కరోనా చేసిన విలయం
పరదేశంలో సూక్ష్మజీవి, కొత్తదొకటి పుట్టింది,
మనిషి ఉసురు తీసిమరీ, ఊపిరినే పోసుకుంది...
శాస్త్రజ్ఞుల సమక్షాన, నామకరణము జరిగింది,
కరోనాగ అవతరించి, అడుగు ముందుకేసింది...
సాధారణ వ్యాధిగానే, తొలిరోజుల్లో అనిపించి,
వార్తావస్తువు లాగే, ప్రతిదేశానికి కనిపించి,
చాపకింద నీరులా, అందరికీ వ్యాపించింది...
అవలీలగ వందల్లో, ప్రాణాలను తీసుకుంది...
వూహాన్ నగరంలోన, ఉప్పెననే సృష్టించి,
చైనాలో ఉదృతిని, ఉదాహరణగ చూపించి,
దేశాలకు దశలుగా, పాకుకుంటు పోయింది...
దర్జాగా దారుణాన్ని, చేసుకుంటు సాగింది...
ప్రభుత్వాలు ఆపలేక, అలసటపడిపోయాయి,
పరిష్కారాన్నే చూపలేక, ఆకాశం చూశాయి...
పదిరోజుల్లో బాధితులు, లక్షలు అయిపోయారు,
వేలల్లో వృద్ధులు, మరణాన్ని చేరుకున్నారు...
అంతటితో ఆగలేదు, ఈ మహమ్మారి లీలలు,
ఏ మందులకీ లొంగలేదు, ఈ అంటువ్యాధి లక్షణాలు...
ఏ మేధావికి అందలేదు, దీన్ని అరికట్టే మార్గాలు,
ఎంతటికీ తగ్గలేదు, ఈ పెరుగుతున్న గణాంకాలు...
వైధ్యానికి ప్రసిద్ధిగా, వర్దిల్లిన దేశాలూ,
జ్ఞానానికి గ్రంధాలని, గర్వపడే రాజ్యాలూ,
సూక్ష్మజీవి దాటికి, అవి సతమతమైపోయాయి...
సర్వం నిర్వీర్యమై, ఉత్త సంఖ్యలుగా మిగిలాయి...
రోజులు పెరిగే కొద్దీ, రాక్షసంగ మారింది,
భూలోకం బాధలతో, దద్దరిల్లి పోయింది...
లక్షల్లో బాధితులు, ప్రతిరోజూ పెరుగుతుంటే,
వేలల్లో పీడితులు, ప్రతిదేశంలో మరణిస్తుంటే,
వందల్లో వ్యాపారాలు, అమాంతంగ మూతపడుతుంటే,
కోట్లల్లో ఉద్యోగులు, తమ పనులను కోల్పోతుంటే,
కొందరేమొ బాధలతో, పోరాటం చేస్తున్నారు...
ఇంకొందరు భయంతో, ప్రపంచాన్ని చూస్తున్నారు...
వైధ్యరంగంతో మొదలుపెట్టి, చావుదెబ్బ కొట్టింది,
ప్రతిరంగాన్ని పరోక్షంగ, నడినెత్తిన మొట్టింది...
దశాబ్దాల అభివృద్ధిని, మోకాళ్ళపైన నిలబెట్టింది,
ఆర్థికంగానూ దేశాలను, పాతాళానికి పడగొట్టింది...
ఈ మహమ్మారి ప్రపంచాన, మారణహోమం చేసి,
మన దేశానికి వచ్చింది, ఇంకో అవకాశం చూసి...
ఆలస్యంగా అడుగేసినా, తన లక్షణాన్ని చూపింది,
ప్రభుత్వాల ఎత్తులను, దారుణంగ చిత్తు చేసింది...
సక్రమంగ మెలగకుంటె, మరుదినమె సంక్రమించింది...
క్రమక్రమంగ పెరిగిపోయి, దేశాన్ని ఆక్రమించింది...
ఏమైతే జరగద్దని, పైవాన్ని కోరుకున్నామో,
అది అనుదినమూ పెరుగుకుంటు, ప్రళయంగా మారింది...
ఏదైతే రావద్దని, దేవున్ని వేడుకున్నామో,
అది అడుగడుగూ వేసుకుంటు, మన దాకా వచ్చింది...
నాన్న వ్యాపారం ఆగింది, అన్న ఉద్యోగం పోయింది,
వ్యాధి ఇంటిదాక వచ్చింది, వ్యాపించి వ్యధలు పెంచింది...
రోజువారి కూళీలు, కష్టాల గూడు చేరారు...
దాచుకున్న డబ్బులేక, దారుణంగ దెబ్బతిన్నారు...
ఆధారమైన పనులన్నీ, అమాంతంగ ఆగుతుంటే,
ఆసుపత్రి ఖర్చులేమొ, అదనంగా చేరుతుంటే,
వేలల్లో కుటుంబాలు, వీధిన పడిపోయాయి...
వారి ఆక్రందనలెన్నెన్నో, అంకెల్లో కలిశాయి...
భూకంపం క్షణాల్లోన, వచ్చివెళ్ళిపోతుంది...
సునామీ గంటలోన, గర్జించి శాంతపడుతుంది...
తుఫానైన వారంలో, వర్షించి ఆగిపోతుంది...
ఈ మహమ్మారి నెలలైనా, మనతోనే ఉంటుంది...
ఈ ప్రళయం నిజానికి, మన ప్రకృతి నియమం,
క్రమశిక్షణ కోల్పోతే, ఒక ఆపలేని విలయం...
పరిశుభ్రత లేనినాడు, ఇలా ప్రభవించుట ఖాయం,
గొలుసులాంటి ప్రపంచాన, ఇది అందరికీ గాయం...
బలవంతుడైన ప్రతివాడూ, బంధాలకు బలహీనుడు,
కుటుంబాన కష్టమొస్తే, ఓ క్షణమైనా నిలువలేడు...
తనవరకైతే నరకమైన, స్వాగతమని అంటాడు,
తనవాళ్ళకొస్తే నలుసైనా, రావద్దని వేడుకుంటాడు...
సమాజమే నేటినుంచి, మన కుటుంబమని అందాము...
సమస్య మన ఇంటిదని, నిత్యం జాగ్రత్తగ ఉందాము...
సామాజిక దూరమే, ఒక ఆయుధమనుకుందాము...
సంయమనంతో సమస్యను, ఇంటినుంచే తగ్గిద్దాము...

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home