Saturday, August 8, 2020

ప్రేమలో ఓడిపోయిన తర్వాతి కథ...

అనగనగా ఊరిలోన, ఒక విఫలమైన ప్రేమకథ,
అది ముగిశాక జరిగినది, నాకెన్నటికీ ఓ పొడుపుకథ...

నాకు మంచి స్నేహితుడు, అందులోని ప్రేమికుడు,
తాను గుణంలోన గొప్పోడు, గర్వమసలె లేనోడు...

లక్షల లోగిలో లేకున్నా, లక్ష్యాలను కలవాడు,
సింహాసనమే కరువైనా, లక్షణాన లక్ష్మణుడు...

ఒక అమ్మాయిని కలిశాడు, స్నేహాన్నే చేశాడు,
తన మనసుని చూశాడు, మమేకమై పోయాడు...

ప్రేమలోన మునిగాడు, ప్రాణంగా ప్రేమించాడు,
అమ్మాయిని అడిగాడు, అవుననగానే మురిశాడు...

కలలెన్నో కన్నాడు, కడకు పెళ్ళిదాక వెళ్ళాడు,
ప్రేయసితో చెప్పాడు, కలిసి ఒప్పిద్దాం అన్నాడు...

ప్రియురాలు సరే అనగానే, ప్రియుడు లేచి కదిలాడు,
పెద్దవాళ్ళనింక కలవాలని, గడపదాక నడిచాడు...

కులమేమో గుణముని, నువ్వెవరని అడిగింది,
స్థోమతేమొ అంతస్థుకి, సరిపోవని తేల్చింది...

పిల్లతండ్రి కోపంతో, విర్రవీగిపోయాడు,
మాటలసలె వినకుండా, వాదనలే చేశాడు...

ప్రియురాలూ మూగబోయి, వెనకడుగే వేసింది,
వదిలి ఉండలేను అంటూనే, తిరిగి నచ్చచెప్పింది...

ప్రేమకథే పెళ్ళిదాక, నడవలేకపోయింది,
మూర్ఖత్వంతో పోరాడి, నిలవలేక ముగిసింది...

నిజముని నమ్మలేకపోయాడు, ఘోరంగా గాయపడ్డాడు,
గుండె పగిలేలా ఏడ్చాడు, మూగబోయి మిగిలాడు...

మిత్రుడిగా నేను తనని, చూడలేకపోయాను,
బాధని దెగ్గరగా చూస్తున్నా, ఓదార్చలేక ఉన్నాను...

బరువెక్కిన గుండెతోన, బతకలేడు అనుకున్నాను,
తనప్రేమను మరిచిపోయి, తిరగలేడని నమ్మాను...

ఆరోజునుంచి జరిగినది, నేనసలే ఊహించనిది,
వాడి మదిలోపల మెదిలినది, నాకెప్పటికీ తేలనిది...

ఏమిచెప్పి నచ్చచెప్పాడో, తనమనసుకు ఈ మగాడు,
కలలన్నిటినీ చెరిపాడు, ఇక నిజంలోకి నడిచాడు...

అంతపెద్ద బాధను, మొత్తంగా జీర్ణించుకుని,
వేల జ్ఞాపకాలను, మనసులోనె దాచుకుని,

మాముందుకు మామూలుగ, నవ్వుకుంటు వచ్చాడు...
ఇది జీవితాన భాగమని, శ్వీకరించి సాగాడు...

తనవాళ్ళను బాధించడు, దైవాన్నే దూషించడు,
ప్రేయసినీ నిందించడు, పరిస్థితినీ ద్వేషించడు...

గతంలోకి నడవడు, గాయాలతొ గడపడు,
వ్యామోహంలో బతకడు, వ్యసనాల చెంత వాలడు...

ప్రియురాలి పెళ్ళి అవుతున్నా, తనకేసి నవ్విచూస్తాడు,
ఈ వింతేంటని అడిగినా, తను బాగుండాలంటాడు...

ప్రేమలోన ఓడాడు, అయినా ఏపనినీ ఆపడు,
ఓటమితో ఒదిగాడు, మనిషిగ వేలరెట్లు ఎదిగాడు...

ఆకసాన్ని ఆవహించి, మేఘం గెలిచాననుకుంటుంది,
ఆ భ్రమలోనే విర్రవీగి, చినుకుల సంబరమై కురుస్తుంది...
ఉరుములు విసిగించినా, నింగి నిర్మలంగానే ఉంటుంది,
తన ఉనికిని కదపలేక, మొబ్బే కనుమరుగై పోతుంది...

నింగిలాంటి నిశ్చలుడు, ఈకథలో నా స్నేహితుడు,
కష్టాలకి కుంగిపోడు, తిరిగి పోరాడక మానడు...

గతంలోని పాఠాలను, గమనించి గౌరవిస్తాడు,
భవిష్యత్తు ముఖ్యమని, గుర్తించి గర్వపడతాడు...

బాధకన్నా బలవంతుడు, ఈ విఫలమైన ప్రేమికుడు,
విఫలాలను విజయాలకు, వారధిలా వాడతాడు...

చిరుకష్టాలకు చిన్నబోయి, ప్రతిచోటా ఆగడు,
మొబ్బులనే చీల్చుకుని, కిరణంలా కదిలాడు...

ఇలాంటి మనసు ఉన్నోళ్ళే, ఆదర్శమైన ప్రేమికులు,
ఎప్పుడేది ముఖ్యమో, స్పష్టంగా తెలిసినోళ్ళు...

ఊపిరి ఉన్నంతవరకు, పోరాడుతూనె ఉంటారు,
వీరు ప్రేమలోన ఓడినా, జీవితాన గెలుస్తారు...

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home