వృద్ధాశ్రమాన్ని నడుపుతున్న, సాధారణ మనిషిని,
వారి కష్టాలకు దెగ్గరగా, బతుకుతున్న మహిళని,
కరుణలేని కొడుకుల, నిత్య నటనలకే సాక్ష్యాన్ని...
అంధకారమైన అమ్మల, సుఖదుఃఖాలకు శ్రోతని...
అందరుండి ప్రేమలేని, అభాగ్యులై కొందరు,
ఎవరులేని జీవితాన, అనాధలుగ ఇంకొందరు,
ఒక్కక్కరిగా ఆశ్రమాన, బాధలతో చేరారు...
ఒకరికొకరు దెగ్గరై, బంధువులుగ మారారు...
అనాధలను పంపింది, ఆ పైవాడే అనుకున్నా,
అభాగ్యులను చేర్చింది, పేగుపంచుకున్నోళ్ళే...
అందరిలో కొందరికి, స్థోమత లేదనుకున్నా,
అధికులైతే దర్జాగా, సంపదతో ఉన్నోళ్ళే...
ఇల్లాలితో పడలేదని, నిర్లక్ష్యంతో కొందరు,
ఇంట్లో బరువయ్యారని, నిర్లజ్జతొ ఇంకొందరు...
ఉద్యొగానికి అడ్డమని, సాకులతో కొందరు,
విదేశాలు పిలిచాయని, స్వార్థంతో ఇంకొందరు...
అవలీలగ అమ్మనైన, ఆశ్రమాన పెడతారు...
నటనలతో నవ్విస్తూ, తిరిగొస్తామని నమ్మిస్తారు...
పిచ్చితల్లి పసిగట్టలేదు, పసికందు మెదడు ముదిరిందని...
అమ్మప్రేమ గుర్తించలేదు, తన ప్రాముఖ్యత ముగిసిందని...
కడుపుతీపిని దాటలేదు, కన్నప్రేమ ఎప్పటికీ,
కొడుకుని దూషించలేదు, ఇది దారుణమైనప్పటికీ...
ఆశ్రమాన అతిధిలాగ, వచ్చానని నమ్ముతుంది,
నవ్వుకుంటు నలుగురితో, సరదాగా గడుపుతుంది...
తనకోసము తనయుడే, వస్తాడనుకుంటుంది,
తొందర్లో సొంతింటికి, వెళ్తా అనుకుంటుంది...
నెలలైనా కొడుకునుంచి, పలకరింపు రాదాయె,
కలనైనా జ్ఞాపకాలు, మనసు దాటి పోవాయె...
సమయం గడిచే కొద్దీ, స్పష్టత తనకొస్తుంది,
ఆశ్రమమే ఇకనుంచి, శాస్వతమనిపిస్తుంది...
నిజాలన్ని నీరుగా, కనులనుంచి జారతాయి,
కలతలన్ని నేరుగా, ఆరోగ్యంపై పడతాయి...
ఇది దారుణమని తెలిసినా, తను కొడుకుని నిందించదు...
వాడు కారణమై కనిపిస్తున్నా, తిరిగి మంచికోరక మానదు...
బాధను గుండెలోనె దాచుకుంటు, బతికేస్తూ ఉంటుంది...
కొడుకుని మనసులోనె మోసుకుంటు, కలవరపడుతుంటుంది...
తోటి అమ్మలు తన బంధువులై, బాధల్లో తోడుంటారు...
ఒకపడవలోని వాళ్ళమంటు, వారి కథను పంచుకుంటారు...
కాలంతో సాగుతూ, ఒక కుటుంబమై కలిసుంటారు,
కారణాలు ఏవైనా, రోజులు తిరిగిరావు అంటారు...
సమూహంగ సాయంత్రం, సుఖదుఃఖాలను పంచుకుని,
సంభాషణలో సాగుతున్న, బంధాలను తలచుకుని,
ప్రతిరోజూ ఉప్పొంగుతున్న, బాధనుంచి తేరుకుని,
తల్లి లేకున్నా తనయుడు, బాగుండాలని కోరుకుని,
బాధనుంచి విముక్తికై, భక్తి వైపు వెళతారు,
బారమంత తగ్గేలా, భజనలెన్నొ చేస్తారు...
ధ్యానంతో ప్రశాంతతని, ప్రతిరాత్రి కొనుక్కుంటారు,
దైవంతో మమేకమై, నెమ్మదిగా నిదురిస్తారు...
కాలంతో అందరికీ, వయసు మీద పడుతుంది,
కలతలతో ఆరోగ్యము, మాటవినను అంటుంది,
మనసులోని బాధంతా, ఉచ్చస్థితికి చేరుతుంది,
నీ జీవిత పరమార్థం, ఇంతేనా అని అడుగుతుంది...
దైవము ప్రత్యక్షమై, తనచెంతకు పిలుస్తుంది,
దేహము నిర్జీవమై, ఇక సెలవని అంటుంది...
స్వర్గము స్వాగతమంటూ, తలుపులనే తీస్తుంది,
అలసిన ఆ తల్లి మనసు, తనువుని చాలిస్తుంది...
వృద్ధాశ్రమాన వినిపించే, వేల కథలు ఇలాంటివే,
వదిలేయబడ్డ వృద్ధుల, వేదనకిది సాక్షమే...
ఏరుదాటగానె పడవలని, తగలేసే తనయులారా...
నిను కనిపెంచిన అమ్మనీ, కాదని వదిలేశారా...
కన్నతల్లి కష్టమే, నేటి మీ స్థోమతని మరిచారా???
వృద్ధాప్యంలో బాగోగులు, మీ బాధ్యతని గుర్తించలేరా???
నవమాసాలూ మోసిన తను, నవరత్నాలను కోరదు,
తన పుత్రుడె రత్నమని, నిను చూపక మానదు...
నువు ఓటమితో వచ్చినా, తల్లి ప్రేమ తగ్గదు,
తన జీవితాన ఎన్నటికీ, నీ ప్రాధాన్యత మారదు...
చిన్నదేలె ప్రపంచము, ప్రతి తల్లికి పిల్లలతో,
చిద్రమేగ తన ప్రాణము, తనయుడె కాదనుకుంటే...
తల్లి కళ్ళముందు ఉండటమే, ఒక పుణ్యమని నమ్మండి...
తన విలువ మీకు తెలీకుంటె, అమ్మలేనివాళ్ళనడగండి...
అమ్మ కన్నీళ్ళకు కారకులై, కీచకులుగ మారకండి...
ఆశ్రమాల బాటపట్టి, అసురులుగా మిగలకండి...
కొత్త పాత్రలెన్ని వస్తున్నా, తల్లికి ప్రాధాన్యతనివ్వండి..
ప్రతిక్షణమూ నీ పక్షమైన, తొలి దైవము తానండి...