Saturday, May 30, 2020

కూతురి ప్రేమ (తన మాటల్లో...)


అమ్మా నీ ఆనందము, నా ఉనికికి అది ఆధారము..
నాన్నా నీ జీవితము, నా నడతకి అది మూలము..
అమ్మా నీ నవ్వు చాలు, చేరలేదు నను ఏ శోకము...
నాన్నా నీ మాట చాలు, చరపలేదు నను ఏ కష్టము …

నాకు ఏడు కూడ లేవేమో,
నాడు మనము కడగా కదిలెళ్ళినపుడు...
నిండుగ ఓ మూట కూడ లేదేమో,
ఒకటిగ మన బట్టలనే కట్టినపుడు...

ఇద్దరు కూతుర్లకు తండ్రిగా,
నాన్న బాధ్యతలే బారంగా...
అర్థం చేసుకున్న ఇల్లాలిగా,
అమ్మ భయాలన్ని బరువుగా...

ప్రతిదినమూ ప్రభాతము, కాంతి నింపలేకున్నా,
అనుక్షణమూ భవిష్యత్తు, కలవరపెడుతూ ఉన్నా,
అడుగు అడుగు లెక్కిస్తూ, ముందడుగే వేశారు...
ప్రతి దారిని ప్రయత్నిస్తూ, వెలుగులనే పోగేశారు....

మీరు అవస్థలెన్ని పడుతున్నా,
మాకు ఆనందాన్నే ఇచ్చారు...
ఎన్ని అవసరాలు పెరిగినా,
ఎప్పటికప్పుడు సమకూర్చారు...

నాన్నా, మా జీవితాన దక్కిన ఓ వరమే నువ్వు...
మా సుఖమే నీ ఆశయంగ తలచిన ఓ ఋషివైనావు..

విధియే పలు విధాలుగా, నిను వెనుకకు నెట్టినా,
నువు విలువలనే వీడలేదు, వేల ఇబ్బందులు వచ్చినా...
కాలం ప్రతి కదలికకూ, కొత్త కష్టాన్నే ఇచ్చినా,
నీతి మార్గానే నడిచావు, అడ్డదారులెన్ని నీ ముందున్నా...

ధనమూ, లాభము కావు, ముఖ్యము అనుకున్నావు,
మంచీ, మనుషులు మాత్రమె, శాశ్వతమని నమ్మావు,
కోట్ల ఆస్తి లేకున్నా, నువు గుణసంపన్నుడివే నాన్నా... 
రోజులెలా మారినా, నువు రాజువి మా గుండెలోన...

మనసంతా మమతనే, నింపుకున్న అమ్మా...
పదాలుకూడ పలకలేను, నిన్ను పొగడాలను ప్రయత్నాన...

తోటివాళ్ళు ఎదిగిపోయి, మెట్టు పైన నిలుచున్నా,
నువు నాన్నను నిందించలేదు, మనమందరిలా లేకున్నా...
నాన్నతోన అన్యోన్యతైన, అందరితో ఆప్యాయతైనా,
ఏనాడూ తగ్గలేదు, సంపాదన అటుఇటుగా సాగినా...

బాబాపై భక్తి నీకు, భరోసాను పెంచిందో,
ఎదుగుతున్న కూతుర్లపైన, నమ్మకాన్ని ఉంచావో,
ప్రయత్నిస్తున్న నాన్నకు, బరువవ్వద్దని తలిచావో,
ఎదురొచ్చిందిక ఏదైనా, మన మంచికే అనుకున్నావో,
ప్రతిణ పూని లేచావో, ప్రతి వేకువ జాములో...
నవ్వెపుడూ చదరలేదు, నీ అందమైన మోములో...

నాన్న ప్రయత్నాల ఫలితము,
అమ్మ పారాయణాల పుణ్యము,
కలగలిపి మమ్ము చేరాయి,
మా కాల్లపైనె నిలిపాయి…

ఎగుడుదిగుడులెన్ని ఎదురైనా,
మా ఎదుగుదలకె కృషి చేశారు...
నడక నెమ్మదిగా మొదలైనా,
చివరికి సర్వం సమకూర్చారు..

మూడూన్నర దశాబ్దాల, మీ అన్యోన్యత తీరుగా...
ముప్పైఐదవ తరుణం, మీ పెళ్ళిరోజు సాక్షిగా...
అమ్మా మా ప్రతి ఆలోచన, నీకు సంతోషం ఇవ్వాలనే,
నాన్నా మా ప్రతి కదలిక, నీ గౌరవాన్ని పెంచాలనే...

మీ అరోగ్యమె ఎన్నటికీ, మా ఇరువురకీ ముఖ్యము...
మీ ఆనందమె ఎప్పటికీ, మా ఇద్దరికీ సౌఖ్యము...

అమ్మ ఋణము తీర్చలేము, ఎన్ని జన్మలెత్తినా...
నాన్న మేలు వివరించలేము, ఎన్ని గ్రంధాలే రాసినా...

అమ్మా నీ భక్తిగుణము, నాకు కూడ వచ్చింది...
అది నా మనసున తొలి దేవతగా, నిన్నే ముద్రించింది...
నాన్నా నీ మార్గమే, మా విజయాలకు వారధి...
నువు నేర్పిన విలువలే మా జీవితాలకి సారధి...

ఇట్లు,
మీ ఇద్దరు కూతుర్లు

ఓ సగటు ఇల్లాలి ఆవేదన (తన మాటల్లో...)


అమ్మని దేవతగా, ఆలిని మహారాణిలా,
తోబుట్టువుకో నీడగా, తన బిడ్డని యువరాణిలా,
తనవాళ్ళకు తోడుగా, పరస్త్రీలకి సోదరునిలా,
మగువ విలువ తెలుసుకున్న, రారాజులు ఉన్నారు...

మహిళలనే మోసగించు, మృగాళ్ళ మానభంగాలని,
చిన్నపిల్లలనీ చూడలేని, కామాంధుల క్రీడలని,
భార్యను బానిసగ చేయు, భర్తల గృహహింసలని,
పడతి ప్రాణమానాలను, హరియించే రాక్షసులూ ఉన్నారు...

ఇరువురికీ మధ్యలో ఉంటారీ మగాళ్ళు..
వివరిస్తే వారిలోనె, ఎన్నెన్నో వర్గాలు...
అందరిలో కొందరే, నాలాంటివాల్ల మొగుళ్ళు..
వీళ్ళు మంచి అనే ముసుగుతోన, మగజాతికె తెగుల్లు..

మనువు మునుపు మాటల్లో, ప్రేమొకటే ఇస్తారు...
మనసొకటే చూసామని, వివరించి మరీ చెబుతారు..
ఆస్తీ కట్నము కావు, కారణాలు అంటారు..
మనకు తగినవారు తామే అని, అలవోకగ నమ్మిస్తారు..

అగమంతటి ఆశతోన, మనము మనువువైపు వెళ్తాము..
ప్రతి బాధల్లో భరోసాగ, నిలుస్తాడని నమ్ముతాము...
మాతాపితలకు ప్రతిగా, పతి ఉంటాడని అనుకుంటాము...
మనసారా నమ్మి మనము, తన వేలుపట్టి నడుస్తాము..

తోరణాల తొలినాళ్ళు, ఘనంగానె గడుస్తాయి..
మునుపు విన్న మాటల్లా, అందంగానే ఉంటాయి..
గడిచే కాలం కొద్దీ, గుణము బయటపడుతుంది...
జరిగే ప్రతి పొరపాటుకు, గళము పెరుగుతుంటుంది...

అర్ధాంగి తెచ్చు కనకము, మామగారు ఇచ్చు కట్నము..
అమ్మాయి ఉద్యోగపు వేతనము, అత్తగారి ఆస్తుల్లో భాగము...
ఏది ఎంత మొత్తంలో వస్తున్నా, అది తాత్కాలిక తృప్తికే...
ఎన్ని నదులు తనలో కలిసినా, సంద్రం తృష్ణమేమొ తీరదే...

బంధం బాధగ మారి, బరువవుతూ ఉంటుంది..
బాధల బారం పెరిగి, గడిచే కాలం గతి తగ్గుతుంది..
చనువు సన్నగిల్లి మరీ, అది భయంగానె మారుతుంది..
మనువు, అర్థాన్నే కోల్పోయి, పడతిని పనియంత్రంగా చేస్తుంది..

సరదాలను చంపుకుని, సంసారం సాగించినా...
గోడును గది దాటనీయకుండ, గుట్టుగానె బతికినా..
నయనం నిద్రను వీడి, రాత్రులు కన్నీటిని చేరుతుంది..
నువు కోరుకున్న జీవితం, ఇదేనా అని అడుగుతుంది..

అత్త ముందు మాటరాక, ఆడపడుచు అండలేక,
భర్తను జయించలేక, నాన్న బరువు పెంచలేక,
గతంలోకి నడవలేక, ప్రస్థుతాన నిలువలేక,
బాధను భరించలేక, అమ్మను బాధించలేక...
దినదినమూ దిగులు పెరిగి, ఆశ ఆవిరి అయిపోతుంది..
కణకణమూ కలత చెంది, నవ్వు నాశనమైపోతుంది..

వివాహంగ మొదలైనది, విడాకులై పోరాదని..
చట్టాల ధరికి చేరలేక, చుట్టాల ముందు చిన్నబోలేక,
నకిలీ నవ్వును మోముకు, ముసుగులాగ వేసుకుని..
తరగని బాధల బరువును, మనసులోనె దాచుకుని..
పరులతోటి పలకరింపులని, సుతిమెత్తగ సాగిస్తాము..
ప్రశ్నల ప్రతి బదులుకు, సంతోషాల పూత పూస్తాము..

పేగు పంచుకున్న పిల్లలే, సగటు ఇల్లాలికి సంపద..
ప్రాణం పోసుకున్న పుట్టిల్లే, తనకెన్నటికీ భద్రత...

నాటి పుట్టింటిలోని యువరాణులం..
నేటి మెట్టినింట మహారాణిగ కాకున్నా,
మహిళగానైనా చూడండి...

అమ్మనాన్న మనసులో అపురూపమైన సొత్తులం..
అత్తగారి ఇంటిలోని తాళాల గుత్తులేవి లేకున్నా,
మీ తోటి మనిషిగైన గుర్తించండి...