అందం - అదనం
హంగులెన్నొ పొదిగిఉన్న ఆ అందమైన ఆకాశం,
అప్పుడప్పుడలరించే హరివిల్లు తనకు అదనం...
రంగులెన్నొ పొందిఉన్న ఈ అందమైన అవని,
తన శొభతోన కనువిందుచేయు
ఆ కొండకోన అదనం...
జలకోఠితోన పొంగుతున్న ఆ అందమైన సంద్రం,
ముందువెనుకకొచ్చిపోవు ఆ అలలు తనకు అదనం...
రేయినంత ఏలుతున్న ఆ అందమైన జాబిల్లి,
తన చలువతోన మన సేదతీర్చు తన వెన్నెలంత అదనం...
మెలమెల్లగ పెరుగుతున్న ఓ అందమైన మొలక,
కూసంతలోన కుసుమించే ఆ మొగ్గ తనకు అదనం...
ప్రశాంతతగ ప్రభవించే ఓ అందమైన పువ్వు,
ఆ ప్రశాంతతని నిలిపుంచే తన పరిమలమే అదనం...
ఇలా ప్రకృతిలో ప్రతి అందం అదనాలని కలవో,
నా చెల్లిలోని ప్రతి అందం అదనాలను కలవు...
జాబిలికే సాటివచ్చు తన అందమైన మోము,
వెన్నెలల్లె మురిపించే నవ్వు తనకు అదనం...
ప్రేమతోన నను తిలకించే తన అందమైన కనులు,
ఆ కనులపైన మెలితిరిగిన కనుబొమ్మలు తనకు అదనం...
చిరుగాలికె కదలాడే తన అందమైన కురులు,
పూబాలాలలతో పొదిగిఉన్న ఆ అమరిక తనకదనం...
తియతీయగ నను చేరే తన అహ్లాదమైన పలుకు,
ప్రతి పిలుపునకూ సొంపుకూర్చు ఆ స్వరము తనకు అదనం...
ప్రతి కోరికకీ తనువేసే ఆజ్ఞాపన అందం,
అది తీర్చకుంటె తనను చేరు అలక పెద్ద అదనం...
నా కోతిపనికి తనకొచ్చే కోపమెంత అందం,
ఆ కాసేపు నను తిట్టే వింత తిట్లు అదనం...
నా చెల్లి చెంత గడిపినట్టి ప్రతినిమిషం మధురం,
ఈ క్షణముకూడ నను వీడని తన జ్ఞాపకాలు అదనం..
నా చెంతన తనులేదని నా మనసుపడే మధనం,
వెనువెంటనె నా కనులజారు కన్నీరు
నాకు అదనం....

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home