ఇది అమ్మకు అంకితం
Hello - Thank you for taking time to explore my content. Feel free to reach out to me on bharath.marreddy@gmail.com for your comments & suggestions. Best, Bharath
దేశ మనుగడకే మూలమైన, సమాజాన సామాన్యులారా...
ప్రజల పాలనలో లీనమైన, సర్కారీ సామంతులారా...
ఈ వికలాంగుల కథకి కాస్త, సమయాన్నే ఇవ్వగలరా???
నేడు సానుభూతితోన కాకుండా, శ్రద్ధతోన వినగలరా???
అంగవైకల్యం మా జీవితాన, పుట్టుకతో వచ్చినా,
మా జీవన గమనంలో, పరిస్థితులె తెచ్చినా,
ఆ భగవంతుడి ఆజ్ఞకి, ఏనాడో తలవంచాము...
మా భౌతికలోపాలని, మనసారా స్వీకరించాము...
మనము మార్చలేని విషయాలకు, కన్నీల్లూ కొన్నాళ్ళే,
మనకున్నదె వరమనుకుంటే, ఊరంతా ఉన్నోళ్ళే...
నిజముని జీర్ణించుకుని, నడకను సరికొత్తగ సాగించాము,
ఎదురయ్యే సమస్యలకు, సాధనతొ సమాధానమిచ్చాము...
ప్రకృతి మా పరిస్థితికి, మార్గం ఏదోలా చూపుతుంది,
ప్రభుత్వ ప్రతి కట్టడమే, ఒక పరీక్షలా ఎదురౌతుంది...
ప్రతి వందలోన పదిమంది, భౌతికలోపాలతొ ఉన్నాము,
పలురకాల అవరోధాలతొ, నిత్యం యుద్ధం చేస్తున్నాము...
బస్సు నుంచి మొదలుకొని, బ్యాంకుల ద్వారాలవరకు,
పైవంతెన మొదలుకొని, రోడ్ల పక్కనున్న మార్గాలవరకు,
ప్రతి సదుపాయం ఒక సవాలుగా, ఎత్తులోన కనిపిస్తుంది...
ఈ పోటీ ప్రపంచాన, మమ్ము తొలి అడుగునె తోసేస్తుంది...
ఈ దేశంలో ప్రతి నిర్మాణం, మెట్లతోనె మొదలౌతుంది,
మాలాంటి మనుషులందరిని, వాకిట్లోనే వెలివేస్తుంది...
పొరుగు దేశాల్లో కట్టడాలు, మాలాంటి వాళ్ళ నేస్తాలు,
అవస్థ పడిన ప్రతిసారీ, మాకు అందించే హస్తాలు...
అక్కడ మెట్లుఉన్న ప్రతిచోటా, మాకుకూడ దారుంటుంది,
సమాజాన అన్నిటిలో, మాకు సహజంగా చోటుంటుంది...
మన భారత దేశంలో, ప్రతిదానికి పన్నుంటుంది,
పన్నుచేరి ప్రతివస్తువును, ఇంకాస్త ప్రియము చేస్తుంది...
దేశం ఏదైనా, మనిషికి కాల్లునందుకు పన్నుంటుందా??
ప్రపంచాన ఎక్కడైన, నడక దినదినమూ ప్రియమౌతుందా??
మావరకు కాల్లంటే, మము నడిపించే వీల్ చైర్లు కాదా???
మా నడకకు పన్నేస్తుంటే, అది కాస్తైనా అన్యాయమవదా???
వృద్ధి చెందుతున్న దేశమంటె, ఊకొడుతూనే ఉన్నాము,
మార్పు అతిత్వరలో రావాలని, ఆశతోన చూస్తున్నాము...
తోటివారు కదిలిపోయి, మమ్ముచూసి జాలిపడతారు,
వీలైన చోట ప్రతిసారీ, ముందుకొచ్చి సాయపడతారు...
సమాజమా మీ సానుభూతి, స్వచ్ఛము అని నమ్ముతాము,
కానీ, దాన్ని స్వీకరించి మేము, ముందుకైతె నడవలేము...
సానుభూతికి బదులుగా, ఒక సహకారం చెయ్యండి,
మాపైన ఉన్న అభిప్రాయాలను, మొత్తంగా మార్చుకోండి...
మా లోపాలను చూడకుండ, మీ లోకంలో కలుపుకోండి,
మీ అందరిలా మేము కూడ, సమర్థులమని నమ్మండి...
మా అడుగులు తడబడినా, లోన ఆత్మవిశ్వాసం తగ్గదు,
నడక నిదానంగ సాగినా, లక్ష్యం ఒడి చేరుదాక ఆగదు...
మా పూర్వ జన్మ పాపాలకి, ఈ లోపం ఒక ప్రతిఫలమని,
మా కన్నవాళ్ళ కర్మలకు, పెద్ద శిక్షే మా పుట్టుక అని,
స్వచ్ఛమైన మీ మనసుని మలినాలతొ నింపకండి,
ఆ భగవంతుని సృష్టిలో అన్నీ భాగం అని నమ్మండి...
ఈ లోపాలను శాపాలుగ, మేమెముడూ అనుకోము,
కలల ఛేదనలో లీనమై, ఇది లోపమనే మరిచాము...
అంధుడైన ప్రతివాడూ, కళ్ళు కావాలని కోరుకోడు,
అంధకారాన్నీ ఎదుర్కునే, సామర్థ్యంకై శ్రమపడతాడు...
కాల్లులేని ప్రతిమనిషీ, కుమిలిపోయి కూర్చోడు,
నరనరాన్ని కదిలించి, అనుకున్నది సాధిస్తాడు...
చదువులైన ఆటలైన, అందరికీ సాధ్యమే,
ఆ అందరిలో మేముకూడ, ఎప్పటికీ భాగమే...
అంగవైకల్యం అవరోధంగా, మాకెపుడూ అనిపించదు,
ఎదురీదలేని సంద్రంలా, ఈ లోకం కనిపించదు...
దృడసంకల్పం మా మనసును, ఎన్నటికీ వీడదు,
ఇబ్బందులు వేలున్నా, అవి మా లక్ష్యాలకు తెలియదు...
సెలయేటిలోని సవ్వడులు, నదిన ప్రతిదినమూ లేకున్నా,
జలపాతమంత అందంగా, నది నడకలు సాగకున్నా,
నది ఏనాడూ నీరసించి, తన ప్రయాణాన్ని ఆపదు,
సంద్రమనే గమ్యానికి, సగర్వంగ చేరుకోక మానదు...
జలపాతము నదిని చూసి, సానుభూతి చూపదు,
మనమంతా ఒకటేనని, నదిలో కలిసిపోక మానదు…
లోకం అందరికీ ఒకలాగే, ఎన్నటికీ ఉండదు,
వ్యక్తికి ఒక రకముగా, తాను ఎదురవ్వక మానదు...
కష్టాలకు కరిగిపోయి, కాలం నెమ్మదిగా గడవదు,
కారణాలు ఎన్నున్నా, ఓ క్షణమైనా నిలవదు...
ఒక ఇద్రియాన్ని కోల్పోయి, ఇబ్బందులు పెరిగినా,
క్షణకాలంలో ప్రపంచము, సరికొత్తగ ఎదురౌతున్నా,
అడుగడుగున తడబడినా, నీరసించి నిలబడము...
ప్రాణం ఉన్నంతవరకు, మా ప్రయాణాన్ని ఆపము...
ఇట్లు,
మీలోని కొన్ని కోట్ల వికలాంగులం...
Written by
చిన్న…