సగటు నిరుద్యోగి పరిస్థితి
సమాజాన సగటు నిరుద్యోగి, ఒక ఎడారి బాటసారి,
అవకాశమనే ప్రతీ ఎండమావినీ పలకరించే సంచారి,
సమయం సంధించే సమస్యలకు సహచారి,
కడుపు కాలుతున్నా, చేయి చాచలేని బికారి...
చదువు అవ్వగానే గర్వపడతాడు,
ఉద్యోగమొస్తుందని ఆశపడతాడు,
వేలప్రయత్నాలతో అలసిపోతాడు,
కడకు అదే చదువుని చూసి సిగ్గుపడతాడు...
ఆశయాలు మెచ్చుకునేలా ఉన్నా,
అవకాశాలు మొండికేస్తుంటాయ్...
ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నా,
ఆచరణకు నోచుకోలేకుంటాయ్...
అవకాశాలు ఆశచూపి జారిపోతుంటే,
అపజయాలు ఆత్మవిశ్వాసాన్ని ప్రశ్నిస్తుంటాయ్...
అప్పులూ అవసరాలు పెరిగిపోతుంటే,
ఆశలూ అవయవాలు అలసిపోతుంటాయ్...
ప్రత్యేకత లేందే పలకరింపుండదు,
ఉద్యోగం రాందే గుర్తింపు దొరకదు…
బంధువుల ప్రశ్నలకు మన ప్రయత్నాలు కనపడవ్,
కాలం పరీక్షలకు మన బరువుల బాధలు వినపడవ్…
వర్షం, ఉద్యోగం అందరికీ ఒకటి కాదు…
వానలు వనాలకు అవసరం,
అదే వాగులకు, వరదలకు అదనం…
ఉద్యోగం కొందరికి కాలక్షేపం,
అదే మధ్యతరగతికి కనీస అవసరం...
అర్హత కులాలను బట్టే అనేది చట్టం,
అందుకే సగటు నిరుద్యోగి నిరాశకి చుట్టం…

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home