Monday, June 15, 2020

కన్నవాళ్ళపై ప్రేమ

అమ్మా నీ ఆనందము, మా ఉనికికి అది ఆధారము..
నాన్నా నీ జీవితము, మా నడతకి అది మూలము..
అమ్మా నీ నవ్వు చాలు, చేరలేదు మము ఏ శోకము...
నాన్నా నీ మాట చాలు, చరపలేదు మము ఏ కష్టము …

నాన్నా, మా జీవితాన దక్కిన ఓ వరమే నువ్వు...
మా సుఖమే నీ ఆశయంగ తలచిన ఓ ఋషివైనావు..

పరుల హాని తలపెట్టే, తలపే మాకుండద్దని,
ప్రతిదినమూ సాటివారికి, సాయం చేస్తుండాలని,
అవసరాలు ఎన్ని పెరిగినా, అపద్దాలు చెప్పద్దని,
చదువు వంట పట్టకున్నా, గుణము వెంట నడవండని...

అనుదినమూ ఓ గురువువై, మాకు అక్షరాలు దిద్దావు,
ఆదర్శమైన ఈ గుణాలనే, మా లక్షణాలుగ మార్చావు...

ధనమూ లాభము కావు, ముఖ్యము అని అన్నావు,
మంచీ మనుషులు మాత్రమె, శాస్వతమని చెప్పావు...
ఈ గుణసంపద ఎన్నటికీ, మము వీడబోదులే నాన్నా,
రోజులెలా మారినా, రాజువి మా గుండెలోన...

మనసంతా మమతనే, నింపుకున్న ఓ అమ్మా...
పదాలుకూడ పలకలేను, నిన్ను పొగడాలను ప్రయత్నాన...

నీ పిల్లలు ఎన్నటికీ, ఉన్నతంగానే ఉండాలని,
భాద్యతగల అమ్మగా, ఉత్తమమైనవె మాకివ్వాలని,
అతివ అందాన్నే మెరుగుపరుచు, వృత్తిని ఎంచుకున్నావు...
ఆ ప్రయాణాన అందరితో, ఆత్మీయతను పంచుకున్నావు...

నాన్న కష్టంతో అవసరాలు, అన్నీ సమకూరినా,
నువు ఖాలీగా ఉండలేదు, ఎవరు ఎన్నిసార్లు చెప్పినా...
నిమిష నిమిషానికి నిలబడుతూ, నీ కాళ్ళు హూనమౌతున్నా,
నువు ఏనాడూ వెనుతిరగలేదు, పని ఒత్తిడి ఎంత పెరిగినా....

భగవంతునిపై భక్తి నీకు, బరోసాను పెంచిందో,
వేగం నీ చేతులకి, పుట్టుకతోనే వచ్చేసిందో,
సమయపాలనతో స్నేహం, ఓ వరమై నిను చేరిందో,
వందల పుస్తకాల పఠణమే, నీ పరిణతినే పెంచిందో...
ఏ ప్రతిణపూని లేచావో, ప్రతి వేకువ జాములో, 
నవ్వెపుడూ చెదరలేదు, నీ అందమైన మోములో...

ఎగుడుదిగుడులెన్ని ఎదురైనా,
మా ఎదుగుదలకె కృషి చేశారు...
నడక నెమ్మదిగా మొదలైనా,
చివరికి సర్వం సమకూర్చారు..

మూడూన్నర దశాబ్దాల, మీ అన్యోన్యత తీరుగా...
అరవైయ్యవ తరుణం, నాన్న పుట్టినరోజు సాక్షిగా...
అమ్మా మా ప్రతి ఆలోచన, నీకు సంతోషం ఇవ్వాలనే,
నాన్నా మా ప్రతి కదలిక, నీ గౌరవాన్ని పెంచాలనే...

మీ అరోగ్యమె ఎన్నటికీ, మా ఇరువురకీ ముఖ్యము...
మీ ఆనందమె ఎప్పటికీ, మా ఇద్దరికీ సౌఖ్యము...

అమ్మ ఋణము తీర్చలేము, ఎన్ని జన్మలెత్తినా...
నాన్న మేలు వివరించలేము, ఎన్ని గ్రంధాలే రాసినా...

అమ్మా నీ భక్తిగుణము, నాకు కూడ వచ్చింది...
అది నా మనసున తొలి దేవతగా, నిన్నే ముద్రించింది...
నాన్నా నీ మార్గమే, మా విజయాలకు వారధి...
నువు నేర్పిన విలువలే మా జీవితాలకి సారధి...

ఇట్లు,
మీ పిల్లలు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home