వృక్షం అంతరాత్మ
పచ్చగ పైకెదుగుతున్న ఓ చేతగాని చెట్టునని,
నను కూల్చేంతటి కోపంతో, నే ఊహించని వేగంతో,
వడగాలి నన్ను చేరినా, పోపొమ్మని తరిమినా,
నా తల్లివేరు వీడను, ఈ భూమినొదిలి కదలను…
నిలువెల్లా కాల్చినా ఓ కదలలేని కొమ్మనని,
దయచూపే దినకరుడే, దినదినము వేడి పెంచినా,
నా ఆకులన్ని రాలినా, నే ఆకలితో అలమినా,
నే చావు చెంత వాలను, మీ మనిషిలాగ ఏడ్చను…
చూపుకు చిరు అగమునని, తన జడిలోనే నిలవనని,
ఘనకాలపు ఘర్జనలతొ, గాలితోన స్నేహంతో,
ఓ కుండపోత కురిసినా, నా కొమ్మలనే విరిచినా,
నా గమకాలను ఆపను, ఆ జడిలో కడతేరను…..
ప్రాణమున్న కొమ్మలకే కాట్లువేసి తెగ నరికి,
కట్టెలని పేర్లు పెట్టి కాల్చుకునే వాడొకడు,
నా మిత్రులతో నను కలిపి, మా వనమంతా మసి చేసి,
భవనాలను కట్టుకుని బతుకువాడు ఇంకొకడు….
నా జాతినందు దాగి ఉన్న సుగంధాల చేరుకుని,
నిక్కచ్చిగ నరికి నన్ను అమ్ము వాడు ఒకడు,
నాప్రాణాలను బలి చేసి, అందాలను జత చేసి,
మందిరాలు మంచాలుగ మలుచువాడు ఇంకొకడు….
నేనిచ్చే ప్రాణవాయువు కావాలి, నా ప్రాణాలూ కావాలి,
నానుండి మీకు అంది వచ్చు ఔషదాలు కావాలి,
తీపితోన మీ కడుపు నింపు నా ఫలములు కావాలి,
నీడనిచ్చి సేదతీర్చు నా కరుణకూడ కావాలి….
మానవులు వేరైనా, వారి అవసరాలు వేరైనా,
నను బలి చేసే ఉద్దేశం, ప్రతి మనిషికి సహజం….
ప్రాణమున్న ఏమనిషీ నను ప్రాణిగానె చూడరు,
అవారాల ఆశలతో నను వేటాడక మానరు…
నా ఇల్లు వదలి ఒక్క అడుగు కదలలేదు ఏనాడు,
ఈ చేతగాని మానుపైన పగ ఎందుకు ఈనాడు….
ఫ్రకృతికి మొదలు ప్రాణిదాక నే చేయలేదు ఏ కీడు…
మరి నను అంతరించు తీరుగా కక్షందుకు నేడు….
బాదించుట మీ గుణం, భరియించుట మా గుణం…
నరికేయుట మీ గుణం, కరుణించుట మా గుణం…
నను పుట్టించిన దరిత్రీ.. ఓపికలో నే నీ బిడ్డనే,
నను పెంచే ఓ వంసంతమా… నే శాంతిలోన నీ సోదరినే..
మనుషులంత ఒకట చేరి నన్ను మసిని చేసినా, నే కరుణించక మానను..
ప్రాణులన్ని ఒకటచేరి నా ప్రాణం తీసినా, నే వరమివ్వక మానను…..

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home