Monday, October 4, 2021

ఆశయాలు – అప్పులు

ఎన్నో సాధించాలని, కలలు కన్న యువకుడిని,
అవకాశం పిలవగానె, అడుగేసిన ఉద్యోగిని... 
ఆశయమను ఆస్థితో, తొలుతే ధనవంతున్ని, 
అత్యాశను వ్యసనంలో, నలిగిన నిరుపేదని...

పైచదువుల రోజుల్లో, కాస్త సరదాగా తిరిగినా, 
పైకెదగాలను విషయంలో, స్పష్టతైతె ఉండేది... 
ఉద్యోగం మొదట్లో, చిరునడకలుగా సాగినా, 
ఓస్థాయికైతె వెళ్ళాలను, సంకల్పం నాకుండేది...

ఆరు మాసాలకె ఉద్యోగం, అలసట తెప్పించింది,
నా ఎదుగుదలకి వ్యాపారం, అవసరమనిపించింది...
ఏ వ్యాపారం చేయాలా అని, సతమతపడిపోయాను,
ఇతరుల సలహాలకు సరేఅని, అడుగు ముందుకేశాను...

తొలిరోజుల్లో పెట్టుబడి, తక్కువేగ అనిపించింది,
తిరిగి వచ్చు రాబడి, కళ్ళముందె కనిపించింది...
తిరిగిస్తానని తెంపు చేసి, అరువు తెచ్చుకున్నాను,
నా జీవితాన తొలిసారి, అప్పు వైపు వెళ్ళాను...

వారాలూ పక్షాలు, వడిగా మాసాలై గడిచాయి,
కష్టానికి ఫలితంగా, లాభాలూ మొదలయ్యాయి...
కలలు కన్న జీవితం, తొలిసారి చేరువయ్యింది,
సంపాదన పెంచాలని, ఆశ చెప్పకనే చెప్పింది...

చేతికొచ్చు లాభాలను, తిరిగి పెట్టుబడిగ పెట్టాను,
అవసరమనిపించినపుడు, అప్పు కూడ చేశాను...
నా చిన్నపాటి వ్యాపారాన్ని, కాస్త విస్తరించాను,
ప్రతి అడుగూ సబబే అని, మనసారా నమ్మాను...

గొప్పోడివి అయ్యావని, బంధువులు మెచ్చుకున్నారు,
స్నేహితులూ ఆశ్చర్యపోయి, భలే అని పొగిడారు...
కలిసుంటామని కొందరేమొ, పెట్టుబడులు చేశారు,
లాభాలను తిరిగిస్తుంటే, సంబరంగ చూశారు...

నా అవగాహన లోపాలే, నాకు శత్రువులుగ మారాయి,
అవి అలవోకగ అన్నిచోట్ల, నష్టాలను మిగిల్చాయి...
అప్పుల వడ్డీలే నెమ్మదిగా, నష్టాలకి జతకలిశాయి,
అవి కొంచెంగా పెరుగుతూ, కొండంతగ ఎదిగాయి...

బంధువులూ, బయటివాల్లు, డబ్బుకోసమొచ్చారు,
స్నేహితులూ, ఆత్మీయులు, మౌనంగా అడిగారు...
అందరు ఈ విషయాన్ని, నా ఓటమిగా చూశారు,
ఇక దూరంగా నెట్టేసి, నను ఒంటరిగా చేశారు...

అన్ని నష్టాలను ఎదుర్కునే తీరు నాకు తెలియలేదు,
వ్యాపారం ఆపేద్దామంటే, కాస్తైనా మనసురాదు...
కొన్ని వడ్డీలను కట్టేందుకు, కొత్త అప్పులెన్నొ చేశాను,
తెలిసిన ప్రతి ఒక్కరికి, లోకువ అయిపోయాను...

రోజులు గడిచేకొద్దీ,  సమయం శత్రువులా మారింది,
దినదినమో సంకటమై, ఓ వలయంగా ఎదిగింది...
ఊపిరైన ఆడక, ఓటమి ఉరితాడై ఎదురయ్యింది,
పరిస్థితుల ముందర, నన్ను తలవంచేలా చేదింది...

ఓటిమిలో నలిగిపోయి, ఇక చేతులు ఎత్తేశాను,
అలసిపోయి అన్నిటినీ, అక్కడికక్కడె ఆపేశాను...
నేను ఉంచుకున్న విలువలనూ, కాపాడలేకపోయాను,
వడ్డీలు కట్టలేనని, అడిగిన అందరిని వేడుకున్నాను...

ప్రాణాలను వీడలేక, పాప పుణ్యాలను విడిచాను,
వినగలిగిన వాళ్లకు, నా పరిస్థితిని వివరించాను...

ఆశయమంటే కలలను, ఆచరణలొ పెట్టడం, 
ఆశంటే ఆ కలలను, కలలుగానె వదిలేయడం...
అత్యాశకు నిర్వచనం, అంచనాలు తప్పడం, 
అంచెలుగా అంచనాలు, కంచెదాటి వెళ్ళడం...

నావిషయంలో ఆ కంచెను, ఉంచటమే మరిచాను, 
అన్నీ సర్దుకుపోతాయను, భ్రమలోనే బతికాను...
నా సాహసాలె సమస్యలై, ఎదురొస్తుంటే చూశాను, 
సంకట వలయంలో పడ్డాకే, మొత్తంగా అలిశాను... 

ఆశయ అత్యాశల నడుమన, అంతరం అతిచిన్నది,
అది వర్తమాన కాలంలో, ఎదుటివారి మాటలది...
ఆ అంతరమే గెలుపైతే, మన ధైర్యమని పొగుడుతారు, 
ఓటమి దరిచేరిందో, ముందే ఊహించామంటారు...

అవగాహన లేనిచోట, వ్యాపారం ఒక వ్యసనము,
తెలీకుండ అడుగేస్తే, అది సమస్యల సుడిగుండము,
ఎత్తులెన్ని వేసినా, అది ఎదురీదలేని అగాథము,
అనుకూలతలెన్నున్నా, కడకు ఓటమి అనివార్యము...

అప్పు తీసుకున్ననాడు, అసలొకటే కనిపించింది,
ఆశయ సాధనకు, అది అవసరమనిపించింది...
నిదానంగ మొదలైనా, వడ్డీ వేగంగా పెరిగింది, 
అంకెల్లో కనపడుతూ, సంకెళ్ళుగ వెలిసింది...

వడ్డీ వామన రూపం, మన అంచనాకు అందదు,
ఆదమరచి ఉన్నామో, అది ఆకాశాన్నంటగలదు...
సమయం జతకలిసిందో, ఇక అసలు జాడ కనపడదు,
వడ్డీయే సర్వమై, భవితని నిర్వీర్యం చేయగలదు...

ఒక వ్యాపారంలో ఓడిపోయి, నేను ఒంటరిగా మిగిలినా,
అది ఇంత పెద్ద జీవితాన, ఒక భాగమనే భావిస్తాను...
నేను ప్రయత్నించిన ప్రతిసారీ, కొత్త కష్టాలే ఎదురైనా, 
సత్తువ ఉన్నంతవరకు, ఓ శ్రామికుడై శ్రమపడతాను...

ఆవేశంగా కాకుండా, ఆలోచనతోన,
అలవోకగ కాకున్నా, అవగాహనతోన,
సమయమెంత పట్టినా, సంయమనంతోన,
కష్టాలు ఎన్ని ఎదురైనా, క్రమశిక్షణతోన,
కొత్తదారిలోన నేను, పద్దతిగా పయనిస్తాను...
ఈ జీవిత పోరాటంలో, విజయం సాధిస్తాను...

పడమట పడిపోయిన సూరీడే, 
తిరిగి తూర్పున ప్రభవిస్తాడు...
నేలరాలిన ప్రతి కెరటమూ, 
నిత్యం కొత్త ఎత్తుకెగసిపడుతుంది...
కింద పడిపోయిన ప్రతీదీ, పతనానికి ప్రతీక కాదు,
ప్రతి తప్పటడుగు పాఠము, ఒక ప్రారంభం కాగలదు...

Written by
Chinna

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home