అంతరాలనీ ఆహ్వానిద్దాం…
రేరాజుకు లోకమంత వెన్నెల్లో కనిపిస్తే,
రవికేమో రోజంతా వెలుగుల్లో కనిపిస్తుంది...
కోయిల పలుకులు మనకు, ఎప్పటికీ ఆహ్లాదము,
కాకి గూటిలోన అవే, పెద్ద మోసానికి సాక్ష్యము...
మేఘాల నీటిభిక్షే అని సముద్రాన్ని నిందిస్తే,
తన ఆవిరి సమూహమే, ఆ మేఘమని బదులిస్తుంది...
భూమాతకె నీడనిచ్చు అడవితల్లి గొప్పదా???
ఆ అడవులకే పునాదైన అవనితల్లి గొప్పదా???
గొప్పెవరని వాదిస్తే, ఏది ఎప్పటికీ తేలనిదే,
ప్రకృతిలోనూ ప్రతివిషయం, చర్చనీయాంశమే...
"మానవులం" అనే పదం, ఐకమత్యానికి నిదర్శనం,
నిజానికైతె మనలోనే, వేల వాదనలే అనుక్షణం...
ఒక్కొక్కరిదీ ఓ వ్యక్తిత్వం, అది వారివరకె ఏకైకం,
అభిప్రాయాల్లో భిన్నత్వం, ప్రతి ఇరువురికీ సహజం...
నీ వైఖరికే వ్యతిరేకమని,
ఇతరుల ధోరణినే దూషించద్దు...
అభిప్రాయాల్లో అంతరమని,
మనిషిని మొత్తంగా ద్వేషించద్దు...
నేటికి నువ్వేదో సాధించావని,
అన్యుడిని అజ్ఞానిగ చూడద్దు...
నీ మనసుకు అది సరికాదని,
వారి దారిని నువు సవరించద్దు...
మన అభిరుచులకు విరుద్దమని,
పరుల అభిప్రాయాలను నిలదీయద్దు...
మనము అనుకున్నది అవలేదని,
ఎదుటి వారిని నువు నిందించద్దు...
అభిరుచులబట్టి అందరికీ ఇష్టాలు అనేకం,
నీ ఇష్టమె ముఖ్యమంటె అది ఎప్పటికీ అవివేకం...
పరిస్థితులబట్టి ప్రజలకు కష్టాలూ అనంతం,
నీ కష్టమె గొప్పదంటె ఒప్పుకోదు జీవితం...
తప్పైనా ఒప్పైనా, మనిషి దృష్టికోణానికి బానిస...
నేడైనా రేపైనా, అందరు సబబేమో బహుశా...
అన్నీ తెలుసన్నోడు, ఆదర్శము ఎన్నటికీ కాలేడు,
నిత్యం విధ్యార్థిగ ఉన్నోడు, గొప్ప గురువు కాగలడు...
సమస్తమూ సమస్యలే, పనిగా తప్పులనే వెతికితే,
సృష్టంతా సవ్యమే, మన దృష్టిని కాస్త సవరిస్తే...

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home