మతమా..? మానవత్వమా..?
ప్రసంగాలు వల్లించే ఓ హిందుత్వపు నేతా...
వాటివెంటె నడుస్తున్న ఓ మేకలాంటి శ్రోతా....
ప్రతి పంక్తీ చదివి చూడు శ్రీమత్ భగవద్గీత,
ఏ చోటనైన రాసుందా హిందువనే రాత...
ఇస్లాం మతమున మునిగిన ఓ ముస్లిం సోదరా...
ఆ విభాగాన్ని నడుపుతున్న మౌలానా దొరలారా...
ముస్లిం అను పదమును ఏ మూలనైనా చూసారా...
ఖురాన్ అంత మరోసారి చదివి కాస్త చెప్పరా..
క్రిష్టియన్ మతమున తడిసిన ఓ క్రైస్థవ నేస్తమా..
క్రైస్థవ వ్యాప్తిని కోరి కృషి చేసే ఓ సమూహమా...
బైబిల్ లో చెప్పబడిన నీతినంత చూడండి...
క్రిష్టియన్ అనే మాట రాసుంటే చెప్పండి..
అల్లా, జీసెస్ మొదలు శ్రీ కృష్ణుడి వరకు...
ధర్మమొకటె చెప్పారు ఓ సమబద్దత కొరకు..
మతము అనే మాట లేదు ఏ గ్రంధంలోనైనా...
మరి మనకెందుకు విభేదాలు కారణమేదైనా..
దేవుడి పేరుని చెప్పి మతగురువులు పుట్టారు..
వేషభాషలన్ని మార్చి మరో సృష్టి చేశారు..
మనుషులనే మతాలుగా అతిసులువుగ విడదీశారు
ఆచారాలన్ని నేర్పి మనుషులనే మార్చారు...
ఆ మాయలోన పడిపోయిన ఓ కల్తీ మానవా...
జరుగుతున్న ఘోరాలు నీ మనసును చేరవా...
కులమతాల కళ్ళతోన చూసిందిక చాలురా,
నీ సొంత కళ్ళు తెరిచి కాస్త లోకాన్నే చూడరా...
మతహత్యల నేపద్యము ఈ మహమ్మారి కాదా,
మనసారా వెతికిచూడు ప్రతి హత్యవెనుక గాధ...
విడిపోయిన ప్రేమికులను అడిగిచూడు బాధ,
మతమొకటే కారణమై వారి కన్నీరై రాదా...
రాజకీయ తొలిబలమై ఈ మతమొకటే లేదా,
మతస్వామ్యం తప్ప ఇచట ప్రజాస్వామ్యముందా...
ఉద్యోగాలకి అర్హతగా ఈ కులమతమే లేదా..
ఈ దౌర్భాగ్యం ఒడిలో దేశాభివృద్ది ఉంటుందా..
చెడుస్నేహం చెడ్డదని అని సెలవిచ్చే మతపెద్దలూ,
మనిషిగుణము చూసినట్టి మాకేనా ఆ నీతులు..
మతము అని ఏనాడో మీరు పెట్టుకున్న వాతలు,
మీరా మాకు దారి చూపి నడిపించే నేతలు...
చెట్టునీడ లాంటిది మన మానవత్వమనే గుణం,
ఈ గుణమొకటే విశ్వశాంతికి అవ్వగలదు కారణం..
పడగనీడ లాంటిది ఈ కులమతాల దారుణం..
ఈ మాయదారి నీడలు మన నైతికతకు నాశనం..
ప్రతి మదిలోనూ మంచితనము ముందునుంచె ఉందండీ,
మతము అనే వడపోతతో అది మాయం అవుతుందండి..
ఈ మతము నీడ విడిచి మీరు నిజములోకి నడవండి,
అసలు సిసలు ప్రపంచాన్ని మీ కళ్ళతోనె చూడండి..
ఈ కులమతాల విభేధాలు ఏ జాతిలోన లేవండీ,
వరము లాంటి మన జన్మకి శాపం ఈ మతమండీ...
మతము అనే మాట విడిచి ధర్మాన్నే నమ్మండి...
ప్రతి దేవుడు పూసగుచ్చి చెప్పిందే అదండీ...

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home