వలసకూలీల ఆవేదన (తమ మాటల్లో...)
జనులారా వినగలరా, మా మనసులోని బాధని,
కనులారా కనగలరా, మా కాలినడక కష్టాన్ని...
మునుపెపుడూ ఊహించలేదు, ఈ కలికాలపు మలుపుని,
కాదన్నా చెరపగలమ, ఈ అలుముకున్న అంధకారాన్ని...
రాష్ట్రాలు దాటి వలసొచ్చిన, రోజువారి కూలీలం,
పని పిలిచిన ప్రతిచోటుకు, కదిలివెళ్ళు కార్మికులం...
తాత్కాలిక గుడారాన, తల దాచుకునే గుంపులం,
రోజు సంపాదనతోనె, పూట గడుపుతున్న జీవులం...
దశాబ్దాలు గడిచినా, మా తలరాతలు మారవని,
ఉన్న ఊరు వీడకుంటే, మాకు ధనమే సమకూరదని,
ధనవంతులు ఉన్నంతవరకు, దేశ అభివృద్దేం ఆగదని,
పనులు ఎన్ని పూర్తయినా, మరో పనిదొరకక మానదని,
పొట్టచేత పట్టుకుని, పొలిమేరలు దాటాము...
పని దొరికే పట్నాలకు, పరిగెత్తుకుంటు వచ్చాము...
పిల్లల బడి చదువులని, బాధ్యతలే పెరిగినా,
అనారోగ్యమే అదనంగా, అవస్థలను పెంచినా,
మా వందల్లో సంపాదన, వేలు దాటనూలేవు...
ఆచితూచి ఖర్చు చేసినా, అవసరాలు తీరవు...
రోజుకొక అవసరమే, అదనంగా చేరుతుంటే,
మేస్త్రీ మాయలు ముదిరి, మా కూలీలను కుదిస్తుంటే,
బ్యాంకులు ఋణములకైన, అర్హత లేవంటాయి...
ఒకదేశం అంటూనే, మాది ఈ రాష్ట్రం కాదంటాయి...
కష్టం కౌగిలిలోనే, కొట్టుమిట్టాడే కర్షకులము,
లక్షల లోగిలిలోకి, కలనైనా చేరలేము...
భీమాలు, బరోసాలు, లేని బతుకు చిత్రము,
పని అవ్వగానె పని దొరికితే, అదే మాకు చైత్రము...
ఈ అలల్లాంటి జీవితాన, అనుదినమో యుద్దము,
మా అంతులేని బాధలకు, ఈ అంటువ్యాధి అదనము...
పక్క దేశంలో పుట్టినా, ప్రతిదేశానికి సోకింది...
పాపమేది చేశామో, మా పాలిట శాపంగా మారింది...
ఇల్లుదాటి వెళ్ళొద్దని, ప్రభుత్వాలు అన్నాయి,
ప్రజలు చేరు ప్రతిచోటుకి, పత్రాల తాళమేసాయి...
పుష్కలంగ జరుగుతున్న, పనులన్ని ఆగిపోయాయి,
పూటనెలా గడిపెదవని, ప్రశ్నలనే విసిరాయి...
పనులు మొదలు అవుతాయని, తారీకులు చెప్పలేక,
రాష్ట్ర ప్రభుత్వాల బత్యాలతో, తీరికగా ఉండలేక,
అందరికీ వ్యధలు చెప్పి, చెయ్యిచాచి దిగిజారలేక,
వాహనాలు తిరగవని, మేము గుడిసెల్లో గడపలేక...
రాష్ట్రాలు దాటి నడవాలని, రహదారులు ఎక్కాము,
మైల్లు వందల్లో ముందున్నా, అడుగడుగు ముందుకేశాము..
మా చెమటల ధారలే, వ్యక్తిని వ్యవస్థలుగ మార్చింది...
మా రెక్కల కష్టమే, సామాన్యుని సంస్థలుగా నిలిపింది...
పేదలనే పునాదిపై, పైకెదిగిన దేశమిది...
పనుల్లేక పతనమైన, ప్రతి శ్రామికుని స్థానమిది...
మనదేశపు ముందుచూపు, ఆదర్శము అన్నారు,
అన్ని దేశాలకన్న ముందుగా, అడుగేశారని పొగిడారు...
ఆ ముందుచూపుల చూపుకు, మా కష్టం కనిపించలేదా???
మా కాలినడక కన్నీళ్ళు, అతిముఖ్యము అనిపించలేదా???
తెగిపడిన ప్రతీ పతంగము, తన పతనాన్ని ఒప్పుకోలేదు...
గాలి సన్నగిల్లువరకు, తన ప్రయత్నాన్ని మానుకోలేదు...
ప్రభుత్వమూ, పైవాడూ, మమ్ము చిన్నచూపు చూసినా,
సెగపూతల ప్రకృతే, వడిగా వడగాలులనే విసిరినా,
ఊపిరి ఉన్నంతవరకు, ఓ సైనికుడై అడుగేస్తాము...
తిరిగి పొట్టచేత పట్టుకునే, సొంతూరు చేరుకుంటాము...
ఇట్లు,
లక్షల వలస కార్మికులం..

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home