సిరివెన్నెల కలానికి నివాళి (A tribute to our గురువుగారు)
లక్షల శిష్యులకే గురువులైన, ఓ సిరివెన్నెల గారు,
తెలుగు భాష సాహిత్యానికి, దక్కిన వరమే మీరు...
అజ్ఞానానికి అంతంలా, మీ కలముని కదిలించారు,
నేడు స్వర్గానికి బయలుదేరి, మమ్ము ఒంటరి చేశారు...
మా ఎందరికో ఆదర్శమైన, మీ భావాలకు భక్తులం,
అందరికీ కనిపించని, మీ ఆశావాదానికి అనుచరులం...
మా అణువణువుని కదిలించే, మీ పాటల ప్రేమికులం,
నిత్యం ఆసక్తిగ అనిపించే, మీ సాహిత్యానికి శిష్యులం...
ప్రతి విషయంపై మీ పరిశీలన, సరికొత్తగా ఉంటుంది,
సరళమైన మీ వివరణ, ప్రతి మదినీ తాకుతుంది...
ప్రకృతి మీ ప్రతి పాటలో, ప్రవేశించి పరవశిస్తుంది,
ఆ పాటవిన్న ప్రతి శ్రవణం, పలుమార్లు పులకరిస్తుంది...
చలనచిత్రాల్లో మీ రచనలు, వాటి పేరుకేమో పాటలు,
అవి నిజానికైతే మా అందరి వ్యక్తిత్వపు పునాదులు...
మనిషికెంత కష్టమెదురైనా, పోరాడమనే చెబుతారు,
మన సైన్యం మనమేనని, ఆత్మవిశ్వాసం నింపుతారు...
ప్రశ్నలోనె బదులుందని, పద్ధతిగా చెబుతారు,
మీ పరిశీలణ శక్తితో, కొత్త పథము చూపుతారు...
జవాబు మీకు తెలిసినా, ప్రశ్నించి ఊరుకుంటారు,
సమాధానాలను వెతకటమే, జీవితమని అంటారు...
మది బలహీనం అయిపోతే, మీ పాటతోనె నిట్టూర్పు,
మాకు భరించలేని బాధొస్తే, మీ పాటే ఒక ఓదార్పు...
ప్రేమ ఒడిన ఉన్నపుడు, మీ పాటలతో మైమరపు,
ప్రేరణకై చూస్తున్నా, మాకు మీ పాటలె మేల్కొల్పు...
నడతెందుకు మార్చవని, నిగ్గదీసి అడుగుతారు,
ఓటమికే లొంగకని, జీవిత పోరాటం నేర్పుతారు...
పురాణాల సారాన్ని, అతిసరళంగా చెబుతారు,
అనంతమైన జ్ఞానాన్ని, మా అందరికీ పంచుతారు...
విప్లవమూ, ఓదార్పు,
వేదాంతం, వైరాగ్యం...
పదాలదేమో విన్యాసం,
పోలికలదేమో పరవశం...
వైవిధ్యము మీ నేపథ్యం,
అభేద్యము మీ సారథ్యం...
ఆ గురుద్రోణుడి విలువిద్యకు, నాడు ఏకలవ్యుడు ఒక్కడే,
ఈ గురువుగారి వైవిధ్యానికి, అలాంటి శిష్యులెందరో...
మీ ప్రతి పాట పాఠమై, మాకు సాహిత్యం నేర్పుతుంది...
మీ ప్రతి కవిత కాంతియై, మాకు సన్మార్గం చూపుతుంది...
తరువాతి పాట ఎప్పుడని, వేచి చూడు కళ్ళకి,
తిరిగిరాని లోకాలు, తరగని శోకాలను మిగిల్చాయి...
మీ ప్రతిపాటకు పరవశించు, తెలుగువారి శ్రవణాలకు,
నేటి ఈ శాశ్వత దూరాలు, శాపాలుగ మారాయి...
మీ మరణవార్త వినగానే, మా మాట మూగబోయింది,
మీరికలేరను ఊహకూడ, మా ఊపిరినాపేస్తుంది...
యమధర్మరాజు సమన్యాయం, సన్యాసం తీసుకుందో,
లేక స్వర్గానికి హఠాత్తుగా, ఓపికంత నశించిందో...
పైన మీ మిత్రుడి గాత్రానికి, పాటరాయ తలిచారో,
లేక తెలుగుతల్లి కీర్తిని, కొనియాడాలని కదిలారో...
కారణాలు ఏవైనా, ఓ స్వర్ణశకం ముగిసింది,
నేడు సిరివెన్నెల సాహిత్యం, స్వర్గాన్నీ చేరింది...
వేటూరి గారి మరణంతో, లోటు సగమే అనిపించింది...
నేడు శాస్త్రిగారి పయనంతో, పాటకే గుండెపోటులా ఉంది...
మీ కలము నేలకూలలేదు,
నేడు నింగిదాక ఎగసింది...
మీ కవనాలకు చావులేదు,
వాటి కీర్తి కాస్త పెరిగింది...
ఆ మరణానికే ఆభరణం,
మా గురువుగారి ఈ పయనం...
మీరు దివికే ఒక తోరణం,
స్వర్గపు అణువణువూ పావనం...
ఇట్లు
మీ లక్షల ఏకలవ్య శిష్యులు
Written by
చిన్న
