరణం..

మనవాళ్లే మారిపోయి మోసగిస్తుంటే మరణం..
మోసగించి మురిపెంగా పలకరిస్తుంటే మరణం...

కళ్లముందె జరుగుతున్న అన్యాయాన్ని ఆపలేక ఒక మరణం..
సమాజమనే సంగతిన ఉన్న అపశ్రుతిని సవరించలేక మరణం..

ఎదిగిన కొడుకులు సైతం తలకు బరువు అవుతుంటే మరణం..
ఆ కొడుకుల ఘనకార్యాలకు పరువు పోతుంటే మరణం..

మన సొంతవాళ్ళు మరణిస్తే అది మనకు పెద్ద మరణం,
ఆ లోటు మనకు తీరక బతకలేక పోవటమే మరణం..

"మరణం చెంతకు రాదే" అని చింతించుట ఒక మరణం..
బతుకంటేనే ఆశలేని ఆ బతుకునున్న చిత్రవధే ఒక మరణం..

బతుకు అనే గమనమందు ప్రతి గడియలోను మరణం..
మరణం గది చేరుదాక గడి గడిలోనూ మరణం..







0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home