Monday, October 15, 2018

కొత్త కోణం

పావురమా ప్రతి పంజరమూ, నీ శత్రువు కాదు,
డేగ దాడికూడ బలి చేయలేని, కవచమైన కాగలదు...
పతంగమా ప్రతి దారం, నీ పతనానికి కాదు,
గాలి గతే పెరిగినపుడు, నీ ఆధారం కాగలదు...

అమ్మ మాట ఆవేదన, నాన్న పరువు నిలపాలని...
నాన్న నోట కఠినత్వం, అమ్మ కన్నీటిని ఆపాలని...
ఒక్కటిగా వారిద్దరు నీ గెలుపును చూడాలని,
తమ బిడ్డే ఎదుగుతుంటే, చూసి మురిసిపోవాలని...
వాళ్ళు అనే ప్రతి "వద్దూ" నీ స్వేచ్చకి హద్దు కాదు... 
నీ భవిష్యత్తు బాటచూపు అధ్భుతమూ కాగలదు… 

-------------------- ****-------------------------

రవి ఉదయించగానె రోజంతా, వెలుగుంటుందని చెప్పలేము...
ఏ క్షణమైనా కారుమొబ్బు, ఆ వెలుగులనే మింగగలదు...
కిరణం పోరాటం చేసి మరీ, కాంతినిస్తుందని నమ్మలేము...
ఆ సమరమైన అవకముందె, సూర్యుడు అస్తమించిపోగలడు...

సమూహాలు సంబరంగ పెళ్ళి చెయ్యగానె సరిపోదు...
పెద్దలిష్టపడ్డారని, పిల్లలు ఒకటవ్వాలని అనలేము... 
పంచాయితీలు పెట్టి మరీ ప్రేమను పుట్టించలేము... 
వాదనలూ, వాయిదాలు వారినొకటి చేస్తాయని నమ్మలేము... 
ఒకరికొకరంటే ఇష్టమూ, ప్రతి కష్టాన ఐకమత్యమూ...
లేని పెళ్ళి ఎంత ఘణమైనా, ఓ ఘోరానికి పునాదే...

-------------------- ****-------------------------

అనుదినమూ వేల అలలనాపుతున్న తీరము, 
అప్పుడప్పుడొచ్చిపోవు ప్రళయాలను ఆపగలిగిందా...
యుగాలపాటి అనుభవం, ఓ క్షణమైనా నిలిచిందా...
రాక్షసలల ఉప్పెనలో, తీరం రేణువులుగ చదరదా?...

దారి ఎంత చదునైనా, నీ వాహనాన వేగము...
పరిమితినే మించినపుడు, నీ అనుభవమే ఆవిరై, 
క్షణకాలంలో నీ ప్రాణాలను, పరలోకాలకు పంపగలదు... 
నీ కుటుంబాన నవ్వులనే, నట్టేటిన కలుపగలదు... 
నీ అనుభవానికి గౌరవం, అది అనుకువగా ఉన్నంతవరకె...
అది గర్వంగా మారిందో, నీ గమ్యం నీ పతనమే...