Saturday, June 27, 2020

సైనికుడి పుట్టుక... (తన మాటల్లో...)

సరిహద్దున పోరాడుతున్న, సైనికున్ని నేనైనా,

దేశాన ప్రతీ పౌరుడిలా, సగటున సామాన్యుడినే...

ప్రజల రక్షణయే పనిగ ఉన్న, నేటి సిపాయినే నేనైనా,

పదుల ప్రయత్నాల్లో విఫలమైన, నిన్నటి నిరుద్యోగినే...

 

ఎంపికైన ఆనాడు, నాకు దేశభక్తి లేకున్నా,

ఎదురు వెళ్ళి పోరాడే, ధైర్యం ఉందనుకున్నా...

సాటి మిత్రులతో పోలిస్తే, గొప్ప జీతాలేం కాకున్నా,

సర్కారీ కొలువులోని, గౌరవమే చాలనుకున్నా...

 

దేశరక్షణకై నిలవాలని, మా ప్రయాణమే సాగినా,

క్రమశిక్షణతో మొదలైనది, తొలిరోజుల్లో శిక్షణ...

ప్రతిక్షణమూ పరిశుభ్రత, చేరెను మా లక్షణాన,

ప్రవర్తనే ప్రతిపనికీ, ముఖ్యమనే ఒక భావన....

 

వేకువ జామున, వడిగా పరుగుతోన మొదలౌతూ...

పలురకాల అభ్యాసాలతో, రోజంతా కరుగుతూ...

ప్రతి శిక్షణకూ మధ్య గడువు, పదినిమిషాలే దొరుకుతూ...

భౌతిక శిక్షణందు కఠినత్వము, దినదినమూ పెరుగుతూ...

 

అసలుసిసలు అధ్యాయం, అపుడే మొదలౌతుంది,

సమయపాలన మా రక్తంలో, ఒక భాగంగా మారుతుంది...

 

రెండు చేతులనీ తలకుపెట్టి, మోకాల్లపైన కదలడం,

ముళ్ళకంచె కింద మేము, మోచేతిపైన పాకడం,

భుజముపైన బరువులతో, బురదలోనె నడవడం,

రాత్రి నిద్ర కూడ లేకుండా, చలినీటిలోనె మునగడం...

 

త్రాళ్ళు పట్టుకుని ఎక్కడం, ఎన్నో ఎత్తులనే దూకడం,

సాటి సైనికుడిని మోయడం, అంతా కుటుంబమని నమ్మడం,

పరిసరాలు గమనించడం, గుర్తించినవి పరీక్షగా రాయడం,

వ్యూహాలను ఛేదించడం, తిరిగి ఎత్తులనే వేయడం...

 

శిక్షణ, అడుగడుగుకు అవరోధమై, మా యోగ్యతనే ప్రశ్నిస్తుంది...

శారీరాన్ని సానపెడుతూనే, బుద్ది బలాన్ని కూడ పెంచుతుంది...

 

ఆయుధంతో అలవోకగ, మమేకమైపోవడం,

ఏకాగ్రతతో గురిచూసి, లక్ష్యాలను ఛేదించడం,

గుభేలంటు గుండు పేలి, గమ్యం వైపెళ్తుంటే...

గుండెలోతుల్లో భయము కూడ, అంతరించి పోతుంటే...

గుండ్లశబ్ధాలే వేదమంత్రాలుగ, మా చెవుల్లోన మోగుతాయి...

గర్వపడమంటూ సైనికులను, దేశభక్తులుగా మార్చుతాయి...

 

ఆ దినమునుంచి దేశభక్తి, మా దేహాన భాగమౌతుంది,

లోన కొద్దిపాటి గర్వమున్నా, అది శూన్యం అయిపోతుంది

 

పరిపక్వతతో ప్రతి సైనికుడూ, వేలరెట్లు ఎదిగిపోతాడు,

ఎంత ఎత్తుకు తానెదిగినా, నేలకు ఓదిగిపోయి ఉంటాడు....

 

శిక్షణ ముగిసేనాటికి, ఏడాది గడిచిపోతుంది…

నేర్చిన ఈ జ్ఞానమంత, మదిన నిలిచిపోతుంది...

చేతికి ఒక ఆయుధము, అలంకారంగా చేరుతుంది...

ఛాతికి ఒక చిహ్నము, దేశముద్ర లాగ నిలుస్తుంది...

 

సమిష్ఠిగా సైనికులం, కవాతుగా వస్తాము...

సాదరంగ, సగర్వంగ, క్రమశిక్షణతో నిలుచుంటాము...

మతగురువుల సమక్షాణ, ప్రమాణమే చేస్తాము...

సైనికుడై సగర్వంగా, సరిహద్దుకి పయనిస్తాము...

 

మాతృమూర్తి అమ్మకి, ధైర్యాన్ని నూరిపోస్తూనే,

దేశమాత అమ్మకి, వెన్నుగ ఉండాలని వెళ్తాము...

కోట్ల అమాయకపు ప్రజల్లోన, భాగంగా ఉంటూనే,

దేశపు ఎల్లల్లో సింహాల్లా, బాధ్యతగా నిలుస్తాము...

 

                         ---సైనికుడి అసలైన ప్రయాణం…” ఇంకొన్నిరోజుల్లో తర్వాతి భాగంలో......

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home