Saturday, April 25, 2020

నా తొలి గ్రంధాలయం


అమ్మ ఒడిన కూర్చునే, తొలి అక్షరాలు రాశాను..
నాన్న వేలు పట్టుకునే, తొలి అడుగులు వేశాను...
నాకు ఏడైనా నిండందే, నాన్న నూరేళ్ళూ నిండాయి...
తండ్రి ప్రేమైనా తెలియందే, నేను తనకు దూరమయ్యాను...

ఆనాడు మొదలు నాకంటూ, మా అబ్బే తండ్రయ్యాడు..
నా అలోచన తీరుకు, తానెపుడూ తోడున్నాడు...
అమ్మ కష్టంతో ఎదిగినా, అబ్బని చూస్తూనే పెరిగాను...
తన ఆదర్శపు భావాలను, గమనిస్తూనే నడిచాను..

మాట కొంత కఠువైనా, తన మనసెప్పటికీ మంచిదే..
తన ముక్కుసూటి మాట వెనుక, మర్మమేమి ఉండదు...
ప్రయోజనం ఆశించని, పరుల మనిషి తాను..
పదవులేవి లేకున్నా, పరోపకారి తాను..

నా వరకైతే మీరెపుడూ, గ్రంధాలయ సమానం..
మన ప్రతి సంభాషణ, నే చేసిన పుస్తక పఠణం..
"సమన్యాయం" శీర్షికతో మీరు నేర్పిన పాఠాలు,
దశాబ్దాలు గడిచినా, అవి నా వ్యక్తిత్వపు పునాదులు...

అవ్వా తాతా అన్నా, అబ్బా జేజీ అన్నా...
పిలుపులోని మాధుర్యం, వరుసలోన ఉండదు..
ప్రతి పిల్లవాడి బాల్యానికి చిరునామా మీరు..
మా భవిష్యత్తు విజయాలకి బాటలు వేస్తారు...

మా జీవిత పోరాటం ముగియందే,
మీ వయసు పెరిగిపోతుంది...
మాకు విజయమైన రాకముందే,
దేవుడి పిలుపు మీకు అందుతుంది...

వేల విజయాలు మమ్ము చేరినా,
మాకు మీరు లేని లోటు తీరదు...
మేము ఎన్ని కష్టాలను దాటినా,
మీ చంతలేని అసంతృప్తి తగ్గదు...

వేల జ్ఞాపకాలను ఇచ్చారు,
వేగంగా జ్ఞాపకమైపోయారు..

మీ మనవడనే నా పేరున, మీ ఉనికి ఎప్పటికీ పదిలమే...
మీరు భౌతికంగ దూరమైనా, మీ భావాలు నన్ను వీడవులే…

Monday, April 6, 2020

ప్రకృతిలో నీతులు - 4



పది అంగుళాల పూలమొక్క, సువాసనలనిస్తుంటే,
పాతికడుగులున్న వెదురుపొదే, తన ఎత్తును చాటుతుంది..
ఎత్తొకటే కాదెపుడూ, ఎదుగుదలకి కొలమానము,
ఆస్తొకటే తేల్చలేదు, ఓ మనిషికున్న విలువను...

సమస్తాన్ని దహించగలుగు ఉష్ణము తన చెంతున్నా,
గగనచరుల వెలుగుపంచు, గుణమే తనకుంది అని...
రవినే రాజన్నారు, తన వల్ల కాంతి పొందారు...
ధనమూ అధికారము, కావసలే కొలమానము,
జనము మెచ్చు రాజుకు, గుణమే ప్రప్రధమము...

వరదపొంగు వానలని, వడదెబ్బల ఎండలని,
సుడిగుండపు గాలులని, చలికత్తుల పొగమంచులని,
మన భూమాతకె తప్పలేదు, ఆ దేవుడి పరీక్షలు..
ఇక మనమెంతని, ఆ అంతులేని విధిరాతముందు..

తూర్పూ పడమర కూడా, శోకము సౌఖ్యము లాగే..
సూర్యుడు ఆ దిక్కులను, మనుషులు సుఖదఃఖాలను,
దాటి నడవలేరు కదా, యుగాలెన్ని గడిచినా,
ఓవైపు నిలవలేరు కదా, శోభో సుఖమో ఉందని...

శిసిరాలకు శిరస్సు వంచి, వనాలు నేల కూలవు..
వసంతాన వర్ణాలతో, తిరిగి వికసించక మానవు...
సంకల్పం తోడుంటే, ఏ సమస్యైన చిన్నదే...
శ్రమపడేటి తత్వముంటే, ఆ సవాలైన సాధ్యమే...