వితంతువుపై ఎందుకంత వివక్ష?
పుట్టినింట ఆడపిల్ల, అపురూపంగా పెరిగినా,
అమ్మనాన్న ప్రేమతో, తనకు సర్వం సమకూరినా,
ఇల్లాలిగ మారి తను, సొంత గడప దాటుతుంది...
పతి వేసిన అడుగుపై, సతిగా అడుగేస్తుంది...
ఆ దినము మొదలు, భర్తని భగవంతునిగా భావిస్తుంది,
సుఖశోకాలన్నిటిలో, తననె సర్వస్వం అనుకుంటుంది...
మనసులోన అందంగా, భవిష్యత్తుని చిత్రిస్తుంది,
తన భర్తకి చిరుగాయమైన, తరుణిగ తల్లడిల్లిపోతుంది...
ఆలుమగల అన్యోన్యత, దినదినమూ పెరుగగా,
మూడో ప్రాణం తమతో, మురిపెంగా చేరగా,
అమ్మనాన్న అయ్యామని, ఆనందంగా ఉంటారు...
కలసి కడవరకూ నడవాలని, కలలెన్నో కంటారు...
దారుణమేదో జరిగి, పతి ప్రాణం పోతుంది,
కారణమేదైన కాని, సతి సర్వం కోల్పోతుంది...
చుట్టూ ఎందరు ఉన్నా, తను ఒంటరిగా మిగులుతుంది,
బారం పెరిగిన హృదయం, వేవేల ముక్కలవుతుంది...
మాంగళ్యము సెలవంటూ, మెడను వీడి పోతుంది,
మరణము స్వాగతమంటూ, అడుగడుగుకు తోడవుతుంది...
అందమైన భవిష్యత్తు, అంధకారమౌతుంది,
విధవ అనే వింత బిరుదు, అదనంగా చేరుతుంది...
తాళి తెగిన ఆనాడే, బ్రతుకు తలకిందులు అవుతున్నా,
ఆగని తన కన్నీరే, అణువణువుని కుదిపేస్తున్నా,
పిల్లలపై భాద్యతతో, తిరిగి పైకి లేస్తుంది...
ఒంటరిగా సమాజాన, పయనం సాగిస్తుంది...
సింధూరపు సింగారము, నుదుటిపైన లేకున్నా,
తెల్లచీర కట్టి తాను, బోసిపోయి ఉంటున్నా,
ఎదురొస్తే ప్రతివాడూ, పక్కకు వెళుతూ ఉన్నా,
ఈ అతివని అపశకునమని, అందరు అంటూ ఉన్నా,
అత్తింటిని వదిలి తాను, పుట్టింటి బాట పట్టదు..
పడతి కష్టమెంత పడుతున్నా, బాధ్యతలను మరవదు...
అడుగుకు ఒక అవమానం, మౌనంగానే చేస్తుంటే,
సాటి ఆడవారు కూడ, వేరుచేసి చూస్తుంటే,
పెనిమిటితో జ్ఞాపకాలు, పదేపదే గుర్తొస్తుంటే,
మగాళ్ళేమె మోహంతో, గాలాలను విసురుతుంటే,
ప్రతిసాయంత్రం పడతి వ్యధలు, కన్నీరై వస్తాయి...
పంచుకునే తోడులేక, ప్రవహించి ఇంకిపోతాయి....
ఒక సంఘంలో బతుకుతున్న, మనమూ మనుషులమేనా...
సాటి మనిషి కుంగిపోతున్నా, కరుణని చూపించలేమా...
పతిలేని పడతి, అంటరాని ఆడదిగా బతకాలా...
శుభకార్యాలకు శత్రువులా, ఆమడ దూరానే నిలవాలా???
విధవరాలు ఎదురొస్తే, మన ఆస్తి కరిగిపోతుందా...
విధివేసిన శిక్షకి, ఈ అసమానత అదనం కాదా???
సమాజమా నీ నడతచూసి, కాస్తైనా సిగ్గుపడు..
చేతనైతే ఈ అబలకి, ఆసరాగ నిలబడు...
ఆదిశక్తి రూపమా, ఈ అతివకి నువు ఎదురుపడు...
ఆప్యాయతతో హత్తుకుని, జనులకు కనువిప్పై కనపడు...
మీ జాతి సమానత్వముకై, పోరాడుతున్నస్త్రీలారా,
తోటి ఆడపడుచు విషయంలో, ఆ నీతిని వదిలేశారా???
నాడు పూలూ గాజులు తీసి, చేయి దులుపుకున్నారు...
నేడు పాపం పుణ్యం విడిచి, మచ్చ తెచ్చుకుంటారా???
పసుపూ కుంకుమ పోతే, పడతి అంటరానిదవ్వాలా??
పతి ప్రాణాలను కోల్పోతే, సతి దుర్గతిపాలవ్వాలా??
సుమంగళీ స్త్రీలారా, ఇది ఎంతవరకు సమంజసం...
ఈ వికృతి మన ప్రకృతిలో, ఏ కోణంలో సమన్యాయం...
కామం కళ్ళకు పట్టిన, మగజాతిలోని మృగాల్లారా…
ఈ పోరాడుతున్న పడతినైన, మీ చెల్లిలాగ భావించలేరా???
పదవీ పద్దతి విడిచి, మీరు ఏనాడో దిగజారారు...
ఈ కాంతల కష్టాలు మరచి, కామాంథులుగా మారారు...
మీ మగతనాన్ని మడిచిపెట్టి, మనుషులుగా మారలేరా???
అన్నీ పోగొట్టుకున్న అబలలకు, అన్నలుగా నిలవలేరా???
నాటి సతులు ఈ వివక్షని, ముందే ఊహించారా??
అందుకనే, బతకలేక పతితో సహగమనాలే చేశారా??
శక్తికి మించిన నీరే, నదులకు వరదలుగా వస్తుంటే,
అవధులుగా కట్టుకున్న, తన గట్లన్నీ తెగుతుంటే,
సంద్రమనే సమాజం, నేనున్నానని అంటుంది...
వేల నదివరదలు వచ్చినా, తనలోన నింపుకుంటుంది...
ప్రాణము లేకున్న కానీ, మనకు ఆ నీరము ఆదర్శము...
మన మానవాళి అందరికీ, అలాంటి మనసు అవసరము...
కనుతెరవండిక జనులారా, తిరిగి ఆవిశ్కరించుకుందాము...
ఈ అతివకు ఆధారమై, మనమున్నామని అందాము...
ఆనందము అందించకున్న, తన బాధకి తోడుందాము...
విధిరాత ముందు తలవంచే, మనమంతా ఒకటందాము...


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home