నా లాంటివాల్ల అందరి ఆలోచనా ఇదే
ఎటు సాగిన స్వాగతించు ఎడారంటి నా దారి,
అడుగు తీసి వేసేందుకు అనుకూలత లేని దారి...
సహకారం లేకున్నా, సహవాసం చేస్తూ,
అవకాశం లేకున్నా, ఆరాటం పడుతూ..
అడుగులోన అడుగేస్తూ, ప్రతి అడుగూ లెక్కిస్తూ,
మంచిరోజులాశిస్తూ, ఆ ఆశలోనె పయణిస్తూ...
ఎదురొచ్చిన ఎండమావులెన్ని మోసగించినా,
ఇపుడగుపించిన ఎండమావి కొలను అని ఆశపడి...
పరుగుతీసి ధరిచేరిన ఫలితమేమొ పాతదే,
కన్నీటితోన అర్థించిన ఏ కొలను కనికరించదే...
చదువుకునే రోజుల్లో ప్రార్థించిన నేను,
ఆ చదువు కొనే ప్రక్రియలో అర్థించిన నేను...
ఈ కష్టాలముందు తలవంచి,
నా పైచదువులనే త్యజించి...
ఈ మాత్రం చదువుందని నాకు నేనె తృప్తిపడి,
ఇంతవరకు చదివించిన అమ్మకేసి గర్వపడి...
ప్రార్థననే ఆశనుంచి,
ప్రయత్నమనే ఆచరణకి,
ఉద్యోగమనే ఊరటతో,
ఆశయాల సంకల్పంతో...
తీరుమార్చి జీవితాన్ని పక్కదారి పట్టించి,
అలవాటులేని జీవితాన నడక మొదలు పెట్టాను...
సంపాదన మించివచ్చు ఖర్చులెన్ని పెరిగినా,
అడుగుకు ఒక అవసరమే అదనంగా చేరినా..
అప్పులోని అసలుకన్న వడ్డీలే పెరిగినా,
కొత్త కొత్త భాద్యతలే నా జీవితాన చేరినా..
అనారోగ్య మధ్యమాన పయణం సాగించినా,
పొదుపు అనే కంటితోన భవిష్యత్తు చూసినా...
కష్టమెంత వచ్చినా, బారమెంత పెరిగినా,
ఏ కష్టానికి భయపడను, ఏ బారాలకు జడవను..
నా సంపాదన తీరు ఓ నత్తనడకలా ఉన్నా,
ఏ అడ్డదారి పట్టను, ఏ జీవికడ్డు నిలవను..
నా ఆశయాల వ్యామోహంతో నా కష్టాలను మరవను,
నా కష్టాలు తీర్చు ఆరాటంలో నా ఆశయాన్ని వీడను..
మొట్టమొదట పొదుపు చేసి, మిగిలిందే ఖర్చుచేసి,
నా ఖర్చులన్ని అదుపుచేసి, లెక్కలన్ని సరిచేసి..
సౌకర్యం, సుఖాలనే స్వార్థాలను వదిలేసి,
ఈ కమ్ముకున్న కష్టాలను కాస్తైనా తుడిచేసి..
మా జీవితాన ప్రశాంతతని తొందర్లో తెస్తాను,
బాధల్లో నడుస్తున్న నడకకి తెర తీస్తాను...
