Sunday, November 10, 2019

అమ్మే నా ఆదర్శం


నీతికథలు, పురాణాలు చదవాల్సిన పనే లేదు,
నా ప్రతి అడుగుకి ఆదర్శం, మా అమ్మ పడిన కష్టమే...
పట్టుదలకి, గట్టి మదికి ఉదాహరణల ఊసు రాదు,
మా అమ్మ గతము గాధలే, నా గుణగణాల పునాదులు...


నాకు ఏడైనా నిండలేదు,
మా నాన్న, నన్ను వదిలెళ్ళిన నాటికి
నాకు ఏడుపైన రాలేదు,
చావంటే అర్థమైన తెలియని వయసుకి...


అమ్మ లేని లోటులో, మా అమ్మ ఉన్న రోజులవి,
భర్త కూడ దూరమై, బాధలలో నిలుచుంది
ఏడాది కూడ గడవలేదు, తోడులేని జీవితాన,
తండ్రి కూడ దూరమై, తను ఒంటరిగా మిగిలింది...


తన పిల్లల భవిష్యత్తు కల్లముందు బారంగా....
అత్తమామల ఆరోగ్యం దినదినమో సవాలుగా...
ఖర్చులతో కూడుకున్న కష్టాలు ఎన్ని వచ్చినా,
తన అన్నల అండనే కొండంతని నమ్ముతూ
సాయిబాబా సన్నిధిని నమ్ముకుంటు నడిచింది..
ఎదురైన ప్రతీ సవాలును, స్వీకరించి సాగింది..


సూర్యుడైన రాకముందె, ప్రతి పగలు పాల బుట్టలు...
మెడలు విరిగిపోతున్నా, ఘనమైన గడ్డి మోపులు...
రెక్కలు అలసిపోతున్నా, బోరింగు నీటి బిందెలు...
ఆదాయం లేకున్నా, అప్పులతో అలసటలు..
ఈ ప్రతి బరువులోన మోసింది, నువు మా భవిష్యత్తునే కదమ్మా...
ఆ పదిహేనేండ్ల ప్రయాణాన, నీకు అలసటైన రాలేదా...


పిల్లల పైచదువులు, లక్షల్లో ఖర్చులు...
అత్తమామల ఆసుపత్రులు, అదనంగా బాధలు...
కాలమెంత కఠినంగా, నీకు ఎదురు వచ్చినా...
ఒక కంటతడి ఆరగానె, తిరిగి కన్నీరే ఇచ్చినా...
నీ అడుగు మాత్రమెపుడూ, వెనుతిరిగే చూడలేదు...
పయనమెంత ఖఠినమైన, నీ ముందడుగే ఆగలేదు..


కాలం కన్నీటిని ఇచ్చినా, అది నిన్ను గెలవలేదులే అమ్మా...
నీ పట్టుదలను చూసి మరీ, తన దారిని మల్లించుకుంది....
ఏ తండ్రి నీకు సాటి రాడు, కష్టాలను తట్టుకునే తీరులో...
ఏ తల్లికీ రాకూడదు, ఇంత క్లిష్టమైన పరిస్థితులు...


నే పొందుతున్న ప్రతి ఆనందం, నీ కష్టానికి ప్రతిఫలం...
నాకందుతున్న ప్రతి సౌకర్యం, నీ సంకల్పానికి నిదర్శనం...
రోజులెలా మారినా, నా మనసున నువు దేవతవే…
దశాబ్దాలు గడిచినా, మన కష్టాలను మరువను లే...