కులం చేసిన ఘోరం...
తిరుపతిలో
నడకదారి అణువణువూ గుర్తుంది,
తలుచుకుంటె
ఇపుడైనా కన్నీరై వస్తుంది..
దారంతా చేయిపట్టి
చివరిదాక నడిచాను,
అలసిపోతె
చెమట తుడిచి చిరునవ్వులు పంచాను..
ప్రతి అడుగూ
వేడుకుంటు వెంకన్న సన్నిధికే చేరాము,
మము దంపతులుగ
మార్చమని మనసారా కోరుకున్నాము..
నాకిష్టమైన
లడ్డూలు కలిసివెళ్ళి కొన్నాము,
తనకిష్టమైన
పంచ కట్టి ముచ్చటగా నడిచాము..
మంచులాంటి
తన మనసుకు రక్షణ నేననుకున్నా,
తన నవ్వును
బతికించడమే నా భాగ్యం అనుకున్నా..
కారుమొబ్బు
లాంటి కులము, మా ప్రేమను మింగేసింది,
కావ్యమంటి
మా ప్రేమ కథలుగానె మిగిలింది..
బెజవాడలొ కనకదుర్గ గుడికి కలిసి వెళ్ళాము,
దివ్యమైన ముఖకాంతి చూసి మంత్ర ముగ్దులయ్యాము..
మా పెళ్ళి చేసి పెట్టమని చేతులెత్తి
మొక్కాము,
మా వాల్ల మనసు మార్చమని మనసార వేడుకున్నాము..
నా చేయిపట్టి నడవమని తను దెగ్గరగా
నడిచింది,
అర్చన చేయించి మరీ నాకు దారాన్నే
కట్టింది..
చేతికి కట్టిన దారపు చిరునవ్వేం తరగలేదు,
అది కట్టిన నా ప్రాణం మాత్రం ఇక ఏనాటికి
తిరిగిరాదు..
కులము అనే కుంపట్లో మా ప్రేమ కాలి
పోయింది,
వెన్నెలంటి మా భవిష్యత్తు వేవేల ముక్కలయ్యింది..
సీతారాముల
సన్నిధి భద్రాచలమెళ్ళాము,
ఆదర్శమైన
దంపతులను తనివితీర చూశాము..
భక్తీశ్రద్దల
నడుమన "శ్రీరామా" అన్నాము,
మా ప్రేమను
దీవించమని దీనంగా అడిగాము..
మీ పర్ణశాల
వర్ణాలను అణువణువూ గమనించాము,
మీ ప్రేమకు
సాక్ష్యమైన గోదారిలోన విహరించాము..
ఓ భద్రాచల
శ్రీరామా మా ప్రేమ మాకు కావాలి,
మీ సాక్షిగ
కలిసిపోయి మీ దారిలోన నడవాలి..
నా చిన్నారిని
భద్రంగా చూసుకోవాలనుకున్నాను,
తన ప్రతి
అడుగుకు తోడుగా నడవాలనుకున్నాను..
కులము అనే
కట్లపాము కాటుకు బలి అయ్యాము,
కన్నవాల్ల
ఖఠినత్వము తొలిసారిగ చూశాము..
సాంఘీ గుడికై ఎక్కిన ప్రతి మెట్టు
సాక్షిగా,
చిలుకూరిలో చేసిన ప్రతి ప్రదక్షిణం
సాక్షిగా...
బిర్లా గుడిపై వెలిగే ఆ తెలుపురంగు
సాక్షిగా,
తిరుమల గుడికై దాటిన నీ ఏడు కొండల
సాక్షిగా..
నిను చూసిన ప్రతిసారి ఒకే కోరిక కోరాము,
మా పెళ్ళి చేసి పెట్టమని ప్రతిచోటా
మొక్కాము..
చూశావా వెంకన్నా ఈ కులము ఏమి చేసిందో,
మా జంటను విడతీసి విర్రవీగిపోతుంది...
వైజాగ్ కైలాసగిరి
శివపార్వతులారా,
తప్పక విడిపోయిన
మా గతిని నేడు చూశారా..
మీ దరికి
వచ్చి మొక్కిన ఆ రోజు మీకు గుర్తుందా,
మీ శక్తికూడ
ఈ కులము కొలువు దాటలేకపోయిందా..
ఓ సింహాచల నరసింహా నే ఒంటరినై పోయాను,
నా ప్రాణమైన చిన్నారిని చేరలేకపోయాను...
ఓ యాదగిరి నరసింహా నేను ఓడిపోయాను,
ఓడిపోయి విడిపోయి చీకటిగా మిగిలాను..
మీ గుడిలోకీ
వచ్చాము ఓ ఇస్కాన్ శ్రీకృష్ణుడా,
మీ భజన కూడ
చేశాము ఓ కరుణమూర్తి గోపాలుడా..
మా ప్రేమకున్న
నిజాయితీ నీకు తెలియనిదేం కాదుగా,
తనకున్న ఒక్క
నమ్మకం, నీ నామ స్మరణేగా..
నాకోసం రాకున్నా,
నీ భక్తురాలు ఉందిగా,
వచ్చి కాస్త
ఓదార్చి, నాకు అప్పగించలేవా..
అచ్చం నీలాగే
తనని కాపాడుకుంటు ఉంటాను,
తన నవ్వును
పోశించుతూ నిత్యం తోడుంటాను..
ఓరుగల్లు వేయి స్థంభ గుడిలోని శంకరా,
నీ సన్నిధికీ వచ్చి మేము మొక్కామని
గుర్తుందా..
నీ ముందరున్న నందికీ నా పరిస్థితిని
చెప్పాను,
నీ సమక్షానె తన నుదుటిపైన బొట్టు
కూడ పెట్టాను..
దాన్ని కులము వచ్చి తుడిచింది, మీ
ధ్యాన భంగమవ్వలేదా?
ఈ కులము కూడ మీనుంచి వరమేదైనా పొందిందా?
కారణమేదైనా
మా కథ అయితే ముగిసింది,
గతి తోచని
నా ప్రేమ కన్నీరై పొంగింది...
గుణము వెంటె
కులమని వాదనలే చేశాను,
కులమే ఒక
గణమని నీతులు వింటున్నాను..
పాముకాటు
చెడ్డదని చెప్తుంటే విన్నాను,
ఈ కులముకాటు
చవిచూసి చావుదెబ్బ తిన్నాను...

