Monday, June 25, 2018

ప్రకృతిలో నీతులు - 3


ఒక్క అడుగు కూడ విలువైందే, అది ముందడుగే అవుతుంటే...
గుప్పెడు గింజలైన ఘణమే, అవి ఒకరి కడుపు నింపుతుంటే...
పరిమాణంతో పని లేదు, మంచి తలపెట్టే మనసుకి...
పారితోషకాల ఊసు రాదు, సేవాతత్వమున్న మనిషికి...

ప్రతి వృక్షం పడిపోదుకదా, చెడు వడగాలుల దాడికి...
కష్టం వెనుతిరిగి పోద, చెదరని నీ సంకల్పం దాటికి...

సూర్యుడైన ఒక్కసారిగ, ఏ చీకటినీ చీల్చడు..
కొంత కొంత వెలుగిస్తూనే, చివరికి ఓ జ్వాలవలె వెలుగుతాడు..
చీకటనే కష్టానికి భానుడు భయపడి ఉంటే..
చిరు కష్టాలకి కలతపడే, మన మనుజాతి వెలుగు చూసేనా..  

చిన్న పిల్లలుగా, తప్పటడుగులేస్తుంటే చూస్తాము..
పదే పదే పడుతున్నా, పదమంటూ ముందుకు నడిపిస్తాము...
పెరిగి పెద్ద అవగానే ఈ సూత్రము వదిలేస్తాము..
ఒక్కసారి పడిపోగానే, ఇక నడవలేము అంటాము...
ప్రతి పరుగూ వెనుక ఉంది, ఆ తప్పటడుగు తాపత్రయమే..
ప్రతి విజయం వెనుక ఉంది, ఇలాంటి ఓ తాత్పర్యమే..

ఘర్జించే ప్రతి మేఘము, క్రోధ సంద్రంతో రగులుతున్నా...
చినుకుకున్న చలువనైతే ఏమాత్రం తగ్గించదుగా..
పరిస్థితుల గతులు, మన మనసుని కలచి వేస్తున్నా..
దాన్ని మనవాల్లపైన చూపటం ఎంతవరకు సమంజసం...

ప్రతి చినుకూ చేరలేదు, దాహమున్న గొంతుని..
ప్రతి ప్రయత్నమూ తీర్చలేదు నీ ముందరున్న కష్టాన్ని..
మన ఉనికి నిలుపు ఈ జలకోఠి, చిరు చినుకుల సమూహమే...
తీరిపోవు మన ప్రతి కష్టం, వేల ప్రయత్నాల సాఫల్యమే...

ఆశన్నది ఆచరణై, అంచలుగా ఎదుగుతుంటే..
కసి అన్నది రేపటిని, రంగులతో నింపగలదు...
మార్పన్నది మంచికై, మనసునుంచి పుడుతుంటే...
వ్యక్తిత్వమె వికసించి, వేల వెలుగులనే నింపగలదు..

మంచైనా చెడు అయినా, నీలోనే ఉంటుందని...
పుణ్యమైన పాపమైన, అది నీతోనే వస్తుందని...
కోపమైన శాంతమైన, అది నిన్నే మార్చేస్తుందని...
ధైర్యమైన భయమైన, అది నీ రేపుని శాసిస్తుందని...
ప్రేమైనా ద్వేశమైన, అది తిరిగి నిన్ను చేరునని...
గెలుపైనా ఓటమైన, అవి రెండూ అతి ముఖ్యమనీ...
నమ్మి నడిచి చూడరా..
నీలోని మార్పు గమనించరా...