Friday, October 30, 2015

మంచితనం బతికే ఉంది

ఒక రోడ్డును దాటాలని యత్నిస్తూ ఓ మనిషి,
అంధత్వమె అవరోధమై అలసటగా నిలుచుంటే...
అది చూసిన మనిషొకరు అటువైపుగ వెల్లాడు,
నేనున్నానని చెయ్యిచ్చి ఇటువైపుకు చేర్చాడు...
ఎవడండీ అన్నాడు.. మంచితనం చచ్చిందని,
నడిరోడ్డున నడుస్తూ అందంగా ఇటువస్తుంటే...

నలుగురు చేరి నవ్వుతూ భోజనాలు చేయుచోట,
పొట్టచేత పట్టుకుని నరుడు ఒకడు చేరాడు,
అడగలేక, ఆగలేక ఆశతోనె నిలుచున్నాడు...
అదిచూసిన మనిషొకడు అటువైపుగ వెల్లాడు,
తనుతినేటి భోజనాన భాగాన్నే పంచాడు...
ఎవడండీ అన్నాడు.. మంచితనం చచ్చిందని,
పరుల పొట్ట నింపుతూ జనుల కనులవిందు చేస్తుంటే...

రోడ్డుకు నడిబొడ్డులో ఓ మనిషి కిందపడి ఉంటే,
దేహమంత రక్తంతో సాయంకై చూస్తుంటే..
అదిచూసిన మనిషొకరు అటువైపుగ వెల్లాడు,
హుటాహుటిన స్పందించి ఆసుపత్రి చేర్చాడు ...
ఎవడండీ అన్నాడు.. మంచితనం చచ్చిందని,
పేరుకూడ తెలియకున్న, తన రక్తమిచ్చి బతికిస్తుంటే...

నడిరాత్రిన ఒంటరిగా ఓ మగువ నడిచి వెల్తుంటే,
ఆపదేమొ వస్తుందని భయపడుతూ చూస్తుంటే...
అదిచూసిన మనిషి ఒకరు అటువైపుగ వెల్లాడు,
భయమేలని భరోసాగ కలిసి అడుగు వేశాడు...
ఎవడండీ అన్నాడు.. మంచితనం చచ్చిందని,
ఆ మగువకనుల ధైర్యం నింపి తోడుగ నడిచొస్తుంటే...

వేసవిలో విసిగిపోయి దాహమెంత వేసిందో,
కన్నీటితోన గోమాత కరుణకై చూస్తుంది...
అదిచూసిన మనిషి ఒకరు అటువైపుగ వెల్లాడు,
నిండుపాత్ర నీరుతెచ్చి, గోమాతముందు ఉంచాడు..
ఎవడండీ అన్నాడు.. మంచితనం చచ్చిందని,
మూగజీవి దాహం తీర్చి, ధన్యుడై నిలుచుని ఉంటే...

అక్కడక్కడగుపించే గోరంతటి చెడును చూసి,
మంచి చచ్చిపోయిందను భావనకే రాకండి...
భయంలేక పాకుతున్న ఓ పిచ్చిమొక్క ఆ చెడు అయితే,
పెరుగుతున్న పరిమళాల వనమే ఈ మంచితనం...

ఏనాటికి గెలవలేని ఈ చిన్నపాటి చెడును చూసి,
మంచితనం చచ్చిందను ప్రచారాలు ఆపండి...
దిక్కులేక పడిఉండే ఓ శిలల కుప్ప చెడు అయితే,
ప్రతిరోజు పైకి ఎదుగుతున్న ఓ శిఖరం ఈ మంచితనం...

ఎవరిలోనొ నిండిందను అనుమానం ఈ చెడు అయితే,
నీలోనే కొలువు ఉన్న సాక్ష్యం ఈ మంచితనం...

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home