Monday, May 10, 2021

కన్నవాళ్ళ ప్రవర్తన - పిల్లలపై ప్రభావం

అనగనగా ఊరిలోన అందమైన ప్రేమికులు,
వారివరకు ఆ ఇరువురు కాబోయే దంపతులు...
ప్రేమతోన మొదలైనా, పెద్దల ఆశీస్సులు పొందారు,
ఏనాటికి విడిపోమని, మనువున ప్రమాణాలు చేశారు...
పద్దతిగా మసలుకొంటు పయనం సాగించారు,
ఒకరినొకరు తెలుసుకొంటు ఒద్దికగా మెలిగారు...
అన్యోన్యతకే అద్దంలా అందరికీ కనిపించారు,
దాంపత్యానికి ఎప్పటికీ ఆదర్శం అనిపించారు...
చిరు నవ్వుల వాసంతం, అన్ని కాలాలూ నిలిచింది,
వారి జీవితాన ఆనందం, అందరినీ అలరించింది...
తమ ప్రేమకు సాక్ష్యంగా, సతానం కలిగింది,
పసికందుకు రక్షణగా, కన్నప్రేమ చేరింది...
అమ్మనాన్న మురిసిపోయి, నవ్వుల్లో మునిగారు,
పిల్లాడితో ఆడుకుంటు, కాలాన్నే మరిచారు...
రోజులు శరవేగంగా మాసాలై గడిచాయి,
అదనంగా ఎన్నెన్నో బాధ్యతలను పెంచాయి...
ఏ పాడుగాలి సోకిందో, జీవితాలు మారసాగాయి,
ఏ పెనుబూతం ప్రభలిందో, వాదనలే పెరిగాయి...
గదిలో ఏం జరిగిందో, ఎన్నో గాయాలను నిలిపింది,
మదిలో ఏం మెదిలిందో, వారి పట్టుదలను పెంచింది...
నమ్మకాన్ని నెమ్మదిగా అనుమానం ఆవహించింది,
అన్యోన్యత శూన్యమై, అది అపార్థంగ మారింది...
పలుకుల్లో ప్రేమ తగ్గి, అరుపులుగా మారాయి,
నలుదిక్కులు నిందలై, ఇళ్ళంతా మోగాయి...
అరుపులన్ని అలసిపోయి, మౌనాలుగ మిగిలాయి,
మాటలన్ని మూగబోయి, దూరాలే పెరిగాయి...
అందమైన అనుబంధం, అంధకారమయ్యింది,
పిల్లవాడి భవిష్యత్తు, ప్రశ్నార్థకమయ్యింది...
పంతమేమొ పెరిగిపోయి, పిల్లాడిని చేరింది,
ఒకరి ప్రేమ ఇంకొకరిని, దూరంగా నిలిపింది...
నాన్న ముద్దు చేస్తుంటే, అమ్మ అటువైపుకు వెళ్ళదు,
అమ్మ ఆప్యాయత చూపిస్తే, నాన్న ప్రేమ నిలవదు...
పసివాడే పలుకునేర్చి, చిరు ప్రశ్నలనే అడిగాడు,
పిల్లాడికి ఎందుకంటు, నాన్న దూరంగా నడిచాడు...
వత్సరాలు గడిచాయి, వడిగా వయసును పెంచేశాయి,
గుండెలు రాల్లయ్యాయి, కలిసే ఆశను తుడిచేశాయి...
నాన్న సాంగత్యం స్వచ్ఛమే, కానీ అమ్మకు విలువివ్వదు,
అమ్మ ప్రేమ అమితమే, కానీ నాన్నను రానివ్వదు...
పిల్లవాడు నిదానంగ, నిజమును గుర్తించాడు,
ఎవ్వరినీ మార్చలేక, లోన కుమిలిపోయాడు...
పాఠశాల ఆవరణంలో, ఎన్నో కుటుంబాలను చూస్తాడు,
తనవాళ్ళు కలిసి రారని, గుర్తొచ్చి దిగులు పడతాడు...
స్నేహితులు అడుగు ప్రశ్నలకు, సమాధానముండదు,
సర్దుకుపోదామన్నా, మనసేమో మాట వినదు...
చదువులోన ఏకాగ్రత, నిత్యం సన్నగిల్లుతుంటుంది
ఆటల్లో ఆత్మవిశ్వాసం, అచంచలమౌతుంటుంది...
జీవితాన ప్రతి ఆనందం, తన విలువను కోల్పోతుంది,
శోకమేమొ అలవోకగా, రెట్టింపై రగిలిస్తుంది...
నాన్న సమాధానమివ్వడని, నాన్నమ్మని నిలదీస్తాడు,
జారిన కన్నీరు తుడిచి, చివరకు తానే ఓదారుస్తాడు...
అమ్మనాన్న పెళ్ళి జ్ఞాపకాలు, అపుడపుడూ చూస్తాడు,
ఆ అన్యోన్యత ఏమైందని, దేవుళ్ళని నిలదీస్తాడు...
ఏ పాపం చేశాడని, ఈ పిల్లవాడికీ శోకం???
ఎవరిని బాధించాడని, కల్లోలమైంది తన లోకం...
కన్నవాళ్ళ కర్మలకు, బిడ్డల భవిష్యత్తు బలి అవ్వాలా?
పెద్దవాళ్ళ పంతాలకు, మూల్యం పిల్లలు చెల్లించాలా???
బంధం బలహీనం అయ్యిందని, మీ బాధ్యతనే మరవాలా?
మీ తప్పుల బరువులను, ఈ పసిమనసులు మోయాలా?
విధిరాత పెట్టు పరీక్షలు, వింతగానె ఉంటాయి,
మనము ధర్మాన్నే విస్మరిస్తె, అవి అంతం కానంటాయి...
ప్రతి దాంపత్యపు ధర్మము, తమ సంతానం సంతోషమే,
తొలి అడుగుల్లో తోడుంటూ, విలువలు నేర్పించడమే...
ప్రతి పిల్లవాడి అసలు ఆస్థి, అమ్మనాన్న అన్యోన్యతే,
ప్రతి కష్టంలో తోడుండేది, ఆ కన్నవాళ్ళ ఆప్యాయతే...
ప్రతిదినమూ దినకరుడు, కాంతిని జాబిల్లికి పంచుతాడు,
పరవశంతో ఆ జాబిల్లి, తన చలువని తిరిగిస్తుంది...
భానుడి ఒళ్ళంతా వేడున్నా, తన ప్రతాపాన్ని చూపడు,
చంద్రుడు రాత్రికి రాజే అయినా, దాడిచేయ తలచడు...
సూర్యుడు పంతానికెళ్ళి, తన కాంతిని ప్రసరించకున్నా,
చంద్రుడు చాదస్తముతో, తన చలువను అందించకున్నా,
ఈ సృష్టి అనే సంతానం, సతమతమై పోతుంది...
సర్వం నిర్వీర్యమై, మానవ మనుగడె నశిస్తుంది...



0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home