Thursday, July 31, 2025

బతికుండాలనిపిస్తుంది

------------------------------------
ఈ రచన, నా ఒక్కడిదే కాదనిపిస్తుంది...
మీకు పిల్లలుంటే, మీరే దీన్ని రాసారనుకుని చదవండి,
లేదా, మీ అమ్మో, నాన్నో రాసారనుకుని చదవండి...
------------------------------------

పెళ్ళి తర్వాత, జీవితం మారుతుందంటారు,
కానీ పిల్లలొచ్చాకే, అసలైన మార్పొస్తుందనిపిస్తుంది...
పెళ్ళైతే, అన్నీ సర్దుకుంటాయ్ అంటుంటారు, 
కానీ పిల్లలుపుట్టాకే, మెదడు సరిగ్గా పనిచేస్తుందనిపిస్తుంది...

నిజమే...
పెళ్ళికి ముందు, సాహసాలకి సహచరుల్లా బతికినా, 
పెళ్ళి తర్వాత, కాస్త తగ్గాలనిపిస్తుంది...

నిజమే...
ఒంటరిగా ఉన్నప్పుడు, సంపాదన సరిపోకపోయినా, 
పెళ్ళి కాగానే, కాస్త పెంచుకోవాలనిపిస్తుంది...

కానీ, 
పిల్లలొచ్చాకే, జీవితానికి నిజమైన నిర్వచనం పరిచయమౌతుంది,
వాళ్ళ నవ్వులు చూసాకే, అసలైన ఆనందం అనుభవమౌతుంది...
ఆ క్షణం నుంచి, ఏదేమైనా, వాళ్ళే సర్వస్వం అనిపిస్తుంది, 
ఆ రోజు నుంచి, ఎలాగోలా, వాళ్ళకోసం బతికుండాలనిపిస్తుంది...

వాళ్ళ సుఖసంతోషాల్లో భాగమవ్వాలనే ఆశతో కాదు, 
బాధల్లో అవసరమైతే, అందుబాటులో ఉండటానికి బతికుండాలనిపిస్తుంది...
వాళ్ళ సంబరాలన్నింటికీ సాక్షమవ్వాలనే అపేక్షతో కాదు, 
కష్టమొస్తే, కలిసుండటానికి, కన్నీళ్ళు తుడవడానికి బతికుండాలనిపిస్తుంది... 

పడిలేస్తుంటేనే, పరిగెత్తడం నేర్చుకుంటారని తెలుసు,
కానీ వాళ్ళు పరిగెత్తిన ప్రతిసారీ, 
మన గుండెవేగం కాస్త పెరుగుతుంటుంది...

కష్టాలొస్తేనే, జీవితంలో కాస్త కఠినపడతారని తెలుసు, 
కానీ వాళ్ళ కన్నీళ్ళు చూసిన ప్రతిసారీ, 
మన కడుపులో కొంచెం కలతేస్తుంటుంది...

వాళ్ళు పడ్డప్పుడు ఓదార్చగానే,  
"ఈ పాఠమూ మంచికేలే" అనిపిస్తుంది, 
కానీ, మళ్ళీ పడ్డప్పుడు మనముండమనే, 
ఊహ తట్టుకోలేక బతికుండాలనిపిస్తుంది...

వాళ్ళకు వచ్చిన కష్టం పోగానే, 
"కాస్త నేర్చుకున్నారులే" అనిపిస్తుంది,  
కానీ, కష్టాలన్నిటికీ పక్కనుండలేమనే, 
నిజాన్ని ఒప్పుకోలేక బతికుండాలనిపిస్తుంది...

వ్యసనాలకి దూరంగా ఉండి, ఆరోగ్యంగానే కనిపిస్తున్నా, 
ప్రయాణాల్లో వేగానికి వెళ్ళక, ఎంత జాగ్రత్తగా ఉంటున్నా, 
మన చేతిలో లేని కారణాలను కూడా దాటుకుని బతికుండాలనిపిస్తుంది...

మితంగా తినడం, ధ్యానంలో గడపటం లాంటివి ఎన్ని చేస్తున్నా,
వ్యాయామంతో, జీవితంలో కాస్త కాలాన్ని కొంటున్నట్టే అనిపిస్తున్నా,
అలవాట్లకి అందని ఆటుపోట్లని అడ్డుకుని మరీ బతికుండాలనిపిస్తుంది...

వరాలపైన వ్యామోహం లేదు, 
కానీ అనుకోని అనారోగ్యాల్లో, 
కాలం సహకారముంటే బాగుంటుందనిపిస్తుంది...

అమృతం తాగాలనే ఆశసలే లేదు, 
కానీ పరిస్థితి చేయిదాటినపుడు, 
కాస్త అదృష్టముంటే బాగుంటుందనిపిస్తుంది... 

చావునాపే చదువు, మనకు లేదని తెలుసు, 
కానీ పిల్లల క్షేమంకోసమైనా, బతికుండాలనిపిస్తుంది...
కాలచక్రానికి కన్నవాళ్ళూ బానిసలే అని తెలుసు,  
కానీ పిల్లల బతుక్కోసమైనా, బతికుండాలనిపిస్తుంది... 

ఇదీ స్వార్థమేనేమో, 
కానీ కాస్త స్వచ్ఛమైనదేమో అనిపిస్తుంది...
ఇదీ అత్యాశేనేమో, 
కానీ కొంచెం కల్మషంలేనిదేమో అనిపిస్తుంది...

గమనమెటువైపున్నా, 
గమ్యం మాత్రం, పిల్లల సంతోషమే అనిపిస్తుంది...
కష్టమెంతపడుతున్నా, 
కారణం మాత్రం, పిల్లల భవిష్యత్తే అనిపిస్తుంది...

కాలంతో మారనివీ కొన్నుంటాయ్, 
కన్నవాళ్ళు పిల్లలపై పడే తపనలాగా...
కళ్ళల్లో కనిపించనివీ కొన్నుంటాయ్,
నవ్వుల వెనక కన్నోళ్ళ భయాల్లాగా...

తల్లివేర్లలోంచి ప్రభవించేవే, కొమ్మలనే పిల్లలు, 
మన కన్నవాళ్ళ మనసులకి, ఇంచుమించు ప్రతిబింబాలు...    

పూలూ పండ్లతో కొమ్మలు ఆకర్షంగా ఉంటున్నా, 
మాసాలుమారి ఆకులన్ని రాలిపోయి బోసిపోయినా,  
గట్టిపడమంటూ తల్లివేరు, వాటిని ఋతువులకే వదిలేస్తుంది...
పెద్ద కష్టమొస్తే చూద్దామని, బతికుండిమరీ గమనిస్తుంటుంది...

ఈదరగాలులనే కష్టమొచ్చి, కొమ్మలపై పడుతుంటే, 
వేర్లు పెంచుకున్న పిల్లలను, విరిచేయాలని చూస్తుంటే,  
నేలనదిమిపట్టి మరీ, వేరు కొమ్మల పునాదిలా మారుతుంది...
గాలి సన్నగిల్లువరకు, కొమ్మలని హత్తుకునే ఉంటుంది... 

వేర్లకున్న అదృష్టం మనకుంటే, బాగుంటుందనిపిస్తుంది... 
వేర్లలా పిల్లల్ని కాపాడుకుంటూ, బతికుండాలనిపిస్తుంది...

— చిన్న

Saturday, March 4, 2023

ఆటస్థలం మనోగతం (తన మాటల్లో...)

ఆటస్థలం మనోగతం (తన మాటల్లో...)

చదును తప్ప చదువులేని, చిన్నపాటి నేల ముక్కని,
ఆటలతో పాఠాలు నేర్పు, నేటి బడిపిల్లల హక్కుని... 
ప్రతి సాయత్రం పదమంటూ, బడిగంట చూపు దిక్కుని,
ఆటలొద్దు అనే పెద్దవారి, ఒక విడదీయలేని చిక్కుని...

పుస్తకాల చదువురాదు, నేను పాఠశాలలోని శాఖనే...
అక్షరాలు నేర్పలేను, నేను గురువుకి ఒక ముఖాన్నే...
సులక్షణాల సారాంశం, క్రమశిక్షణె నా పాఠ్యాంశం, 
ఆటపాటలతో అహర్నిశం, సాగుతుంది నా ఉపదేశం...

ఉదయం వ్యాయామమని, పలకరించువారు కొందరు,
సాయంత్రం సాధనని, నను చేరువారు ఇంకొందరు...
సెలవురోజైతే సందడితో, నా లోగిలంత ఉత్సవమే,
అణువణువు ఆటలతో, ప్రతిదిక్కున ఉత్సాహమే...

అప్పుడప్పుడొచ్చిపోవు, ఆటలపోటీలను చూడాలి,
నాకు అసలైన పండుగేదంటే, అదే అని చెప్పాలి...

ముందురోజు నీళ్ళు చల్లి, నాకు స్నానమల్లె చేస్తారు, 
ముగ్గుపిండితోన ముస్తాబుచేసి, శ్వేతసింధూరం పెడతారు...
రంగుల జెండాలు పాతి, చుట్టూ ఎల్లలు సరిచేస్తారు,
కుర్చీలూ డేరాలు వేసి, అతిథులను ఆహ్వానిస్తారు...

తొలుత ప్రశాంతంగ మొదలౌతూ, 
ఆట మీద ఆట జరుగుతుంది...
దినదినము వేడి పెరుగుతూ, 
అందరి ఆసక్తిని పెంచుతుంది... 
 
బయటివాళ్ళ అరుపులు, లోన ఉత్సాహం పెంచుతుంటే,
ఆటగాల్ల ఆవేశానికి, నా మన్ను మిన్ను తాకుతుంటే,
తుది ఫలితాలని పక్కనెట్టి, నేను పరవశించిపోతాను...
నేల విడిచి రేణువులై, అలా గాలిలోన తేలుతాను... 

ఆటపేరు ఏదైనా, 
ఆడుతుంది ఎవరైనా,
గెలుపిచ్చిన గర్వానికి,
ఓటమిచ్చు వేదనకి,
మొన్న ఓడినోడు, నేడు గెలిచినపుడు,
వాడు ఎదుగుతున్న తీరుకి, 
నిన్న గెలిచినోడు, ఇపుడు ఓడినపుడు,
లోన ఒదుగమన్న యోచనకి, 
ఆనందం, ఆక్రోశం,
ఉత్సాహం, ఉద్వేగం...
వెల కట్టలేని స్నేహాలకి,
వేల భావోద్వేగాలకి...
సంతోషమైన సాక్షాన్ని, 
సదా నేను వేదికని...

ఆటపాట లేకుంటే, నన్ను మన్ను అనే పిలుస్తారు,
మీఅందరి తోడుంటేనే, నాకు ఎవరైనా విలువిస్తారు...

అంటువ్యాధి ప్రభలినపుడు, మనసు ఆటవైపు వెళ్ళదు, 
అందరి అరోగ్యంకోసం, ఆటలు ఆపడంలో తప్పులేదు...
తిరిగొస్తారను ఆశతోన, నాది ప్రతిరోజూ ఎదురుచూపు,
వ్యాధి మహమ్మారి కథలోన, ప్రతివారం ఓ కొత్తమలుపు...

అలవోకగ ఈ అంటువ్యాధి, కొన్ని నెలలను మింగేసింది,
అడుగు బయటపెడుతుంటే, ఆక్షణమే అంటుకుంటుంది...
దాని తాండవాన్ని చూసి నేను, ఆశకూడ వదిలేశాను,
ప్రతిక్షణమూ మీ జ్ఞాపకాల, పేజీలని తిరగేశాను...

చిరుగాలీ, చినుకులూ,
జంతువులు, పక్షులూ...
పగలంతా రవికిరణం, 
రాత్రైతే శశినయనం...
ప్రకృతిలో వీళ్లంతా, నాకు ఎప్పటికీ నేస్తాలు,
నేను చెప్పుకునే మీ కథలకు, సంతోషమైన శ్రోతలు...

నాకున్న ప్రాణస్నేహితులు, విషయాన్ని విని ఊరుకోరు, 
లోని తీపిగురుతులను, మళ్ళీ కళ్ళముందు సృష్టిస్తారు...

చిరుజల్లులతో చినుకులు, నన్ను పైపైనే తడుపుతుంటే,
భానుడి వేడి కిరణాలు, ఆటకు సిద్ధం కమ్మంటుంటే,
జంతువులూ పక్షులూ, చిన్న గుంపుల్లా చేరుతుంటే, 
వాటి అరుపులతో, నాలోపలి ఉత్సాహం పెంచుతుంటే,

అదును చూసి మెళ్ళగా, చిరుగాలి పుంజుకుంటుంది,
తన వేగాన్నే పెంచుకుని, నన్ను గాలిలోకి తేల్చుతుంది...
అలా గాలిలోన తేలి నేను, వెన్నెల ఒడిలోనే వాలతాను,
మీ ఆటలపోటీలను, మళ్ళీ నెమరు వేసుకుంటాను…

ఇట్లు, 
మీ ఆటస్థలం…

Written by
చిన్న

Topic Credits: సుష్మ అక్క

Sunday, February 20, 2022

సంభాషణలు - మానవ సంబంధాలు

వెదురుకి ఒళ్ళంతా గాయాలని, గాలి ఎగతాళేం చేయదు,
తన సంభాషణతో వెదురునైన, వేణువుగా మలచగలదు...

దుర్గంధం దరి చేరితే, చిరుగాలి చీదరించుకోదు, 
సౌమ్యంగా ఎదురుపడి, తనలోన కలుపుకోగలదు...

కోయిల పలుకుల కోసం, వసంతమైన తిరిగొస్తుంది,
ఆమని ఆగమనంతో, కోకిల ఆహ్లాదంగా పలకరిస్తుంది...

బలవంతుడైన సముద్రిడితో, మన తీరము సంభాషణ,
ఆ మధురమైన సాంగత్యంతో, తగ్గింది కడలి ఆక్రమణ...

సామాన్యుల సంస్కారానికి, సంభాషణె కొలమానము, 
స్నేహమైన శతృత్వమైన, సంభాషణతో సాధ్యము...

ప్రతి పలకరింపు వెనకాల, వెటకారాలను జోడించద్దు,
పరులు పద్ధతిగా పలకరిస్తె, మన గొప్పగ భావించద్దు...

భౌతిక లోపాలను గుర్తుచేయు, విషయాలను చర్చించద్దు,
బాగున్నావా అన్న పాపానికి, నీ భోగాలను వర్ణించద్దు...

శోకసంద్రంలో ఉన్నోడికి, నీ సుఖాలను వివరించద్దు,
ఓ సలహా అడిగారని, వేల సూక్తులతో విసిగించద్దు...

ఎదుటివారు విననపుడు, నువు వివరిస్తూ ఉండద్దు, 
వినవలసిన సమయంలో, వివరించాలని చూడద్దు... 

నువు చెప్పబోవు విషయము, సత్కార్యానికె కావచ్చు,
నీ వరకు నీ మనసులోన, స్పష్టతెంతైనా ఉండచ్చు,
లోన అనుకుంటే సరిపోదు, బయటకి అనగలగాలి,
భాష ఏదైనా పర్లేదు, భావానికి బానిసలా మారగలగాలి...

నువు ఎంచుకునే పదాలు, లోని యోచనల్ని చెప్పగలగాలి, 
వాఖ్యం వ్యాకరణం తప్పినా, నీ మనసును ప్రతిబింబించాలి...

పదాల కూర్పు మారితే, అర్థం వ్యర్థంగా మిగలగలదు,
వాఖ్యాల వరస చదిరితే, భావం బారంగా మారగలదు...
బాగుందని చెప్పేప్పుడు, భాషకి స్వేచ్ఛనిచ్చినా,   
బాలేదను విషయాన్ని, సున్నితంగ చెప్పగలగాలి...
పొగడ్తలోని పదాలను, కాస్త అటుఇటుగా వాడినా,
విమర్శలోని వాఖ్యాలను, ఆచితూచి కూర్చాలి...

సాన్నిహిత్యమెంతున్నా, ప్రతి సంభాషణ సున్నితమే, 
పదాలు అదుపు తప్పితే, పర్యవసానం అపార్థమే...

సంభాషణ పరిమలాలే, ప్రతి పరిచయాల పునాదులు, 
సంభాషణ సుమగంధాలే, సంబంధాలకు వారధులు...

Written by
చిన్న

Sunday, January 23, 2022

నీ జననం (Bhumi’s Birth Story)

 నీ జననం (Bhumi’s Birth Story)

 

నేటికి నువు కడుపునబడి ఏడాది,
ఆనాటికి క్షణమె మాకు ఉగాది...

చిరునవ్వుల కన్నీళ్ళతో, అమ్మ చెక్కిల్లు,
తడిసిపోయి మెరిసేవి, తొలినాళ్ళు...
చిన్నచిన్న భయాలతో, గుండె చప్పుల్లు,
పెరిగిపోయి తెరిచేవి, గుడి వాకిళ్లు...

అణువంతే నువ్వున్నా,
అమ్మకు ప్రతిక్షణమూ నీ ధ్యాసే,
పనులెన్నో ఉంటున్నా,
మా ప్రతి ప్రస్తావణలో నీ ఊసే...

వారాల్లో నీ వయసు, వడిగా పెరిగేస్తుంటే,
మాసానికి ఓసారి, నువు కళ్ళముందుకొస్తుంటే,
కంప్యూటర్ తెరలుకూడ,
మా మనసును కదిలించేవి...
కనుపాపకె తెలీకుండ,
మా కంట నీరు జారేవి...

ఐదవమాసం ఎంతో అలవోకగ వచ్చేసి,
రానున్నది అమ్మాయని, అందంగా చెప్పేసి,
అమ్మనాన్న ఊహలకు, ఆకారాన్నిచ్చింది...
అవధిలేని ఆనందం, ఆకాశాన్నంటింది...

ప్రతి ఉదయం వ్యాయామం,
అమ్మకి అలవాటుగ మారింది
ప్రతి మాసం పారాయణం,
తనకు మొక్కుబడై చేరింది...

ఆమరుసటి వారమే, నీ తొలికదలిక తెలిసింది,
అమ్మనాన్న పిలుపులకి, అది బదులై వెలిసింది...
"కుట్టి" అనే ముద్దుపేరు, అమ్మ నోటె వచ్చింది,

నాటినుంచి మా పిలుపుకి, నీపేరు తోడు కలిసింది...

నీ కదలికలని లెక్కిస్తూ, అమ్మ మురిసిపోయేది,
పూట నువ్వు కదలకుంటె, కలవరపడుతుండేది...
నాన్నేమో నీ ప్రతికదలిక, తనకొసమె అంటాడు,
తానడిగిన ప్రశ్నలకి, అవి నీ సమాధానాలంటాడు...

"భూమి" అనే అసలుపేరు, నాన్న మదినె తట్టింది,

నచ్చిందను సమ్మతిలా, కుట్టితల్లి కూడ కొట్టింది...
అమ్మనాన్న పేర్లలో, మొదటక్షరాలు మురిసాయి,
అవి ముచ్చటగా కలిసిపోయి, నీపేరుగ మారాయి...

అమ్మ ఆరోగ్యం స్థిమితంగా, ధైర్యాన్నే ఇస్తుంటే,
నీ ఏదుగుదలే ఇద్దరికీ, నమ్మకాన్ని పెంచుతుంటే,
అత్యుత్తమ ప్రయాణాన, పావనమైపోయాము...
ప్రతిక్షణమూ బాధ్యతతో, పులకరించిపోయాము...

చూస్తుండగానె వేగంగా, నవమాసాలూ గడిచాయి,
ప్రసవవేదనకిక స్వాగతమని, మీఅమ్మని పిలిచాయి...
వేల మరణాలకు సమానం, బాధ అని విన్నాను,
ఆరోజుని తలుచుకుని, నేనే భయపడిపోయాను...

భయమేస్తుందను మాటకూడ, అమ్మనోట రాలేదు,
నీక్షేమం తప్ప తనకు, విషయంపై ధ్యాసలేదు...

నొప్పులు మొదలు అయిన రాత్రి నాకు, ఇప్పటికీ గుర్తుంది,
నన్ను నిద్రకూడ లేపకుండ, అమ్మ ఎంతగానో ఓర్చుకుంది

తెల్లవారు జామున, హడావిడిగా ఆసుపత్రికెళ్ళాము,
నువ్వొస్తున్నావని తెలిసి, మేము నిలువలేకపోయాము...

నాన్నైతే నీ జననం, అతిసులువని అనుకున్నాడు,
ఇంకో అరగంటకు, కుట్టితల్లి వస్తుందని నమ్మాడు...

ఆక్షణమునుంచె మొదలైంది, అమ్మకు అసలుకష్టము,
ఆసమయంలో పక్కనున్న, నాన్నది అదృష్టము...

అమ్మ సంకల్పం నాన్న కనుల, కన్నీటిని తెప్పిస్తూ,
అంతకష్టాన్నీ ఇష్టంగా, పోరాటంలా మలుచుకుంది...
తల్లిప్రేమకి తార్కాణంలా, నీ జననాన్నే చూపిస్తూ,
ప్రసవవేదననూ తట్టుకుంటు, అమ్మగ అవతరించింది...

మధ్యాహ్నం మూడుకు, నువ్వు బయటకొచ్చావు,
రాగానే అమాంతంగ, నిన్ను అమ్మపైన ఉంచారు...

అమ్మ నాన్న కన్నీళ్ళు, ఆగము అని పారుతుంటె,
మీ చిన్నితల్లి నేనంటూ, నువు మాకళ్ళలోకి చూశావు... 
మా కుట్టితల్లి నువ్వేనా అని, ఆశ్చర్యంతో మేముంటే,
నీ చిట్టిచిట్టి చేతులతో, నువు అమ్మని తడిమేశావు...

నీ బొడ్డును కత్తరిస్తూ, నాన్న భయపడిపోయాడు,
గాయత్రీ మంత్రాన్నే, చిన్నగ నీ చెవిలో చెప్పాడు...

ఆసుపత్రి గది అంతా, ఇక హడావిడై పోయింది,
అమ్మనాన్న చూపైతే, నిన్ను దాటి వెళ్ళకుంది...

దూరంగా తీసుకెళ్ళి, నిన్ను కాస్త తుడిచారు,
బరువూ బాగోగులు చూసి, నాన్న చేతికిచ్చారు...

నాన్న భద్రంగా ఎత్తుకుని, అమ్మవైపు నడిచాడు,
తన గుండెకు హత్తుకుని, తిరిగి అమ్మకప్పగించాడు...

మధ్యాహ్నం మా జీవితాన్ని, మొత్తంగా మార్చేసింది,
బంధాన్నీ బాధ్యతనీ, మాఇరువురు చేతిలోన పెట్టింది...

క్షణమునుంచి మేముకూడ, కన్నవాళ్ళమయ్యాము,
నీ క్షేమంకై తపనపడుతూ, కునుకుకూడ మరిచాము...

మీ అమ్మానాన్నలుగా, మమ్మల్ని ఎంచుకున్నావు,
సృష్టిలోనె శ్రేష్ఠమైన, పదవిని మాకందించావు...

అందమైన భూగోళానికి, నీకు అమ్మఒడితో స్వాగతం,
నిను పెంచుకునే పయనాన, ఎంతటి కష్టమైన సమ్మతం...

పసివయసున నీ క్షేమం, మాకున్న అసలు లక్ష్యము,
చెరిగిపోని నీ చిరునవ్వే, మా విజయానికి సాక్ష్యము...

విలువలనే నేర్పిస్తూ, తొలినాళ్ళలో నీ గురువులం,
హద్దుల ఇబ్బందులిస్తూ, కొన్నిసార్లు నీ బరువులం...
యువతిగ నువు మారాక, నీ ఇష్టానికి అనుచరులం,
ఏక్షణమైనా కష్టమొస్తే, నువు తలవాల్చుకునే తోడులం...

ఆయుష్మానుభవ అంటూ, అమ్మ నిన్ను దీవిస్తుంటే,
అన్నీ మన మంచికే అని, నాన్న ధైర్యాన్నే ఇస్తుంటే
అప్పుడప్పుడు ఓడినా, అది అవసరమని నమ్మాలి,
సుఖదుఃఖాలను స్వీకరిస్తు, నువు ముందుకు సాగాలి

Written by
చిన్న, కుట్టితల్లి నాన్న