Friday, July 10, 2020

వర్కింగ్ ఉమెన్ జీవితం (Working Women Life)

ఇటురావే నా శ్రీమతీ, నీకు అందమైన కథ చెబుతా...
వచ్చి కూర్చోవే సుగుణవతీ, కథను కవనంగా అల్లుతా...

అనగనగా అందమైన, ఓ మధ్యతరగతి ఇల్లు,
ఒడిదుడుకులు వేలున్నా, విలువలను వదిలేయని పొదరిల్లు...

ఆ గుమ్మంలో పుట్టింది, ఓ ముచ్చటైన ముద్దుగుమ్మ,
అమ్మనాన్న జీవితాన, అది అపురూపమైన బుట్టబొమ్మ...

సుఖదుఃఖాలకు సమదూరంలో, బాల్యం ఊయలలా సాగింది,
కన్నవాళ్ళ ప్రేమ నడుమ, బాలిక ఒద్దికగా పెరిగింది...

కష్టాలకెదురు నిలవాలని, కసిగా చదివేసింది,
నాన్న పరువు నిలుపుతూ, ఉద్యోగం సాధించింది...

అమ్మ కన్నీళ్ళను తుడుస్తూ, మనసారా హత్తుకుంది,
నాన్న బరువు తగ్గిస్తూ, బాధ్యతలను పంచుకుంది...

సుగుణవతే సగర్వంగ, సొంతకాళ్ళపైన నిలుచుంది,
విలువలకే ముఖచిత్రమై, సమాజాన నడిచింది...

తొలిరోజుల్లో సంపాదన, మితంగానే వస్తున్నా,
తన మధ్యతరగతి కుటుంబాన, చిరు కష్టాలను తీర్చేది...

ఉద్యోగంలో పనిఒత్తిడి, అమితంగా ఉంటున్నా,
తన ఒద్దికైన గుణంతో, నవ్వుతూనే పూర్తి చేసేది...

కాలంతో పెళ్ళి వయసు, వడిగా వచ్చేసింది,
కాదన్నా కదిలెళ్ళాలను, అర్థాన్నే చూపింది...

అమ్మనాన్న జీవితాన, సందడినే తెచ్చింది,
అమ్మాయి గుండె లోతులోన, అలజడినే పెంచింది...

నెలలైనా గడవందే, సంబంధం కుదిరింది,
ఏడాది కూడ ముగియందే, సంబరమూ జరిగింది...

కొత్త వ్యక్తి భర్తగా, జీవితాన చేరాడు,
సర్వం ఇక తానే అని, చెప్పకనే చెప్పాడు...

నాటి పద్దతిగల యువతి, నేడు పనిచేసే పడతిగా,
నిన్నటి ఒద్దికైన కూతురు, నేటి బాధ్యతగల పత్నిగా...

పుట్టినింట అమ్మనాన్నకు, ఆసరాగ ఉంటూనే,
మెట్టినింట అత్తమామలకు, అన్నీ సమకూర్చాలని అనుకుంది...
తన భర్తకి మనసారా, గౌరవాన్ని ఇస్తూనే,
పతి సంపాదనకు అదనంగా, తను సంపాదించాలని కదిలింది...

ఇల్లాలిగ ఇంటిలోన, అన్నీ సమకూరుస్తూ,
ఉద్యోగిగ విధినందు, కర్తవ్యం నెరవేరుస్తూ,
ప్రతిక్షణమూ పనిచేసి, చిరుసరదాలను మరచింది...
తనకు కూడ తెలీకుండ, త్యాగాలను చేసింది...

కొన్నాళ్లకు ఈ కలువ, అమ్మగ అవతరించింది,
తన పసిబిడ్డను చూసుకుని, పరవశించిపోయింది...
బాధ్యతంత రెట్టింపై, కళ్ళముందుకొచ్చింది,
ప్రాధాన్యం నాదేనని, పసికందు చూసి నవ్వింది...

ఆ రోజునుండి రాత్రి కూడ, పగలుకు జతకలిసింది,
నయనానికి నిద్ర కాక, నిరీక్షణే వరమయ్యింది...

బాధ్యతెంత చేరిందో, బలము అంత పెరిగిందని,
అదనమైన సంపాదన, ఇపుడెంతైనా అవసరమని,
ఏడవ మాసం నుండే, తిరిగి పని బాటను పట్టింది...
బాధ్యతకు బానిసౌతూనే, విధికి న్యాయాన్నే చేసింది...

ఎంత అనకువగా ఉంటున్నా, వింత మాటలు ఎదురౌతుంటే,
అయినోల్లే అపార్థంతో, గర్వము పెరిగిందని నిందిస్తుంటే,
బంధువుల డబ్బు కళ్ళకేమొ, నెల జీతాలే కనపడుతుంటే,
ఉద్యోగంలో ఒడిదుడుకులు, తన గుణమును ప్రశ్నిస్తుంటే,

సున్నితమైన సమస్యలతో, సతమతమై పోయింది...
దిగులు ఎంత పెరిగినా, తన మదిలోనే దాచుకుంది...

రోజుల వేగం పెరిగి, ఏల్లెన్నో గడిచినా,
ప్రతిదినమో పరీక్షగా, పడతిని ప్రశ్నించినా,
సవాల్లనూ సహృదయంతో, శ్వీకరించి సాగింది...
అల్లుకున్న బంధాలకు, ఆత్మీయతనూ పంచింది...

ఈ పడతి త్యాగఫలితాలే, తన కుటుంబాన ప్రతి విజయాలు...
తన మదిన నిత్యఘర్షణలే, అందరి ప్రశాంతతకు కారణాలు...

ఆ అపురూపమైన ఇల్లాలు, నా కళ్ళముందె కూర్చుంది...
తన కథకే కదిలిపోయి, కన్నీటితోన వింటుంది...

కథ ముగిసిందే శ్రీమతీ, నీకు కాస్తైనా నచ్చిందా???
కళ్ళు తుడుచుకోవే పుణ్యవతీ, నీ పయనం గుర్తొచ్చిందా???

చిరుగాలికి చెల్లెల్లే, నీలాంటి ప్రతీ పడతులు,
ప్రతి కుటుంబాన నిత్యమూ, ప్రాణవాయువంటివాళ్ళు...
మనకంటికి చిరుగాలి, ఎప్పటికీ కనిపించదు...
మీ కష్టం కొందరికి, ఏనాటికి అర్థంకాదు...

భూమాతకి బిడ్డలే, నీలాంటి గొప్ప భార్యలు,
ఓపికకే మారుపేర్లు, మీ అందరి జీవితాలు...

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home