Friday, May 28, 2021

ఇది అమ్మకు అంకితం

ఇది అమ్మకు అంకితం

నిజమైన ప్రేమకి నాయకత్వం, 
నిస్వార్థానికి దృఢమైన నేతృత్వం,
కవిత్వాలకూ అందని దైవత్వం,
మానవత్వానికే మూలం మీ మాతృత్వం...

ప్రేమొకటే మీకు తెలిసిన మార్గం,
శత్రువుల ఊసే లేనిది మీ వర్గం... 
వేల ఆలయాల నిలయం మీ దుర్గం,
అమ్మఒడే మాకు తెలిసిన ఏకైక స్వర్గం...

ఔదార్యంలో మహారాణివి, నింగికి మనురూపానివి,
ఓపికకే ఔన్నత్యానివి, మన నేలతల్లి చెల్లెలివి...

రాజులైన ప్రజలైనా, అమ్మ కడుపులోంచె పుడతారు,
దనుజుడైన దేవుడైనా, తమ తల్లిని పూజిస్తారు...
మచ్చలేని జాతి మీది, లోని కరుణే మీ ఆకారం,
మరువలేని ఖ్యాతి మీది, ఓ వరమే మీ మమకారం...

కన్నీళ్ళ కడలిలో ఉన్నా, పిల్లల కడుపునింపేకే చూస్తారు,
అణువణువూ అలసినా, మాకై తపనపడుతూనే ఉంటారు...
చరిత ఎంత గొప్పదైన, తల్లి గర్భానే మొదలవ్వాలి,
భవిత ఎంత దివ్యమైన, అమ్మ ఒడి నుండే ఎదగాలి...

విలక్షణ పాత్రల మిలితం, ప్రతినిత్యం నీ ప్రయాణం,
రక్షణ, సులక్షణ భరితం, నీ లాలనలో మా జీవనం...
అక్షయపాత్రవి తల్లీ, నువు ఆప్యాయత విషయాన,
అక్షరాలు కరువయ్యాయి, నిను పొగిడే ప్రయత్నాన...

తూర్పు తల్లి ప్రసవిస్తేనే, సూర్యుడు ప్రభవిస్తాడు,
తనఒడిలో ఉన్నంతవరకు, వేడిని చూపించబోడు...
తల్లి అనుమతితో బయలుదేరి, విధిని నిర్వహిస్తాడు,
పడమరగా పయనించి, తిరిగి తల్లిఒడికి చేరతాడు...

తల్లివేరు తోడులేందె విత్తు వృక్షంగా ఎదగలేదు,
పుడమితల్లి ఓర్పుతోనె వేరు భూపొరల్లోకి చేరగలదు...
కడలితల్లి కాదంటే జలచరులు అడుగు కదపలేవు,
వానతల్లి మొండికేస్తె కడకు కడలైనా ఎండగలదు...

తల్లుల ప్రేమతోన పెరిగేదే, ఈ అవధిలేని ప్రకృతి,
తల్లితోడు ఉంది కనుకనే, తనది అందమైన ఆకృతి...

రాక్షసుడే రచించినా, నిన్ను పొగుడుతూనె రాస్తాడు,
కారణజన్ముడు సైతం, నీ కరుణని కీర్తిస్తాడు...
వేల గర్భగుడుల సమానం, తల్లీ మీ గర్భము,
ప్రతివారూ పొగిడినా, మిము చేరదు గర్వము...
 
తల్లీ నీ దాతృత్వం, విశ్వమంతటికీ ఆధారం,
అమ్మా నీ మాతృత్వం, మానవతకె మణిహారం...

మీ కరుణకి కరిగిపోని మనసేదీ ఉండదు,
మీ కథలకు కదలలేని కలమేదీ పుట్టదు...

నేడు నా కలమూ మీ ప్రేమకి కవితార్చన చేయనీ,
ప్రతి పంక్తిలోని పదపదమూ పావనమై పులకించనీ...
చిగురించిన ప్రతి భావము, మీకు మకుటంగా మారనీ,
ప్రాసలన్ని పరవశించి, మీ పాదాలను పూజించనీ...

Written By
చిన్న

కేవలం మా అమ్మకే కాదు,
ఇది "అమ్మ" కు అంకితం..

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home