రైతే రాజు - రైతే సేవకుడు
వేడి తాకిడెంత పెరిగినా,
నీడనిచ్చు తరువువా,
ఒల్లంతా కరిగినా, వెలుగునింపు
మైనపు కొవ్వొత్తివా..
పచ్చడి మెతుకులు తింటూ, ఓ త్యాగమూర్తి రైతన్నా,
ప్రజలకి పరమాన్నం పెట్టావు, వేల కష్టాలే వచ్చినా...
పచ్చని మొక్కల పెంచే,
ఓ వసంతమంటి
రైతన్నా,
ప్రకృతి అందాలను పెంచావు, ఏ వైపున చూసినా...
ప్రతికూలతలెన్నైనా
ఓ పడిలేచే కెరటమా,
ప్రపంచాన్ని పోషించే ధాన్యాగాంఢారమా,
పుడమితల్లి ఒడిన పండు సిరులకు ప్రతిరూపమా,
ప్రతిదేశపు ప్రగతికే చక్కటి కొలమానమా...
పల్లెటూర్ల నుదుటిన ఓ పచ్చని సింధూరమా,
పట్టణాలు ఎదుగుటకే ఓ చక్కని ఆధారమా,
పదములెన్ని పేర్చినా, నిను పొగుడుట మా
సాధ్యమా...
పదవులెన్ని వచ్చినా, నీ పదవికి సరితూగునా...
చల్లగాలి చెట్టుకింద భోంచేసే భాగ్యమా,
చందమామ వెన్నెలలో పవలించే పుణ్యమా,
కార్తీకపు కొలనులోన స్నానమాడు సౌఖ్యమా,
తాజాఫలములు తినగా అందివచ్చు ఆరోగ్యమా,
పొలములోని పనులతోటి వేకువలో వ్యాయామమా,
చీకటిలో చరులతోటి సాహసొంతో సహవాసమా,
మేడలెన్ని కట్టినా, నీ సుఖములు మా సాధ్యమా,
వసతులెన్ని పెరిగినా, నీ తీరుకు సరితూగునా..
నాగలి జోరును పెంచగ, నువు పంచ పైకి కట్టినా,
తెగులునంత తరిమేయగ, నువు తలపాగా చుట్టినా,
గట్టు గట్టు మార్చుకుంటు, నువు పార చేత పట్టినా,
గంగమ్మను మొక్కుకుంటు, నువు నుదుట బొట్టు పెట్టినా,
నీకు సాటి నువ్వేలే, ఓ కష్టజీవి రైతన్నా,
ఎందెందున వెతికినా, నీ అందము కనిపించునా...
వర్షపు నీటిని నమ్మి, నువు
పొలము నిండ నారుపోసి,
వరణుడి సవ్వడి కోసం, ఆశతోన ఎదురుచూసి,
వేడికి ఏరులు ఎండి, అవి రాళ్ళకుప్పలౌతుంటే,
వేసవి దాటికి నేలలు చీలికలై పోతుంటే,
అనావృష్టి ఒడిలో నువు అలిశావా రైతన్నా...
వరణుడు కరుణించలేద, ఎన్ని ప్రార్థనలే చేసినా...
చెమటని నీటిగ చేసి, ఆ నారుకు ప్రాణం
పోసి,
భుజమున బరువులు మోసి, తెగులుకు మందులు వేసి,
చిన్నగ చినుకులు మొదలై, అది జడివానగ మారుతుంటే,
మారిన వానలు వాగై , పెను వరదై ఎదురొస్తుంటే,
అతివృష్టి జడిలో నువు తడిశావా రైతన్నా...
అసలు కూడ మిగలలేద, ఈ
ఎడతెరుగని వానలోన...
ప్రకృతి కోపం ఎదుటన ఏమాత్రం నిలవలేక,
ప్రభుత్వాలు మోపుతున్న రుణభారం మోయలేక,
పెరిగిన ధరలకు నడుమన నీ ఇంటిని గడపలేక,
పరువుగ బ్రతికిన చోటునె
ఇంకా దిగజారలేక,
ప్రాణాలే విడిచావా, ఓ అన్నదాత రైతన్నా...
పుడమి ఒడిలోనే కలిశావా, నీ పొలమున ఓ గట్టున...
మేము చేయు కలుషితాలు, నిన్ను కాటు వేసెనా,
కల్తీ విత్తనదారుల మోసం, నిను ముంచెనా,
మధ్యవర్తి మాయలు, మీ ధరలను హరియించెనా,
మద్దతు ధరలే లేక, నీ ఆశలు
ఇక అలిశెనా,
ప్రజలంతా చూస్తుండగ, నీ ప్రాణం పోయెనా,
పనికి రాని ప్రభుత్వాలు, నీ ఊపిరి తీసెనా,
కన్నీరిక రాల్చలేక, కను
మూశావా రైతన్నా...
కష్టం కౌగిలిలోనే, కడతేరావా
చివరన...
నీ కల్లనీల్లు ఈ జగతికి అత్యంత పెద్ద ప్రమాదం,
నీ కోపం మన జాగృతికి వివరించలేని అవరోదం,
నీ మనుగడ మన
జాతికి ఎన్నటికీ ఆనందం,
నీ మరణం మా గుండెలు చీలేంతటి విషాదం,
రోజులెలా మారినా, మా రాజువి నువు రైతన్నా....
రకరకాల జాతులున్న ఈ అందమైన రాజ్యాన....
పట్టణాల నివసించే ఉద్యోగులు పెరుగగా,
ఆహారపు నిలువలన్ని అనూహ్యంగ తగ్గగా,
అవసరాల ధరలన్నీ ఆకాశం తాకగా,
విలువ తెలిసి ప్రతిమనిషీ నీ జపమే చేయగా,
రాబోయే కాలమంత నీదేలే రైతన్నా,
రాబందుల ఆటలింక సాగవులే ఈ లోకాన..


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home