జీవితంలో విజయాల పాత్ర...
రవికిరణం భువిని చేరి చీకట్లను చీల్చింది,
తనది కాని భువనాన్నీ కాంతులతో నింపింది...
అంధకారానికి అంతంగా మారాలని తలచింది,
అణువంతటి దారికై అనుక్షణమూ చూస్తుంది...
కడలి కదిలి నేలంత నీరముగా మార్చింది,
ఆవిరిగా మారి తనే అంతరిక్షాన్నీచేరింది...
అలలు అనే చరణాలతో అడుగు ముందుకేస్తుంది,
నలుదిక్కులు తానై కొలువవ్వాలని చూస్తుంది...
పాతిపెట్టబడ్డ విత్తు కూడ మొలకెత్తి ఊరుకోలేదు,
ఈ అవనిని జయించానని అందలమూ ఎక్కలేదు...
ఋతువులెన్ని ఎదిరించినా తన పోరాటం ఆపలేదు,
భూపొరల్లోకి వెళ్తూనే పైకెదగడమూ మానలేదు...
ప్రకృతిలో ప్రతి విషయం ఒక విజయానికి నిదర్శనం,
విజయాలు ఎన్ని వరించినా, తనది అలసిపోని లక్షణం…
తరగతిలో విద్యార్థి, ప్రథమస్థానంలో నిలిచినా,
పాఠశాల ఆవరణంలో, ప్రత్యేకంగా కనిపించినా,
నేర్చుకునే మనసుంటే, జ్ఞానానికి అంతుండదు...
ఎదగాలని అనుకుంటే, అవకాశాలకు హద్దుండదు...
ఉద్యోగంలో ఉద్యోగి, ఉన్నతస్థానంలో ఉంటున్నా,
సహచరులు కూడ సాయంకై, తనవైపే చూస్తున్నా,
సాధించాలనుకుంటే, సాంకేతికత ఒక సంద్రము...
అలసిపోని మనసుంటే, అందగలదు అంబరము...
విజయం ప్రతి పోటీలో, నీకు ఫలితంలా కనిపించినా,
జీవితమను పయనంలో, అది చిన్నపాటి ప్రోత్సాహకమే...
చిరు విజయాలే నెమ్మదిగా, నిను ప్రత్యేకంగా నిలిపినా,
నీ ఆశయసాధనలో, అవి ఆత్మవిశ్వాసానికి ఇంధనమే...
విజయం ఒక ఆభరణం,
అది ఆ కాసేపటికే సంబరం...
మన పయనమేమొ నిరంతరం,
అతీతులం కాదు ఏ ఒక్కరం...
గర్వమెపుడు నీ గమనాన్ని, గమ్యానికి చేర్చదు,
ఆ గాలి నీకు సోకిందో, నీ ఉనికి కూడ మిగలదు...
ఓటమితో కుంగిపోయి వెనకడుగే వేసినా,
విజయంతో పొంగిపోయి విలువలనే విడిచినా,
ఆ గెలుపులిచ్చు గర్వం, నిను కూల్చక మానదు...
చివరి అంఖంలో ఇరువురికీ, అంతరమేం ఉండదు...
అభివృద్ధికి అహమనేది, ఎన్నటికీ ఆటంకమే,
విజయానికి వినయమేమొ, ఎపుడైనా మకుటమే...
గత విజయాలను స్మరిస్తూ, కాలాన్నే కరిగించకు,
బలముందని భావిస్తూ, బలహీనుడిగా మారకు...
నువ్వున్న వృత్తి ఏదైనా, వృద్ధికి అవకాశం ఉంటుంది,
నువ్వెంతెత్తుకు ఎదిగినా, ఇంకో మెట్టు మిగిలి ఉంటుంది...
ఇది చాలని అనుకుంటే, నీ అలోచనె ఒక అగాధం,
ఇంకా సాధించాలనుకుంటే, నీ అవకాశాలూ అనంతం..

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home