Tuesday, June 14, 2016

సాహిత్యపు సాంగత్యం


కవిరాజులు ఏలినట్టి సీమలోన పుట్టాను,
మాతృభాష విలువ తెలుపు పాఠాలను చదివాను,
తెలుగులోని తియ్యదనపు రుచిని తెలుసుకున్నాను,
కవికులాన చేరి నేను కలము చేత పట్టాను,

సాహిత్యపు సాంగత్యము వరము ఎంత పెద్దదో,
కవిత రాయగానె కలుగుతున్న తృప్తి ఎంత గొప్పదో,
తల్లి లాంటి తెలుగు ఒడిన పవలించుటెంత భాగ్యమో,
గురువు లాంటి పదము జతగ పయనిచుటెంత పుణ్యమో,
తెలుసుకున్న క్షణమునుంచి ప్రీతి కాస్త పెరిగింది..
కవనమనే రవికిరణం నా జీవితాన చేరింది..

కవిగుణమే చూడగలదు ప్రకృతి అందాలను పూర్తిగా,
కవికలమే చెప్పగలదు ప్రతి తరుణాన్నీ గొప్పగా,
కవి ధోరణి కొత్తది, కవి ప్రతి కోణం వింతది,
కవి భావం పెద్దది, కవి వివరణ లోతైనది..

చేయలేదు ఏనాడు చందస్సుల తపస్సు,
నే వెల్లలేదు ఏరోజూ మేదస్సుల సదస్సు,
వేటూరి, సిరివెన్నెల అశీస్సుల ఉషస్సు,
ఉందనుకుని కదిలేదే నా ఏకలవ్య మనస్సు...

పలకగలుగు పదాలు, పరిమితిగా పంక్తులు,
పద్దతిగా ప్రాసలు, ప్రకృతితో పోలికలు...
కథకు ఉన్న చరిత్రలు, అందులోని పాత్రలు...
సరళంగా శీర్షికలు, స్పష్టంగా భావాలు,
ఇవే కదా ఒక కవితకు ప్రాణమిచ్చు అంశాలు,
వీటి కలయికేగ అందులోన దాగిఉన్న అందాలు..

కలముపట్టి తప్పటడుగు వేసిన ప్రతి రోజున,
శాస్త్రిగారి సాహిత్యం నను ప్రోత్సహించి నడపుగా...
పంక్తి వెంట ప్రాస రాక నే తపియించే క్షణమున,
వేటూరిగారి పాటలు నను సరిదిద్దును చక్కగా...

పదము పదము పేర్చుకుంటు కలము ముందుకెల్తుంటే,
నయనం నిద్రను మరచి మనసువెంట వస్తుంటే,
ఆకలి అన్నం విడిచి కవిత అర్థంకై చూస్తుంటే,
ప్రతి పోలికతో ప్రాస కలిసి భావం చిగురిస్తుంటే,
ఆ చిగురించిన కవిత ఇచ్చు తృప్తి చాలు మనసుకి...
ఈ తరిగిపోని ఆస్తి తెచ్చు పేరు చాలు ఈ జన్మకి...
---- చిన్న....









0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home