ఓ సగటు ఇల్లాలి ఆవేదన (తన మాటల్లో...)
అమ్మని ఓ దేవతగా, ఆలిని మహారాణిలా,
తోబుట్టువుకో నీడగా, తన బిడ్డని యువరాణిలా,
తనవాళ్ళకు ఓ తోడుగా, పరస్త్రీలకి సోదరునిలా,
మగువ విలువ తెలుసుకున్న, రారాజులు ఉన్నారు...
మహిళలనే మోసగించు, మృగాళ్ళ మానభంగాలని,
చిన్నపిల్లలనీ చూడలేని, కామాంధుల క్రీడలని,
భార్యను బానిసగ చేయు, భర్తల గృహహింసలని,
పడతి ప్రాణమానాలను, హరియించే రాక్షసులూ ఉన్నారు...
ఈ ఇరువురికీ మధ్యలో ఉంటారీ మగాళ్ళు..
వివరిస్తే వారిలోనె, ఎన్నెన్నో వర్గాలు...
ఆ అందరిలో కొందరే, నాలాంటివాల్ల మొగుళ్ళు..
వీళ్ళు మంచి అనే ముసుగుతోన, మగజాతికె తెగుల్లు..
మనువు మునుపు మాటల్లో, ప్రేమొకటే ఇస్తారు...
మనసొకటే చూసామని, వివరించి మరీ చెబుతారు..
ఆస్తీ కట్నము కావు, కారణాలు అంటారు..
మనకు తగినవారు తామే అని, అలవోకగ నమ్మిస్తారు..
అగమంతటి ఆశతోన, మనము మనువువైపు వెళ్తాము..
ప్రతి బాధల్లో భరోసాగ, నిలుస్తాడని నమ్ముతాము...
మాతాపితలకు ప్రతిగా, పతి ఉంటాడని అనుకుంటాము...
మనసారా నమ్మి మనము, తన వేలుపట్టి నడుస్తాము..
తోరణాల తొలినాళ్ళు, ఘనంగానె గడుస్తాయి..
మునుపు విన్న మాటల్లా, అందంగానే ఉంటాయి..
గడిచే కాలం కొద్దీ, గుణము బయటపడుతుంది...
జరిగే ప్రతి పొరపాటుకు, గళము పెరుగుతుంటుంది...
అర్ధాంగి తెచ్చు కనకము, మామగారు ఇచ్చు కట్నము..
అమ్మాయి ఉద్యోగపు వేతనము, అత్తగారి ఆస్తుల్లో భాగము...
ఏది ఎంత మొత్తంలో వస్తున్నా, అది తాత్కాలిక తృప్తికే...
ఎన్ని నదులు తనలో కలిసినా, సంద్రం తృష్ణమేమొ తీరదే...
బంధం బాధగ మారి, బరువవుతూ ఉంటుంది..
బాధల బారం పెరిగి, గడిచే కాలం గతి తగ్గుతుంది..
చనువు సన్నగిల్లి మరీ, అది భయంగానె మారుతుంది..
మనువు, అర్థాన్నే కోల్పోయి, పడతిని పనియంత్రంగా చేస్తుంది..
సరదాలను చంపుకుని, సంసారం సాగించినా...
గోడును గది దాటనీయకుండ, గుట్టుగానె బతికినా..
నయనం నిద్రను వీడి, రాత్రులు కన్నీటిని చేరుతుంది..
నువు కోరుకున్న జీవితం, ఇదేనా అని అడుగుతుంది..
అత్త ముందు మాటరాక, ఆడపడుచు అండలేక,
భర్తను జయించలేక, నాన్న బరువు పెంచలేక,
గతంలోకి నడవలేక, ప్రస్థుతాన నిలువలేక,
బాధను భరించలేక, అమ్మను బాధించలేక...
దినదినమూ దిగులు పెరిగి, ఆశ ఆవిరి అయిపోతుంది..
కణకణమూ కలత చెంది, నవ్వు నాశనమైపోతుంది..
వివాహంగ మొదలైనది, విడాకులై పోరాదని..
చట్టాల ధరికి చేరలేక, చుట్టాల ముందు చిన్నబోలేక,
నకిలీ నవ్వును మోముకు, ముసుగులాగ వేసుకుని..
తరగని బాధల బరువును, మనసులోనె దాచుకుని..
పరులతోటి పలకరింపులని, సుతిమెత్తగ సాగిస్తాము..
ప్రశ్నల ప్రతి బదులుకు, సంతోషాల పూత పూస్తాము..
పేగు పంచుకున్న పిల్లలే, సగటు ఇల్లాలికి సంపద..
ప్రాణం పోసుకున్న పుట్టిల్లే, తనకెన్నటికీ భద్రత...
నాటి పుట్టింటిలోని యువరాణులం..
నేటి మెట్టినింట మహారాణిగ కాకున్నా,
ఓ మహిళగానైనా చూడండి...
అమ్మనాన్న మనసులో అపురూపమైన సొత్తులం..
అత్తగారి ఇంటిలోని తాళాల గుత్తులేవి లేకున్నా,
మీ తోటి మనిషిగైన గుర్తించండి...

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home