Sunday, December 27, 2020

నపుంసకుల మనోగతం (తమ మాటల్లో...) This is Third Gender’s Story

ఈ పురోగమన ప్రపంచాన, పరిగెత్తుతున్న ప్రజలారా,
భవిష్యత్తు పైన ఆశలతో, పెరుగుతున్న యువకులారా...
వెలకట్టలేని మీ సమయాన, పదినిమిషాలను మాకివ్వగలరా???
వేసిరిల్లకుండ సహనంతో, మా వ్యధను కాస్త వినగలరా???

భగవంతుని సృష్టిలో, నేను లింగానికి నపుంసకుని,
ఈ భారతదేశంలో, ఒక దురదృష్టపు జాతకుని…

వేల విధాలుగా వివక్షతో, వేధింపబడ్డ మనసుని,
ఈ స్త్రీపురుషుల సమాజాన, వెలివేయబడ్డ మనిషిని…

ఏ లోపం చూపించలేని, పసివాడిగ పుట్టాను,
బాల్యంలో అందరిలా, ఒక బాలుడిగా పెరిగాను,

కాలమేమొ నెమ్మదిగా, నా వయసును పెంచేస్తుంటే,
తలరాతే తికమకగా, నాపై ప్రశ్నలనే విసిరింది...

మనసేమో చేయిదాటి, లోన చిత్రాలను చేస్తుంటే,
మేను కూడ తీరుమార్చి, మదికి బానిసగా మారింది...

రోజులు గడిచేకొద్దీ, ఒక స్పష్టత నాకొచ్చింది,
నపుంసకున్ని నేనని, నిదానంగ తెలిసింది...

అమ్మ నాన్న ఆశ్చర్యంతో, మూగబోయి మిగిలారు,
స్నేహితులే సుతిమెత్తగ, నను దూరం పెట్టారు...

యౌవనమే యముడై, నా భవిష్యత్తుని బలిచేసింది,
సమాజమేమొ కఠినంగా, మా జాతిని వెలివేసింది...

మీ అందరిలా చదువుకుని, ఎదగాలని మా ఆకాంక్ష,
వేల ఆశలతో నడిచొస్తే, మాపై అడుగడుగున వివక్ష...
ఏది చేయాలని తలచినా, మాకు ప్రతిరోజూ ఒక పరీక్ష,
మా అసంపూర్ణ జీవితాన, ఇది ఆ విధి వేసిన శిక్ష...

మేము కన్న కలలన్నీ, గాలిలోన మేడలు,
నేటి సమాజాన వివక్షలే, వాటికడ్డు గోడలు...

చదువుకునే స్వేచ్ఛ లేక, ఉద్యోగానికి వీలు లేక,
మాకంటూ గుర్తింపు లేక, మేము ఆకలికే ఆగలేక,
నాట్యాలూ నాటకాలు, చేసుకుంటు బతుకుతున్నాము... 
ఆ వచ్చిన చిల్లరతోనే, కడుపు నింపుకుంటు ఉన్నాము...

మా జాతిలోన కొందరికి, ఈ అవకాశమైన దొరకక,
ఎన్ని రకాలుగా చూసినా, ఏ ఆహారం సమకూరక,
చేయి చాచి యాచిస్తూ, మేము రోడ్ల పైకి వచ్చాము…
మీ స్త్రీపురుషుల జాతికి, ఇంకాస్త అలుసు అయ్యాము...

చప్పట్లు కొట్టి బెదిరించే, ప్రతివారు మేము కాదండి,
మా పొట్టకొట్టి జోబు నింపుకునే, నకిలీలే వారండి...
అసలు నపుంసకుడు ఏనాడూ, బలవంతం పెట్టడు,
దయతలచి కొందరిచ్చిందే, సర్దుకుంటు సాగుతాడు...

వేధింపుల వివక్షతో, వీధిన విసరబడ్డ బతుకులు,
ఏ వైపునుంచి చూసినా, మాలోన వేల గాయాలు...
రైల్లూ రోడ్లూ కాదు, మా ఇల్లకు చిరునామాలు,
మా బస్మమైన భవితకు అవి, చితిమంటల చిహ్నాలు...

చేరదీయాల్సిన సమాజము, సమూహంగ శిక్షిస్తుంది...
రక్షించాల్సిన ప్రభుత్వము, సరిచేయకుండ వీక్షిస్తుంది...

ఏ దేశంలో లేదండీ, ఇలాంటి లింగ వివక్షత,
ప్రపంచాన ప్రతిదిక్కున, ప్రతిభదె ప్రాముఖ్యత…
మనదేశంలో ప్రతిచోటా, స్త్రీపురుషులదే ఆధిక్యత,
ఏ జాగృతికీ తోడ్పడదా, మా జాతితోన సఖ్యత???

ఒక మొక్కకు నిలువెల్లా, ఏ సువాసనలు లేకున్నా, 
ఎన్నాళ్ళు వేచి చూసినా, కుసుమాలూ పూయకున్నా,
వివక్షనేది ఉంటుందని, పాపం మన ప్రకృతికేం తెలియదు, 
మాను ప్రాణంతో ఉన్నవరకు, అన్నీ సమకూర్చక మానదు...

పసిపిల్లల తల్లులూ, మీరు భావితరపు నిర్మాతలు…
మీ పిల్లలనే పెంచుతూ, మంచి చెడులు నేర్పుతారు...
లింగబేధమొద్దు అంటూనే, స్త్రీపురుషులె సమమంటారు,
మేము కూడ ఉన్నామని, ఓ క్షణమైనా తలిచారా???

సమాజాన్ని తీర్చిదిద్దు, వెలకట్టలేని గురువులూ,
మీరైనా తగ్గించగలర, ఈ వేధింపుల బరువులు???
మీ నోటి వెంట వచనాలు, విద్యార్థులకే ఉత్తర్వులు,
ఆ బోధనలకు ఆగగలవు, మా రేపటి అశ్రువులు...

మీ ఆశయాల సాధనకై, నిత్యం శ్రమపడేటి యువకులార... 
మాకు కూడ మీలాంటి కలలు ఉండేవని నమ్మగలరా???
గొప్ప మనసు చేసుకుని, నేడు మాకు తోడు నిలవగలర???
ఈ వివక్ష ఒక పాపమని, రేపటి తరముకు నేర్పించగలర???

కనిపిస్తేనే భయపడేంత, ధుర్మార్గులమేం కాదండి,
మాలాంటివాళ్ళు ఎదురైతే, దూరంగా వెళ్ళకండి...
మేము కూడ మనుషులమని, ధైర్యంగా నడవండి,
రావాల్సిన మార్పుకు అది, తొలి అడుగని నమ్మండి...

మా దీవెనలే గొప్పవంటె, మీ మంచికి ప్రార్థిస్తాము,
ఈ వెనకపడిన జాతిపైన, కాస్తైనా దయ తలచండి...
శివుడి ప్రతిరూపం మేమంటూ, సింహాసనాలు వద్దండి,
మమ్ము మనుషులమని గుర్తిస్తూ, బతకనిస్తె చాలండి..

ఇట్లు,
మీలోని నపుంసకులం

Written by
చిన్న

Monday, December 21, 2020

జీవితంలో విజయాల పాత్ర...

రవికిరణం భువిని చేరి చీకట్లను చీల్చింది,

తనది కాని భువనాన్నీ కాంతులతో నింపింది...

అంధకారానికి అంతంగా మారాలని తలచింది,

అణువంతటి దారికై అనుక్షణమూ చూస్తుంది...

 

కడలి కదిలి నేలంత నీరముగా మార్చింది,

ఆవిరిగా మారి తనే అంతరిక్షాన్నీచేరింది...

అలలు అనే చరణాలతో అడుగు ముందుకేస్తుంది,

నలుదిక్కులు తానై కొలువవ్వాలని చూస్తుంది...

 

పాతిపెట్టబడ్డ విత్తు కూడ మొలకెత్తి ఊరుకోలేదు,

ఈ అవనిని జయించానని అందలమూ ఎక్కలేదు...

ఋతువులెన్ని ఎదిరించినా తన పోరాటం ఆపలేదు,

భూపొరల్లోకి వెళ్తూనే పైకెదగడమూ మానలేదు...

 

ప్రకృతిలో ప్రతి విషయం ఒక విజయానికి నిదర్శనం,

విజయాలు ఎన్ని వరించినా, తనది అలసిపోని లక్షణం…

 

తరగతిలో విద్యార్థి, ప్రథమస్థానంలో నిలిచినా,

పాఠశాల ఆవరణంలో, ప్రత్యేకంగా కనిపించినా,

నేర్చుకునే మనసుంటే, జ్ఞానానికి అంతుండదు...

ఎదగాలని అనుకుంటే, అవకాశాలకు హద్దుండదు...

 

ఉద్యోగంలో ఉద్యోగి, ఉన్నతస్థానంలో ఉంటున్నా,

సహచరులు కూడ సాయంకై, తనవైపే చూస్తున్నా,

సాధించాలనుకుంటే, సాంకేతికత ఒక సంద్రము...

అలసిపోని మనసుంటే, అందగలదు అంబరము...

 

విజయం ప్రతి పోటీలో, నీకు ఫలితంలా కనిపించినా,

జీవితమను పయనంలో, అది చిన్నపాటి ప్రోత్సాహకమే...

 

చిరు విజయాలే నెమ్మదిగా, నిను ప్రత్యేకంగా నిలిపినా,

నీ ఆశయసాధనలో, అవి ఆత్మవిశ్వాసానికి ఇంధనమే...

 

విజయం ఒక ఆభరణం,

అది ఆ కాసేపటికే సంబరం...

మన పయనమేమొ నిరంతరం,

అతీతులం కాదు ఏ ఒక్కరం...

 

గర్వమెపుడు నీ గమనాన్ని, గమ్యానికి చేర్చదు,

ఆ గాలి నీకు సోకిందో, నీ ఉనికి కూడ మిగలదు...

 

ఓటమితో కుంగిపోయి వెనకడుగే వేసినా,

విజయంతో పొంగిపోయి విలువలనే విడిచినా,

ఆ గెలుపులిచ్చు గర్వం, నిను కూల్చక మానదు...

చివరి అంఖంలో ఇరువురికీ, అంతరమేం ఉండదు...

 

అభివృద్ధికి అహమనేది, ఎన్నటికీ ఆటంకమే,

విజయానికి వినయమేమొ, ఎపుడైనా మకుటమే...

 

గత విజయాలను స్మరిస్తూ, కాలాన్నే కరిగించకు,

బలముందని భావిస్తూ, బలహీనుడిగా మారకు...

 

నువ్వున్న వృత్తి ఏదైనా, వృద్ధికి అవకాశం ఉంటుంది,

నువ్వెంతెత్తుకు ఎదిగినా, ఇంకో మెట్టు మిగిలి ఉంటుంది...

 

ఇది చాలని అనుకుంటే, నీ అలోచనె ఒక అగాధం,

ఇంకా సాధించాలనుకుంటే, నీ అవకాశాలూ అనంతం..