Sunday, April 23, 2017

గతమే ఒక గురువు


గతమా స్వాగతము, ఈ సాయంత్రము నీదే..
సమయం సమ్మతము, నీ స్మృతికే అందిందే..
రోజులెన్ని గడిచినా, నీ మాధుర్యం తగ్గదే..
కాలం గతి పెరిగినా, ఏ మరుపుకు నువు అందవే..

ప్రస్తుతాన పడిపోయి, పనులతోన విసిగిపోయి,
భవిష్యత్తుకి బానిసై, క్షణక్షణమూ కరిగిపోయి,
నీ పేరే తలుచుకుంటు, నీ తలుపు తట్టి వచ్చాను...
నా అందమైన గతంలోకి గర్వంగా నడిచాను...

నువ్విచ్చిన అనుభవాలు, నేటి నా విజయాలకి కారణాలు...
నువు నిలిపిన అనుభూతులు, నా నవ్వులకే తోరణాలు...
నాడు నువు నేర్పిన పాఠాలు, నేడు నా భవిష్యత్తు బాటలు,
నాడు నువు పేల్చిన తూటాలు, నేడు నా నవ్వుల సిరితోటలు…

గతమా నీ పరిచయమే నా ప్రస్తుతాన్ని మార్చింది..
గతమా నీ పరిమలమే నా మదినిండా నిలిచుంది..
గతమా మన ప్రయాణము, నాకు అణువణువూ గుర్తుంది..
గతమా నీ ప్రమేయము, నా ప్రతి విజయంలో ఉంటుంది..

అనుక్షణమూ భయపెట్టే ఆ భవిష్యత్తు కన్నా,
అటుఇటుగా సాగుతున్న ఈ ప్రస్తుతానికన్నా,
అందంగా గురుతు ఉన్న నా గతమే మిన్న..
కష్టం ఏదైనా, అది బాధించదు అవునా?

గతమిచ్చిన జ్ఞాపకాలు నా తరిగిపోని ఆస్తులు,
ఈ కనిపించని నా ఆస్తికి, సాటిరావు ఏ అంతస్తులు..
గతమెప్పుడు గొప్పదే, ఈ గడిచే కాలం కన్నా,
గతమే ఒక గురువులే, ఎంతటి మేధావులకైనా..

Tuesday, April 11, 2017

అసలైన మరణం


అనుక్షణం కొట్టుకునే మన గుండె ఆగిపోతేనా మరణం ?
ఊపిరి ఆడక మనకు శ్వాస అందకపోతేనా మరణం ?
మన కాయం ఇక కదలలేక శిలలా పడితేనా మరణం ?
ఈ శరీరమే ఇక శవమై పిలవబడితేనా మన మరణం ?

నా వరకైతే మరణమంటే ఇంకేదో ఉంది...
అది ప్రతిరోజూ ఏదోలా మనతోనే ఉంటుంది..
ప్రతి మనిషీ జీవితాన అది వేల సార్లు వస్తుంది..
వద్దన్నా ఊరుకోక గుర్తు చేసి వెళ్తుంటుంది...

మనసుకు నచ్చిన మనిషి మనకు దక్కక ఒక మరణం,
ఆ మనిషికి మన కళ్ళముందె మరో పెళ్ళి అవుతుంటే మరణం...

మనవాళ్ళే మన మనసును లెక్కచేయకుంటె మరణం,
మన మనసు ముక్కలైనా నవ్వుతుండటమే మరణం..

స్థోమత లేదని మనము పైచదువులు వదిలేస్తే మరణం,
కుటుంబాల కోసమని మన లక్ష్యాలను త్యజిస్తుంటె మరణం...

చదువు ముగిసి నెలలవుతున్నా ఉద్యోగం రాకుంటే మరణం..
మన బంధువుల సూటి ప్రశ్నలకు బదులివ్వలేక మరణం..

చేసిన ప్రతి ప్రయత్నమూ విఫలమౌతుంటే మరణం,
వెన్ను తట్టి మన వెనకుండే వాళ్ళు లేకుంటే మరణం...

చేయాలని మనసున్నా, మనకు పని దొరకక ఒక మరణం...
నెల సంపాదన మన ఇంటినె పోషించలేక ఒక మరణం..

మనవాళ్లే మారిపోయి మోసగిస్తుంటే మరణం..
మోసగించి మురిపెంగా పలకరిస్తుంటే మరణం...

కళ్లముందె జరుగుతున్న అన్యాయాన్ని ఆపలేక ఒక మరణం..
సమాజమనే సంగతిన ఉన్న అపశ్రుతిని సవరించలేక మరణం..

ఎదిగిన కొడుకులు సైతం తలకు బరువు అవుతుంటే మరణం..
ఆ కొడుకుల ఘనకార్యాలకు పరువు పోతుంటే మరణం..

మన సొంతవాళ్ళు మరణిస్తే అది మనకు పెద్ద మరణం,
ఆ లోటు మనకు తీరక బతకలేక పోవటమే మరణం..

"మరణం చెంతకు రాదే" అని చింతించుట ఒక మరణం..
బతుకంటేనే ఆశలేని ఆ బతుకునున్న చిత్రవధే ఒక మరణం..

బతుకు అనే గమనమందు ప్రతి గడియలోను మరణం..
మరణం గది చేరుదాక గడి గడిలోనూ మరణం..