Wednesday, March 16, 2016

కులమా... కూతురా...




ఓ ప్రియమైన నాన్నా... నాకు నీ మాటే వేదము..
నా ప్రాణమైన అమ్మా... నువ్వే నా సర్వము..
నేను నవ్వుతున్న ప్రతిక్షణము మీ బాధ్యతకే సాక్ష్యము,
నాకు మీపైన ఉన్న గౌరవమే, మీ ప్రేమకు సోపానము..

మీ ప్రేమ నీడలోనే, నే ప్రతిరోజూ పెరిగాను,
మీరు చూపిన దారిలోనే , నే ప్రతిరోజూ నడిచాను...
జీవితమను పయనంలో నేనెందర్నో కలిసినా,
కాలమనే గమనంలో నాకెందరో ఎదురయ్యినా...
ఒకే ఒకరు నన్ను దాటి నా మనసుదాక చేరాడు..
ప్రతి విషయలో మీలాగే నాకు తోడు నిలిచాడు...
అతను నా వెంటే ఉంటే, నే బాగుంటాననుకున్నా,
మీరు ఒప్పుకుంటే, అతను నా భవిష్యత్తు అనుకున్నా..

ఓ మంచిరోజు చూసుకుని ఆ మాట మీకు చెప్పాను..
మీ సమ్మతమే ఆశిస్తూ ఆనందంగా చూసాను...
గుణమేంటని అడుగుతారని గర్వంగా వచ్చాను..
కులమేంటని అడగగానె నేను మూగబోయాను...

ససేమిరా అని మీరు ఒప్పుకోము అన్నారు,
ఎవరో ఇక తేల్చుకో అని కదిలి వెల్లమన్నారు...
నా కళ్ళనీళ్ళ భాష కూడ మాట్లాడలేక నిలుచుంది...
ఏ మాటరాక మూగబోయి మౌనంగా చూస్తుంది...
కాలమైన కదలందే మరు సంబంధం చూసారు,
కులములోనె ఉండమ్మా అని ఆక్షేపన చేసారు..


మా కూతురి ఆనందమే, మాకెప్పటికీ ముఖ్యమని,
మా కూతురి సౌభాగ్యమే, మాకెన్నటికీ సౌఖ్యమని,
నిన్నదాక ప్రతినిమిషం నా ఇష్టానికి వదిలేశారు..
నేనేమన్నా సరేనని నా నవ్వులతో నడిచారు..

నేడు పెళ్ళి అనే పెద్ద మాట మీ ముందుకు వచ్చింది,
అది పెద్దవాల్ల విషయమని నను దూరం పెట్టింది...
కులము అనే కొత్త మాట మీ మొదటి కూతురయ్యింది,
ఆ తొలికూతురి ఆనందమే మీ సర్వస్వం అయ్యింది...
పరువు అనే వింత మాట మీ పంతంగా మారింది,
అది మీకు కూడ తెలియకుండ, నా పతనాన్నే కోరింది...

నేను ప్రేమించిన మనిషి కులము మనది కాకపోయినా,
తన అణువణువు ఉన్న గుణము నీలాంటిది నాన్నా...
నేను ఇష్టపడిన మనిషి ఆస్తి వేవేలకోట్లు లేకున్నా,
తాను చూపించే బాధ్యతంత నీకు సాటి నాన్నా...

మీరు కోరుకునే లక్షణాల ఉదాహరణ వాడమ్మా...
కులము అనే మాట చెప్పి వాదించుట న్యాయమా..?
ప్రేమ మాటకొస్తే నీ ప్రతిబింబమే వాడమ్మా..
పరువు అనే మాట చెప్పి విడదీయుట భావ్యమా..?

మీరు ఎంచుకున్న వ్యక్తి యొక్క కులమేమో మనదే,
మీరు చూపించిన మనిషికున్న ఉద్యోగం కాస్త పెద్దదే,
జన్మాంతం ఆనందం ఏ కులము ఇవ్వగలదమ్మా,
చేయ్యాల్సిన సంసారం వ్యక్తి వ్యకిత్వంతోనే కదమ్మా...


ప్రతిసారీ నా నిర్ణయాన్ని మెచ్చుకునే మీరే,
ఈ ఒక్కసారి తప్పు అని మరీ మరీ అంటుంటే...
ఎవరి తప్పు ఎక్కడో, అసలు తప్పు ఏమిటో,
మనిషి ఆనందాన్నడ్డగించు ఈ కులంగోత్రమేమిటో,
ఈ అలోచనలన్ని చేరి నను నిత్యం నిలదీస్తున్నా,
మీ అనుమతికే నోచుకోక  నిలుచున్నా నాన్నా...

బంధువుల గోడు పడలేక, నా మనసు మార్చతలిచారా..
కులము కొలువు దాటలేక, సంకెల్లు వేసుకున్నారా..
పరువు బరువు మోయలేక, నాపైన కూడ మోపారా,
ప్రతిష్ట నిష్ట వీడలేక, నన్ను కూడ అటు నడిపారా...

మీ కన్నప్రేమ ఒడిలోనే ఇన్నాల్లు పెరిగాను,
మీరు ఒప్పుకోని ఏపనినీ ఎప్పటికీ చేయను...
నాకు నేనె మదనపడి కన్నీరై పోతాను,
కన్నవాల్లు అయినందుకు నా కన్నీటిని మీకివ్వను...

పెద్దమనసు చేసుకుని ప్రోత్సహిస్తారనుకున్నా,
నా ఆనందమె ముఖ్యమని ఆలోచిస్తారనుకున్నా,
కులమొకటే మొదటిదని నిర్ణయించుకున్నారు...
ఈ ఒక్కసారి వద్దమ్మా, అని నన్ను నవ్వమన్నారు...

కన్నీల్లు నన్ను చుట్టినా, పెదవులతో నవ్వగలనులే నాన్నా...
మనసు వద్దు అంటున్నా మీ మాటే వింటాను, దిగులెందుకులే అమ్మా...
మీ కూతురైనందుకు ఈ జన్మ మీకు అంకితం,

ఇదే నేను చేస్తున్నా నా కన్నీటితోన సంతకం...

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home