Sunday, June 28, 2020

సైనికుడి పోరాటం... (తన తూటాల్లో...)

కఠోరమైన శిక్షణ, మమ్ము సైనికులుగ మార్చగా...

కర్తవ్యమైన రక్షణ, ప్రమాద ప్రాంతాలకు పంపగా...


సరిహద్దున శత్రువులకు, కనుచూపుమేర దూరంలో,

వారి తుపాకీల తూటాలే, మనని తాకేంతటి దెగ్గరలో,

ఏక్షణమేమౌతుందో అని, తెలియని ఒక భావనలో,

ప్రతి అత్యవసర వేళల్లో, తాత్కాలిక గుడారాల్లో,

 

పదిదిక్కుల పరిశీలనతో, ప్రతిరోజును గడుపుతాము...

ఒకరికొకరు అండగా, అన్నదమ్ముల్లా మెలుగుతాము...

కలుషిత కులమతాల గోడలనూ, ఏనాడో దూకేశాము...

వాటన్నిటినీ దాటుకునే, కుటుంబమై కలిసున్నాము...

 

రానున్న పరిణామాలకు, వ్యూహాలను రచిస్తూ,

ఉగ్రవాద ఎత్తులనే, ఎప్పటికప్పుడు ఛేదిస్తూ,

ముప్పు ఏవైపున ఉందోఅని, ప్రతిచోటుని శోధిస్తూ,

శత్రువుల కనులు చేరకుండ, గోతుల్లో పాకుతూ,

పగలంతా ప్రతి ప్రశ్నకు, సమాధానాలే వెతుకుతాము...

శత్రుదాడి తిప్పికొట్టేందుకు, సంసిద్దంగా ఉంటాము...

 

కొందరు రాత్రంతా మేలుకుని, రక్షణ ప్రదక్షిణలు చేస్తారు...

మిగిలిన సైనికులే శాంతిగా, నమ్మకంతో నిదురిస్తారు...

 

లోన వంద మంది జవానులైన,

దేశాన వంద కోట్ల జనాలైన,

ప్రశాంతంగ పడుకుంది, పదిమంది అన్నల వల్లనే...

తిరిగి ప్రభాతాన్ని చూసేది, వారి ప్రతిరాత్రి త్యాగ ఫలితానే...

 

అమాంతంగ శత్రువులు, మన సరిహద్దులోకి వస్తుంటే,

అన్యాయంగా శస్త్రాలను, ఆపకుండ సంధిస్తుంటే,

ఎగబడుతూ తిరగబడి, సమిష్టిగా పోరాడతాము...

తనువు తూట్లు అవుతున్నా, ఉగ్రమూక అంతుచూస్తాము...

 

ప్రయత్నాన కొందరు, అమరవీరులౌతారు...

దేశరక్షణలో భాగంగా, వారి ప్రాణాలను వదిలేస్తారు...

గుండెల నిండా ఏరై, కన్నీరే పారుతుంది...

దేశపు జెండా వారికి, తోడుగ కదిలెళ్తుంది...

 

ప్రజానికం ఒకటై, వారి త్యాగాన్నే పొగుడుతుంటే...

ప్రతి అధికారీ జయహో అని, జోహార్లే కొడుతుంటే...

అన్నను కోల్పోయి మేము, మూగబోయి నిలుచుంటే...

వీర సైనికుడా సలామంటు, తుపాకీలు పేలుతుంటే...

 

త్యాగమూర్తి జవానుగా, స్వర్గానికి పయనిస్తాడు...

కోట్ల ప్రజల గుండెల్లో, కలకాలం మిగిలుంటాడు...

 

సాటివారి మరణాలే, మమ్ము కలచి వేస్తున్నా...

మేముకూడ ఓనాడు, మరణిస్తామని తెలిసినా...

సూర్యగోళమంటి గుండెతో, తిరిగి యుద్దానికి వెళ్తాము...

ప్రాణం ఉన్నంతవరకు, పోరాడుతూనె ఉంటాము...

 

రాజస్థాన్ వేడి పెరిగి, అది యాభైనే తాకినా,

సియాచిన్ మంచు కరిగి, మా సైన్యాన్నే ముంచినా,

హిమము ఒళ్ళంతా పాకినా, ఎముకలనే కొరికినా,

ప్రతి అవయవాన్ని విరిచినా, మొత్తంగా కూల్చినా,

 

లధాక్ లోయ లోతైనా, కాశ్మీరు కొండ ఎత్తైనా,

అడవులెంత దట్టమైనా, దారులెంత కఠినమైనా,

వెనకడుగే ఉండదు, మా మరుగుతున్న రక్తాన...

దేశరక్షణ ఓ వరమై, మము చేరిందీజీవితాన....

 

ఇట్లు...

సైనికులం... మీ సేవకులం...

 

ఇక రచయిత మాటల్లో...

 

మొలకెత్తాలని ప్రతి విత్తనము, ప్రకృతితో పోరాడుతుంది...

అనంతమైన అవనినైన, అలవోకగ చీల్చి అవతరిస్తుంది...

 

మొలకెత్తిన మొక్కెపుడూ, విశ్రాంతిగ ఉండదు...

మానై తానెదగాలను, ప్రయత్నాన్ని ఆపదు...

వడగాలికో, వరదకో, తాను అంతరించదు...

నరలోకానికి నీడగా, తను నిలవక మానదు...

 

వృక్షమంటి సేవకుడే, భారత ప్రతి సైనికుడు...

ప్రతిక్షణమూ ప్రజలయొక్క, భద్రతకై శ్రమపడతాడు...

 

విత్తుపడిన కష్టము, తను తొలుత శిక్షణందె పడతాడు...

మొక్క మొలకెత్తిన మాదిరిగా, సైనికుడై తను పుడతాడు...

మానుగ ఎదుగుతున్న తీరుగా, సరిహద్దుకి పయనిస్తాడు...

ప్రాణాలను పనంగపెట్టి, ఉగ్రవాదులతో పోరాడతాడు...

 

మొలకే పైకెదిగిపోయి, మానుగ తను మారినట్టు,

వేడి తాకిడెంత పెరిగినా, నీడను మనకిచ్చినట్టు,

మనలోని సామాన్యులే, సైన్యంగా మారారు...

శత్రుతాకిడెంత పెరిగినా, మనని రక్షిస్తూనే ఉన్నారు...

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home