Tuesday, May 25, 2021

గురుశిష్యులు - జ్ఞానం

మన ప్రతి ప్రశ్ననీ ఆలకించే శ్రోత,
జ్ఞానమనే సంపదని ప్రసాదించే దాత,
సాక్ష్యాత్తు సరస్వతీదేవికే ఒక దూత,
పరోక్షంగా గురువు ప్రపంచానికే నిర్మాత… 
 
నిజమైన గురువు ఒక నిత్యవిధ్యార్థి,
ప్రభలిన అజ్ఞానానికి అసలైన ప్రత్యర్థి...
కావ్యాలకే అందనిది తన కీర్తి,
తను లేని ప్రపంచమే అసంపూర్తి...
 
ఎంత త్రవ్వినా తరగని నిధి,
మేధావుల మేధస్సుకి పునాది…
అజ్ఞానానికీ జ్ఞానానికీ మధ్య విలువైన వారధి,
గురువు మెరుగైన సమాజానికి ఒక రథసారధి...
 
వారి వచనం, మనకు జీవనం,
వారి జ్ఞానం, మనకు తోరణం…
మన వినయం, వారికి వేతనం,
మన విజయం, వారికి ఉత్సవం...
 
నేటి యాజమాన్యాలు విద్యని వ్యాపారంగా చేస్తుంటే,
మన విద్యార్థులు చదువుల్ని వస్తువుల్లా కొంటున్నారు...
 
డబ్బుతో కొన్న పట్టాలు జ్ఞానాన్నే వెక్కిరిస్తుంటే,
సమాజంలో ఆ పట్టబద్రుల్ని సత్కరిస్తున్నారు...
సాధనం కన్నా ధనంతోనే పనులు జరిగిపోతుంటే,
విద్యార్థులు గురువు విలువనే విస్మరిస్తున్నారు...
 
విద్యాసంస్థల ఆస్థులు రోజురోజుకు రెట్టింపౌతుంటే,
ఉపాధ్యాయులు వేతనాల్లేక రోడ్డున పడుతున్నారు...
విలువల్ని జ్ఞానంగా గుర్తించేవారు కరువౌతుంటే,
గురువుల్ని మనసారా గౌరవించేవారు క్షీణిస్తున్నారు...
 
పురాణాలు గురువుల్ని దైవంగా పూజించమంటుంటే,
మనం నమస్కరించడానికే నామోషీ పడుతున్నాం...
వేదాలు వారికి కన్నవాళ్ల తర్వాతి స్థానాన్నివ్వమంటుంటే,
వాస్తవానికి మనం వారిని మనసులోనే నిలుపుకోలేకున్నాం...
 
సంద్రం మేఘానికి తన నీటిని ఆవిరిగా ధారబోసిందని,
మేఘం వర్షించి మరీ గురువుని దర్శించుకుంటుంది...
నక్షత్రాలు సూర్యుడికి ప్రకాశించడాన్నే నేర్పించాయని,
భానుడు ప్రతిరోజూ అస్తమించిమరీ నమస్కరిస్తాడు...
 
గురువు సమయాన్ని గౌరవించి, వేతనంగా ఇస్తున్నా,
వారిచ్చే జ్ఞానానికైతే వెలకట్టి ఋణం తీర్చుకోలేం...
శిష్యులు సంపాదనలో, గురువునే మించిపోతున్నా,
వారిచ్చిన సంస్కారానికైతే, మూల్యం చెల్లించుకోలేం...
 
సంస్కారంగల సాంకేతికత, సంఘం శుద్ధికి అవసరం,
విలువలుగల విజ్ఞానం, దేశ అభివృద్ధికి అనివార్యం...
 
విద్య వెలతో కాదు, వినయంతో సిద్ధిస్తుందని తెలుసుందాం,
గురువుల దెగ్గర, గర్వంతో కాక గౌరవంతో నడుచుకుందాం...

సరైన గురువుదెగ్గర శిష్యరికం, అదృష్టంగా భావిద్దాం,
ఆ గురువిచ్చే దండననైనా, ఆనందంగా బరిద్దాం...

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home